Nara Lokesh: ఏ ఫీల్డ్ కైనా.. కొత్తదనం అవసరం. క్రియేటివిటీ అంతకంటే ఎక్కువ అవసరం. సంప్రదాయ విధానాలకు కాలం చెల్లుతోంది. పాత విధానాలనే పట్టుకుంటే పని జరగదు. ఇది కంపెనీలకు వర్తిస్తుంది. ప్రభుత్వాలకు వర్తిస్తుంది. రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది. వ్యక్తులకు వర్తిస్తుంది. ఇప్పుడు టీడీపీ కూడా అదే ఫార్ములాతో వెళ్తోంది. ముఖ్యంగా… మంత్రి నారా లోకేశ్ నా తెలుగు కుటుంబం అంటూ 6 శాసనాలను ప్రతిపాదించడం ఓ హైలెట్. మహానాడుకు మహా జోష్ తీసుకొచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇంతకీ 6 శాసనాలు బంగారు భవిష్యత్ ను నిర్మించబోతున్నాయా?
రైట్ ఇదీ ఆరు శాసనాల స్వరూపం. టీడీపీ మహానాడు అంటే కార్యకర్తలకు పండగ. ఈ పండగ సంబరాన్ని మరింత రెట్టింపు చేయడం, ఒక పవర్ ఫుల్ అవుట్ పుట్ ఈ వేదిక ద్వారా బయటకు తీసుకురావడం ద్వారా లోకేష్ ఓ అడుగు ముందుకు వేశారు. మినీ మహానాడు సదస్సులు, తీర్మానాలు, చర్చలు ఇవన్నీ కామనే. అయితే మహానాడు వేదికగా లోకేష్ ప్రవేశపెట్టిన 6 శాసనాలు ఒక చర్చకు దారి తీశాయి. ఈ శాసనాలు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్.టి. రామారావు సిద్ధాంతాలకు తగ్గట్లు, మారుతున్న కాలానికి మరో రూపంగా పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా ఉన్నాయి. అంతే కాదు ఈ శాసనాలు పార్టీ భవిష్యత్ దిశను నిర్దేశించడానికి, సమకాలీన సవాళ్లను ఎదుర్కొనేలా రూపొందించారు.
కాలం మారుతోంది. ప్రజల అవసరాలు మారుతున్నాయి. వారి ఆలోచన విధానం కూడా మారుతోంది. పార్టీ మూల సిద్దాంతం స్ఫూర్తితో ప్రస్తుత ప్రజా అవసరాలకు తగ్గట్లుగా కీలక విధానపరమైన మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో లోకేష్ గ్రౌండ్ వర్క్ చేసి ఆరు శాసనాలను మహానాడు వేదికగా ప్రతిపాదించారు. 43 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు, అధికారం, ప్రతిపక్షాలను చూసిందని, మారుతున్న కాలానికి తగ్గట్లు పార్టీ కూడా అడుగులు వేయాలన్నారు లోకేష్. సమకాలీన సమాజంలో వస్తున్న మార్పులపై ఎప్పటికప్పుడు చర్చ జరిగాలని, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, పార్టీని మరో 40 ఏళ్లపాటు నడిపించడానికి అవసరమైన కీలక నిర్ణయాలపై చర్చ జరిగేలా చేయడంలో తొలి ప్రయత్నంలోనే లోకేష్ సక్సెస్ అయ్యారు.
తొలి శానసంలో తెలుగు జాతి విశ్వ ఖ్యాతి అంటూ ముందుకొచ్చారు. తెలుగు జాతి గుర్తింపును ప్రపంచ స్థాయిలో ఉన్నతం చేయడం, విద్య, సాంకేతికత, రాజకీయాలు, వ్యాపార రంగాల్లో తెలుగు వారి ఆధిపత్యాన్ని పెంచే లక్ష్యంగా ఈ తొలి శాసనం ఉంది. రెండో శాసన యువగళం. యువతకు రాజకీయ, ఆర్థిక అవకాశాలు కల్పించడం, 20 లక్షల ఉద్యోగాల సృష్టి, యువ నాయకులకు ప్రాధాన్యతతో యువశక్తిని గుర్తించడం కీ ఫ్యాక్టర్ గా మారింది. ఇక లోకేశ్ ప్రతిపాదించిన మూడో శాసనం.. స్త్రీ శక్తి. ఇందులో మహిళల భద్రత, సమాన అవకాశాలు, ఆర్థిక స్వావలంబన కోసం స్థిరమైన చర్యలు, ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం వంటి పథకాల ప్రస్తావనతో వారి అభ్యున్నతి దిశగా అడుగులు వేయాలన్నది కీలకంగా మారింది.
ALSO READ: Kavitha: బీఆర్ఎస్‌ను బీజేపీలో కలిపే కుట్ర.. అవసరమైతే జైలుకెళ్తా.. కవిత కామెంట్స్
ఇక నాలుగోశాసనం.. పేదల సేవలో సోషల్ రీ-ఇంజనీరింగ్. ఇందులో పేదరిక నిర్మూలన కోసం P-4 అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్ నర్‌షిప్ మోడల్ ద్వారా సామాజిక న్యాయం చేయడం, వెనుకబడిన వర్గాల సాధికారతకు కృషి చేయడం ఉన్నాయి. అటు ఐదో శాసనం అన్నదాతకు అండగా. అందులో రైతులకు నీటిపారుదల, పంటలకు సబ్సిడీలు, ఏటా 20 వేల రూపాయల ఆర్థిక సహాయం, న్యాయమైన మద్దతు ధరలు అందించడం టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇక ఫైనల్ గా ఆరో శాసనం.. కార్యకర్తే అధినేత. ఇందులో టీడీపీ పార్టీలోని కార్యకర్తలే పార్టీ బలంగా గుర్తించి, వారికి బీమా, విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాల ద్వారా సాధికారత కల్పించడం లక్ష్యంగా ఉన్నాయి.
ALSO READ: Pawan kalyan: టీడీపీ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నిక.. చంద్రబాబుకు పవన్ శుభాకాంక్షలు
సో శాసనాల వెనుక భారీ కసరత్తే ఉంది. పార్టీని మరింత బలోపేతం చేయడం, ఓటు బ్యాంకు విస్తరించడం. మరి ఈ దిశగా అడుగులు పడాలంటే ఇచ్చిన హామీల అమలు, సమర్థ నాయకత్వం, బాధ్యతలు నెరవేర్చడం కీలకంగా ఉండబోతున్నాయి. అవే పార్టీకి దశ దిశను చూపించబోతున్నాయి.
— Story By Vidya Sagar Reddy, Big Tv Live