కేరళలో అత్యంత కిరాతక ఘటన వెలుగులోకి వచ్చింది. 18 ఏండ్ల అథ్లెట్ మీద ఏకంగా 60 మందికి పైగా వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన సంచలనం కలిగించింది. గత ఐదేండ్లుగా పలువురు వ్యక్తులు ఆమెను భయపెడుతూ లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నారు. చివరకు క్లాస్ టీచర్లు ఆమె అదోలా ఉండటాన్ని గమనించి ఆరా తీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆ యువతి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందుకు తన ఆవేదనను పంచుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ కిరాతక ఘటనపై పథనంతిట్టా పోలీసులు కేసు నమోదు చేశారు. ఘోరానికి పాల్పడిన నిందితులపై ఫోక్సో యాక్ట్ తో పాటు ఎస్సీ ఎస్టీ అత్యాచార నివారణ చట్టం కింద కేసులు ఫైల్ చేశారు.
13 ఏండ్ల నుంచే అత్యాచారం
13 ఏండ్ల వయసు నుంచే తనపై అత్యాచారం జరిగిందని యువ అథ్లెట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ఇచ్చిన వాగ్మూలంలో తెలిపింది. ఆ సమయంలో పక్క ఇంట్లో ఉన్న ఓ వ్యక్తి తనను గట్టల్లోకి తీసుకెళ్లి, అక్కడ తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేసినట్లు వెల్లడించింది. ఆ సమయంలో వీడియో తీసి పలుమార్లు తనను బెదిరించి లైంగిక దాడి చేశాడని చెప్పింది. ఆ తర్వాత తనకు ట్రైనింగ్ ఇచ్చిన కోచ్ లు, తోటి క్రీడాకారులు, క్లాస్ మేట్స్ కూడా తన మీద లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పింది. ఈ విషయం ఎక్కడ చెప్పినా చంపేస్తామని బెదిరించడంతోనే బయటకు చెప్పలేదన్నది.
దర్యాప్తు ముమ్మరం, 28 మంది అరెస్ట్
అటు ఈ ఘటనపై పథనంతిట్టా పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దర్యాప్తు వేగవంతం చేశారు. యువతిపై ఆమె కోచ్ లు, క్లాస్‌మేట్స్, తోటి అథ్లెట్లు సహా పలువురు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు ఆధారాలు గుర్తించారు. బాధితురాలు తన తండ్రి మొబైల్ ఫోన్ ను ఉపయోగించి లైంగిక దాడికి పాల్పడిన వారితో మాట్లాడేదని గుర్తించారు. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియదని పోలీసులు తెలిపారు. ఆమె దగ్గర దొరికిన ఫోన్ రికార్డ్స్, నోట్స్ ద్వారా 60 మందికి పైగా నిందితులను గుర్తించినట్లు తెలిపారు. వీరిలో 40 మందిపై పోక్సో సహా పలు చట్టాల కింద కేసు నమోదు చేశారు. 28 మందిని అరెస్టు చేశారు. త్వరలోనే మిగతా వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
నివేదిక కోరిన జాతీయ మహిళా కమిషన్
అటు ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. విషయం గురించి పోలీసుల నుంచి ఆరా తీసింది. మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కేరళ డీజీపీని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది.
బాధితురాలిని షెల్టర్ హోమ్ కు తరలించిన అధికారులు
బాధితురాలిని చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ప్రస్తుతం షెల్టర్ హోంకు తరలించారు. బాధితురాలికి అన్నివిధాలా అండగా ఉంటామని ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ వెల్లడించింది. మరోవైపు ఈ ఘటనపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మానవ మృగాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
Read Also: నార్సింగి డబుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్, రెండో ప్రియుడే హంతకుడు!