Delhi CM: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం పదవి నుంచి తప్పుకున్నారు. సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. మంగళవారం ఉదయం జరిగిన ఆప్ ఎమ్మెల్యేల సమావేశంలో మంత్రిగా ఉన్న అతిషి మర్లేనాను లెజిస్లేచర్ పార్టీ నేతగా ఆప్ ఎన్నుకొంది. కేజ్రీవాల్ స్థానంలో అతిషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు రంగం సిద్ధమైంది. మరోవైపు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఈ ఏడాది నవంబరులో జరగబోతున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో కలిపి నిర్వహించాలని కేజ్రీవాల్ ఎన్నికల సంఘాన్ని కోరారు. ఢిల్లీ మద్యం పాలసీలో జరిగిన మార్పులకు ప్రతిఫలంగా ముడుపులు అందుకున్నారనే కేసులో మార్చిలో అరెస్టైన కేజ్రీవాల్ వెంటనే తన సీఎం పదవికి రాజీనామా చేస్తారని పలువురు భావించారు. కానీ, జైలు నుంచే పాక్షికంగా విధులు నిర్వహిస్తూ ఐదున్నర నెలల జైలు జీవితం గడిపారు. మొత్తానికి గత వారం సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేయటంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. బయటికి వచ్చిన తర్వాత మరింత దూకుడుగా పనిచేస్తూ, రాబోయే ఎన్నికలకు పార్టీని రెడీ చేస్తారని అందరూ భావించిన వేళ.. సడెన్‌గా రాజీనామా అస్త్రం ప్రయోగించి అటు రాజకీయ ప్రత్యర్థులను, హస్తిన వాసులను ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ రాజీనామా వ్యూహం ఏ మేరకు ఉపయోగపడనుంది? గతంలో మాదిరిగా ఆయన ఢిల్లీ ప్రజల సానుభూతిని మరోసారి సీఎం పీఠాన్ని అధిష్టించగలరా? ఒకవేళ ఆయన తన వ్యూహం విఫలమైతే తలెత్తే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చ నేడు దేశవ్యాప్తంగా జరుగుతోంది.
తన పార్టీని చీల్చి, తన ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్రతోనే కేంద్రంలోని బీజేపీ పెద్దలు తనను, తన పార్టీ నేతలను అక్రమ కేసుల్లో ఇరికించారనే వాదనతో ఢిల్లీ ప్రజల సానుభూతిని పొందటంతో బాటు తాను అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి ఓర్వలేకనే బీజేపీ ఇలాంటి ఉచ్చు పన్నిందనే ప్రచారంతో ప్రజల ఆగ్రహాన్ని బీజేపీకి మళ్లించాలనేది కేజ్రీవాల్ వ్యూహంగా కనిపిస్తోంది. దీనికి తోడు ‘మరోసారి మా పార్టీకి ఓటేయటం ద్వారా నేను నిజాయితీ పరుడినని ప్రజాతీర్పుతో రుజువు చేయాల్సిన బాధ్యత హస్తిన వాసులదే’ అనే భావోద్వేగ వ్యాఖ్యలు చేస్తూ.. వారిలో బలాన్ని పెంచుకునే యత్నాలు చేస్తున్నారు. నిజానికి.. కేజ్రీవాల్ నైతిక విలువలకు కట్టుబడి తన పదవికి రాజీనామా చేసినట్లు కనిపించినా, సుప్రీంకోర్టు బెయిల్ షరతులే ఆయనను రాజీనామా చేయించాయనేది కాదనలేని వాస్తవం. సీఎం కార్యాలయానికి లేదా ఢిల్లీ సచివాలయానికి గానీ వెళ్లకూడదని, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సలహా లేకుండా ఏ ఫైలు పైనా సంతకం చేయవద్దని, మద్యం పాలసీ మీద బహిరంగంగా ఎక్కడా మాట్లాడవద్దని కోర్టు తనకు విధించిన షరతులతో కాళ్లూ చేతులూ కట్టేసినట్లు కావటంతో తనకు బదులు అతిషిని వ్యూహాత్మకంగా తెరమీదికి తెచ్చినట్లు కనిపిస్తోంది.
