“ఇంత మంచి చేసిన మనకే ఒకసారి ఈ మాదరిగా ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి వస్తే, ఏ మంచి చేయని మనిషిని, అబద్ధాలు, మోసాలు చేసే ఈ మనిషిని.. ప్రజలు తంతే ఎంత దూరంలో పోయి పడతారో వేరే చెప్పాల్సిన పనిలేదు.” అంటూ సీఎం చంద్రబాబు గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం జగన్. ఈ వ్యాఖ్యల్లో చాలా అంతరార్థం ఉంది. ప్రజలకు మంచి చేసినా తాను ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చిందనే బాధ స్పష్టంగా కనపడుతోంది. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. ఇన్నాళ్లూ జగన్ తన అపజయాన్ని ఈవీఎంలపై నెట్టేసి మాట్లాడేవారు. ఈవీఎంల వల్లే తాము ఓడిపోయామని చెప్పుకుంటూ వచ్చారు. ప్రజలంతా తమవైపే ఉన్నా ఎందుకిలా జరిగిందంటూ ప్రశ్నించేవారు. కానీ ఆయన ఇప్పుడు అసలు విషయం ఒప్పుకున్నారు. ఈవీఎంల ఊసెత్తకుండానే తన అపజయాన్ని అంగీకరించారు. ప్రజలకు మంచి చేసినా తమను ఓడించారన్నారు. ఇక ఎలాంటి మంచి చేయని చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలిచేది లేదనీ ధీమాగా చెప్పారు.
చంద్రబాబు ఈ ఏడాది పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కానీ ఉన్న ఉద్యోగాల్లో 3 లక్షలకి పైగా హుష్ కాకి
ప్రభుత్వ ఉద్యోగులకి మనపై విషాన్ని నింపి.. ఏవేవో ఆశలు పెట్టాడు. కానీ ఇప్పుడు ఆ ఉద్యోగులే చంద్రబాబు తీరుతో తల పట్టుకుంటున్నారు
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు pic.twitter.com/PBhTifbsqD
— YSR Congress Party (@YSRCParty) May 28, 2025
కార్యకర్తలు సరిపోతారా..?
“ఎన్నికలు ఎప్పుడొచ్చినా చంద్రబాబు అనే వ్యక్తి ప్రజలు ఈ పక్క తంతే డిపాజిట్లు కూడా రాని పరిస్థితుల్లో ఆ పక్క పడతారు. ఈసారి జగన్ 2.0 లో మునుపటిలా ఉండదు. ఉండదు. సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజలే కాదు, కార్యకర్తలు అందరికంటే పై స్థాయిలో ఉంటారు అని కచ్చితంగా చెబుతున్నా.” అని పార్టీ నేతల సమావేశంలో చెప్పుకొచ్చారు జగన్. కార్యకర్తల పేరు చెప్పగానే నేతలు చప్పట్లు కొట్టారు. అంతా బాగానే ఉంది కానీ.. కేవలం కార్యకర్తల్ని సంతోష పెడితేనో, ఆ పేరు చెప్పి నేతలకు ఆనందం కలిగేలా మాట్లాడితేనో ఓట్లు పడతాయా..? నేను అధికారంలోకి వస్తే వైసీపీ కార్యకర్తలకు న్యాయం చేస్తానని జగన్ అన్న వెంటనే అందరూ ఆయన మాటలు నమ్ముతారా..? మరి వైసీపీ కార్యకర్తలు కానివారి పరిస్థితి ఏంటి..? వారి ఓట్లు జగన్ కి అవసరం లేదా..? ఈ ప్రశ్నలకు ఆయన ముందు ముందు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది.
అప్పుడలా.. ఇప్పుడిలా..
2024 ఎన్నికల్లో చంద్రబాబు ఎక్కడా టీడీపీ కార్యకర్తలకు మాత్రమే న్యాయం చేస్తానని చెప్పలేదు. మహిళలు, రైతులు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల వారికి అండగా ఉంటానని చెప్పారు. పోనీ హామీల వల్లే చంద్రబాబు గెలిచారనుకుంటే.. జగన్ కూడా హామీలిచ్చారు కదా. ఆ చిన్న లాజిక్ జగన్ ఎలా మరచిపోయారు. మంచి చేసిన తననే ప్రజలు ఓడించారని అనుకుంటున్నారు జగన్. ఇప్పుడు చంద్రబాబు మంచి చేయలేదని అందుకే ఓడిపోతారని జోస్యం చెప్పారు. ఎన్నికల ముందు కూడా జగన్ ఇదే ధీమాతో వైనాట్ 175 అన్నారు. మరి దాన్ని అప్పుడే మరచిపోయారా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఈసారి మాత్రం 175 నియోజకవర్గాలు తమవేని జగన్ చెప్పలేకపోతున్నారు. చంద్రబాబుకి మాత్రం తమకంటే పెద్ద ఓటమి ఎదురవుతుందని శాపనార్థాలు పెట్టారు.
ఎన్నికల నినాదం అదేనా..?
వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ తన పాత నినాదాన్నే కంటిన్యూ చేయబోతున్నట్టు తెలుస్తోంది. తన హయాంలో ప్రజలకు 2.73లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కి పంచిపెట్టానని చెబుతున్నారు జగన్. చంద్రబాబు హయాంలో ఎలాంటి మంచి జరగలేదని, ప్రజలకు చేరాల్సిన సొమ్ము టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తోందని విమర్శించారు. అంటే రాబోయే ఎన్నికల్లో కూడా జగన్ డీబీటీ సొమ్మునే హైలైట్ చేయబోతున్నారని స్పష్టమవుతోంది. మరి దీనికి టీడీపీ కౌంటర్ ఏంటో వేచి చూడాలి.