BigTV English

AP Politics: విజయనగరం జిల్లాలో జనసేనకు దిక్కెవరు?

AP Politics: విజయనగరం జిల్లాలో జనసేనకు దిక్కెవరు?

AP Politics: పార్టీ పేరు చెప్పుకొని.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఇంచార్జ్‌లు! గ్రూపుల మంట రాజేస్తూ.. చలికాచుకుంటున్న నేతలు! భూకబ్జాలతో పార్టీని బలిపీఠం ఎక్కిస్తున్న నియోజకవర్గాల బాధ్యులు! దళితకార్డు బూచి చూపి.. దందా నడిపిస్తున్న ప్రబుద్ధులు! దశాబ్దకాలమైనా పార్టీకి దశ-దిశ లేక నీరసిస్తున్న అభిమానులు! విజయనగరం జిల్లాలో.. జనసేనది గమ్యం లేని ప్రయాణంగా మారింది. ఇప్పటికైనా.. పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టాలని అధిష్టానం తీరుపై కార్యకర్తలు మండిపడుతున్నారట. ఎమ్మెల్యే ఉన్న నెల్లిమర్లలో తప్పితే.. మిగతా చోట్ల పార్టీ పరిస్థితి అస్తవ్యస్తం, అయోమయంగా మారిందని తెగ ఫీలైపోతున్నారట జనసైనికులు.


ఇక్కడ అవనాపు విక్రమ్, గురాన అయ్యలు మధ్య ఆధిపత్య పోరు

విజయనగరం జిల్లాలో.. ఓ రాధ, ఇద్దరు కృష్ణుల కథ నడుస్తోంది. ఇక్కడ అవనాపు విక్రమ్, గురాన అయ్యలు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా.. వేర్వేరు శిబిరాలు మెయింటైన్ చేస్తున్నారు. వేర్వేరుగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత విద్వేషాలున్నాయట. వీళ్లిద్దరి మధ్య సఖ్యత కుదిర్చి.. పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యతను ఉద్దేశపూర్వకంగా విస్మరించి.. వాళ్లిద్దరూ ఎప్పటికీ శత్రువులుగానే మిగిలిపోయేలా.. రాష్ట్ర తూర్పు కాపు ఛైర్మన్ పాలవలస యశస్వి స్కెచ్ వేశారనేది మరో వాదన. ఇద్దరి మధ్య అగాధాన్ని.. అంతకంతకూ పెంచుతూ తన స్వార్థానికి పార్టీని ఫణంగా పెడుతున్నారనే చర్చ సాగుతోంది. అయితే.. ఈ కుయుక్తులను పసిగట్టలేని ఆ ఇద్దరు యువనేతలు.. నిత్యం పాము-ముంగిసలా పోట్లాడుకుంటున్నారు. అధిష్ఠానం ఇచ్చిన చిన్న చిన్న పార్టీ పదవులతో అధికారం చెలాయిస్తూ.. పార్టీ పుట్టి మునిగిలే చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.


సొంత వ్యాపకాలకే ప్రాధాన్యమిస్తున్నారనే ప్రచారం

ఇక.. చీపురుపల్లిలో జనసేనది మరోదారి. ఇక్కడ.. ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావుకు పార్టీ మనుగడ మినహా అన్నీ ముఖ్యమేననే చర్చ సాగుతోంది. ఈ మధ్య భూకబ్జాలకు రుచిమరిగారనే టాక్ వినిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే.. కిమిడి కళా వెంకట్రావు పేరు చెప్పి.. కొన్ని విషయాల్లే పేట్రేగిపోతున్నట్లు చెప్పుకుంటున్నారు. నిజానికి.. ఎమ్మెల్యే కళా ఇలాంటి వాటిని ప్రోత్సహించకపోయినా.. శ్రీనివాసరావు మాత్రం విసుగు, విరామం లేకుండా సెటిల్మెంట్లలో బిజీగా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల విషయంలోనూ ఈయన ప్రవర్తన అతిగా ఉంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనసైనికులు, వీరమహిళల్ని పట్టించుకోకుండా.. సొంత వ్యాపకాలకే ప్రాధాన్యమిస్తున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఈయనకు ఉద్వాసన తప్పదనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