ప్రతిదీ పక్కాగా మాట్లాడటం, అమలు చేయటం అలవాటైన కేజ్రీవాల్ జైలు నుంచి వచ్చాక కొంత తడబడుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు తాను అసెంబ్లీని రద్దుచేయనని చెప్పి, అతిషిని కొత్త ముఖ్యమంత్రిగా తెరమీదికి తెచ్చిన కేజ్రీవాల్.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఈ ఏడాది నవంబరులోనే నిర్వహించాలని కోరుతున్నారు. ఫిబ్రవరి నాటికి తన మీద ప్రజల్లోని సానుభూతి ఆవిరైపోతుందనే భయమే దీనికి కారణం కావచ్చు. ఒకవేళ.. ఈసీ కేజ్రీవాల్ కోరినట్లు ముందస్తు ఎన్నికలు జరిపినా, అందుకు ఆప్ పార్టీ ఏ మేరకు సిద్ధంగా ఉందనేది మరో ప్రశ్న. కేజ్రీవాల్, సిసోడియా వంటి వారు మద్యం కేసులో విడుదలైనప్పటికీ, వారంతా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సత్యేంద్ర జైన్, అమానతుల్లా ఖాన్ లాంటి కీలక నేతలు ఇంకా జైల్లోనే మగ్గుతుండగా, మరికొందరు నేతుల కేసుల్లో ఇరుక్కున్నారు. ఆరునెలలుగా పార్టీ, ప్రభుత్వంలో ఏర్పడిన ఇబ్బందికర పరిస్థితులతో పరిపాలన కూడా దెబ్బతింది. ఇటీవల దిల్లీలో కురిసిన వర్షాలకు ఎక్కడిక్కడ నీరు నిలిచిపోవటం, పారిశుద్ధ్యం అటకెక్కటంతో జనం ఇబ్బందులు పడ్డారు. కేజ్రీవాల్ ప్రారంభించిన గత పథకాల అమలు, పర్యవేక్షణలో అధికారుల అలసత్వంతో నెమ్మదించాయి. పైగా, గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీలోని ఏడు సీట్లనూ గెలిచి విజయోత్సాహం మీద ఉంది. ఈ నేపథ్యంలో నవంబరులోనే ఎన్నికలు జరిగితే.. నెలన్నర వ్యవధిలో కేజ్రీ పార్టీని బలోపేతం చేసుకుంటూ, ఎన్నికలకు రెడీ కావటం ఎలా సాధ్యమనే ప్రశ్నలూ వినిపిస్తున్నాయి.
గత ఆరు నెలలుగా జరిగిన పరిణామాలన పరిశీలిస్తే.. కేజ్రీవాల్ పట్ల ప్రజల్లో మునుపటి మద్దతు ఉన్నట్లు కనిపించటం లేదు. ‘ప్రజాక్షేత్రంలో గెలిస్తే తనపై సిబిఐ, ఈడీ పెట్టిన కేసులు మాఫీ అయినట్లేనా? అదే నిజమైతే, ఇక కోర్టులెందుకు? అవినీతి పోరాటం నుంచి వచ్చిన నేత ఇలా మాట్లాడమేమిటి?’ అనే ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. గత పార్లమెంటు ఎన్నికలకు కొద్ది రోజుల ముందే అరెస్టైన కేజ్రీవాల్ పట్ల జనంలో మద్దతు లేకపోవటం వల్లనే 7 ఎంపీ సీట్లను బీజేపీ ఎగరేసుకుపోయిందని అర్థమవుతోంది. మరోవైపు, అధికార పార్టీ లేదా రాజకీయ పార్టీ ఆదేశాలతో ఎన్నికల షెడ్యూల్‌ను నిర్ణయించలేమని, ఢిల్లీలో ఆప్ సర్కార్‌కు కావాల్సినంత సంఖ్యా బలముందని, అలాంటప్పుడు ముందస్తు ఎన్నికలు జరపాల్సిన అవసరమేమీ లేదని ఈసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మందస్తు ముచ్చటకు అవకాశాలు లేనట్లే కనిపిస్తోంది. మరి ఆయన ఇప్పుడు సంధించిన రాజీనామా అస్త్రం.. 5 నెలల తర్వాత జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పారుతుందా అనేది వేచి చూడాల్సిందే.
Also Read: Jammu Kashmir Elections: పదేళ్ల తర్వాత తొలిసారి ఎన్నికలు.. అందరికీ అగ్నిపరీక్షే!
మరోవైపు, దేశాన్నంటినీ పాలిస్తున్న బీజేపీ.. దేశ రాజధాని పీఠాన్ని దక్కించుకోలేకపోవటాన్ని అవమానంగా భావిస్తోంది. దీనికి తోడు, కంటిలో నలకగా, పంటికింద రాయిగా మారిన కేజ్రీవాల్ విమర్శలకు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించటం ద్వారా జవాబివ్వాలని బీజేపీ భావిస్తోంది. గత ఏడు నెలలుగా ఆప్‌లో సంభవించిన పరిణామాలను ఎంపీ ఎన్నికల్లో తనకు అనుకూలంగా మలచుకున్న రీతిలోనే, తాజా పరిస్థితిని సద్వినియోగం చేసుకుని పాతికేళ్ల తర్వాత ఘన విజయాన్ని నమోదు చేయాలని కాషాయ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు ఢిల్లీలో బీజేపీతో బాటు కాంగ్రెస్‌నూ తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగానూ భావిస్తూ వచ్చిన కేజ్రీవాల్ పేరు వింటేనే ఢిల్లీ హస్తం నేతలు మండిపడుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనపై ఢిల్లీ కాంగ్రెస్ విభాగం అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. ఇదంతా రాజకీయ జిమ్మిక్కు అనీ, అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లిన రోజే ఆయన సీఎంగా కొనసాగే నైతిక హక్కును కోల్పోయారని వ్యాఖ్యానించారు. ఇండియాలో ఆప్ పొత్తు పార్టీగా ఉన్నప్పటికీ, అది లోక్‌సభ ఎన్నికలకే పరిమితమని, అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి పొత్తు ఉండదని ఢిల్లీకి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రెండు బలమైన జాతీయ పార్టీలను రాబోయే రోజుల్లో ఢీకొంటూ, ఆప్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను సాధిస్తుందో తెలుసుకోవాలంటే ఫిబ్రవరి వరకు వేచి చూడాల్సిందే.