Chandrababu Govt: ఏపీలో కూటమి సర్కార్ యూ-టర్న్ తీసుకుంటోందా? జనాభా పెరుగుదల తగ్గుతోందా? ఎందుకు సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? మళ్లీ ఇద్దరు పిల్లలుంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత కల్పిస్తూ చట్టం తెస్తామని ఎందుకన్నారు? సంపద సృష్టిస్తున్నామని చెప్పి జనాభా సంగతి మరిచిపోకూడదని ఎందుకన్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇద్దరు పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత కల్పిస్తూ కొత్త చట్టం తెస్తామన్నారు. ఇకపై ఏ పథకం అమలు చేయాలన్నా, కుటుంబాన్ని ప్రామాణికంగా తీసుకుంటామన్నది ఆయన మాట. ఒకప్పుడు జనాభా భారం కాగా.. ఇప్పుడు ఆస్తి అని చెబుతున్నారు. ఒకప్పుడు జనాభా నియంత్రణకు ప్రోత్సాహకాలు ఇచ్చామని గుర్తు చేశారు.
ఇప్పుడు జనాభా కావాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు మాట. 2026 నాటికి ఏపీ జనాభా 5.38 కోట్లు ఉంటుందన్నది లెక్కగట్టారు. 2031, 2036 ఆ జనాభా పెరుగుతుందన్నారు. ఆ తర్వాత అంటే 2041 నుంచి 2051 నాటికి క్రమంగా తగ్గుముఖం పడుతుందని అంచనా వేశారు.
టోటల్ ఫెర్టిలిటీ రేట్-(టీఎఫ్ఆర్) ఆధారంగా 2026 నాటికి రాష్ట్రంలో ఒక జంటకు 1.51 సగటున జన్మిస్తే.. 2051 నాటికి 1.07కి పడిపోయే అవకాశముందని లెక్కలు చెబుతున్నాయని గుర్తు చేశారు. బుధవారం నారావారిపల్లెలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
ALSO READ: ఎక్స్‌లో జగన్ మాట.. మమ్మల్ని గర్వపడేలా చేశావంటూ
దేశంలో జనాభా తగ్గుతోందన్నారు సీఎం చంద్రబాబు. ఈ విషయంలో సౌతిండియా డేంజర్ జోన్‌లో ఉందన్నారు. సంపద సృష్టిస్తున్నామని చెప్పి జనాభా సంగతి మరిచిపోకూడదన్నారు. సంపదతోపాటు జనాభా సృష్టి జరగాలన్నది ముఖ్యమంత్రి మాట. జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలలో వృద్ధుల సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. సంపద సృష్టి, ఆదాయ వృద్ధిపై దృష్టి సారించిన ఆయా దేశాలు జననాల రేటు పడిపోవడం వల్ల కలిగే దీర్ఘకాలిక పరిణామాలను గుర్తించడంలో విఫలమయ్యాయని వివరించారు.
సంపద సృష్టిస్తున్నామని చెప్పి జనాభాను తగ్గించుకుంటే రేపటి రోజుల సంపద ఎవరికి ఇవ్వాలో తెలియని పరిస్థితి ఉంటుందన్నారు ముఖ్యమంత్రి. అప్పుడు పెద్ద విమానాశ్రయాలు, వెడల్పు రోడ్లు ఉంటాయని, వాటిని ఉపయోగించుకునేందుకు మనుషులు ఉండరన్నది ఆయన మాట.
మునుపటి తరాలకు పెద్ద కుటుంబాలు ఉండేవని, ఆధునిక పోకడల వల్ల పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. ప్రస్తుత రోజుల్లో కొంతమంది పిల్లలు పుట్టకూడదని నిర్ణయించుకున్నారని గుర్తు చేశారు. ఒకప్పుడు మీ తల్లిదండ్రులు ఈ విధంగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలోకి మనం వచ్చేవాళ్లం కాదన్నారు.
2025లో భారతదేశ జనాభా 1,454.61 మిలియన్లుగా ఉంటుందని అంచనా వేసింది యూఎన్. దేశ జనాభా.. మొత్తం ప్రపంచ జనాభాలో 17.78 శాతానికి సమానమని పేర్కొంది. దేశంలో వార్షిక జనాభా పెరుగుదల 2022తో పోల్చితే 2023లో 0.1 శాతం పెరిగింది. 2023 నాటికి దేశ జనాభాలో 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సున్నవారు కేవలం 7 శాతం మాత్రమే ఉంటారన్నారు. అదే చైనాలో 14 శాతం, అమెరికాలో 18 శాతం మంది ఉన్నారన్నది ఐక్యరాజ్యసమితి అంచనా.