నెల్లిమర్లలో జనసేన కార్యకర్తల్ని ఆహ్వానించేందుకు పావులు

నెల్లిమర్ల నియోజకవర్గానిది.. మరో కథ. జనసేన క్యాడర్‌ని.. తెలుగుదేశంలోకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. దీనికి దీటుగా.. ఎమ్మెల్యే కూడా టీడీపీపై గురిపెట్టారనే చర్చ సాగుతోంది. ఇదో కోణమైతే.. ఇప్పటివరకు నెల్లిమర్లలో పార్టీకి సంస్థాగత నిర్మాణం లేదు. ఇక్కడి పార్టీ శ్రేణులు సైతం నైరాశ్యంలో ఉన్నారు. ఇదే అదనుగా టీడీపీ చాపకింద నీరులా.. తనపని తాను చేసుకుపోతోంది. వచ్చే స్థానిక ఎన్నికల్లో నెల్లిమర్ల నగర పంచాయతీ పీఠంపై కన్నేసిన రెండు పార్టీలు.. హోరాహోరీగా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ.. వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయ్. మరోవైపు.. గజపతినగరం, రాజాం, బొబ్బిలి, ఎస్.కోట నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.

నేతల ఆధిపత్య పోరుతో పార్టీకి దూరమవుతున్న జనసైనికులు

అంకితభావంతో పనిచేసేవారు ఉన్నా.. రాజకీయ అనుభవజ్ఞులు లేక.. జనసేన ఎదుగు-బొదుగు లేకుండా అన్న చందంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసే ప్రణాళికలు లేకపోవడం, నాయకులు సొంత పనుల్లో బిజీగా ఉంటూ.. పార్టీకి ప్రాధాన్యం ఇవ్వకపోవడం, సమస్యలు చెప్పుకునేందుకు ఓ దిక్కంటూ లేకపోవడంతో.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఉన్న పిడికెడు మంది నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో.. జనసైనికులు సైతం పార్టీకి దూరమవుతున్నారట.

Also Read: ఆ 48 గంటలు జరిగిన హైడ్రామా ఏంటి? కాల్పుల ఒప్పందం సీక్రెట్ ఇదేనా.!

గతంలో వెల్లువలా వచ్చి జనసేన జెండా కప్పుకున్న నేతలు

కొన్ని నెలల వరకు.. విజయనగరం జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో.. జనసేనలోకి చేరికల పర్వం ముమ్మరంగా సాగింది. ఊరూవాడా జనసేన వైపు చూసింది. గ్రామ, మండల స్థాయి నేతలు.. వెల్లువలా వచ్చి జనసేన కండువాలు కప్పుకున్నారు. కానీ.. ఇప్పుడు ఒక్కసారిగా ఈ పార్టీలోకి వలసలు ఆగిపోయాయ్. పైగా.. జనసేన నుంచి ఇప్పుడు ఇతర పార్టీలోకి వెళుతుండటం కొత్త చర్చకు దారితీస్తోంది. రానురాను జిల్లాలో పార్టీ ప్రాభవం కోల్పోతున్నా.. పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంపై క్యాడర్ విస్మయం వ్యక్తం చేస్తోంది.

స్థానిక ఎన్నికల్లో పోటీ టీడీపీ, వైసీపీ మధ్యే ఉంటుందనే చర్చ

ఇదే సమయంలో.. అధిష్టానం తీరుపైనా జనసైనికులు మండిపడుతున్నారు. పార్టీ ఇమేజ్ పడిపోతున్నా.. ఎవ్వరూ పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దశ-దిశ లేని ఇలాంటి పార్టీని ఇదివరకెప్పుడూ చూడలేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయ్. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. వచ్చే స్థానిక ఎన్నికలు.. టీడీపీ, వైసీపీ మధ్యే జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు జనసేన చర్చల్లో కూడా ఉండని దుస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు. మరి.. రానున్న రోజుల్లో పార్టీ పరిస్థితుల్లో మార్పు వస్తుందా, రాదా అన్నది ఆసక్తిగా మారింది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×