BigTV English

YS Jagan: జగన్‌కి జడ.. గండమా!? ఆ మహిళ ఎవరంటే..

YS Jagan: జగన్‌కి జడ.. గండమా!? ఆ మహిళ ఎవరంటే..

జగన్ కి ఒక స్త్రీ వల్ల ఇబ్బందులు- ఉగాది పంచాంగం

వైసీపీ అధినేత జగన్ ఓ స్త్రీ మూలకంగా ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఇదీ ప్రముఖ సిద్ధాంతి నోరి నారాయణ మూర్తి చెప్పిన విశ్వావసూ నామసంవత్సర ఉగాది పంచాంగం. శుభమాని తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నాడు ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహిస్తే.. ఈ సందర్భంగా సిద్ధాంతి నాలుగు మంచి మాటలు చెప్పాల్సింది పోయి.. తెలిసి అన్నారో. తెలీక అన్నారో. కావాలనే అన్నారో. అనుకోకుండా అన్నారో. లేక గ్రహస్థితులే అలాగున్నాయో తెలీదు. కానీ.. మొత్తానికైతే.. జగన్ కి ‘జడ’గండం ఉందని బాంబు పేల్చారు. ఏంటీ జడ.. గండం అని చూస్తే ఆడవారి మూలకంగా ఆయనకు ఇబ్బందులున్నట్టు చెప్పుకొచ్చారాయన.


చీర కట్టేవారితో గొడవలుంటాయట

జగన్ జన్మనక్షత్రం.. ఆరుద్ర. శివుడి నక్షత్రం. దీని ప్రకారం చూస్తే ఆయనది మిథునరాశిగా చెప్పిన నారాయణమూర్తి.. పంచాంగ పఠనం చేశారు. పేరుకది పంచ.. అంగ శ్రవణం అన్న మాటే గానీ, జగన్ కి మాత్రం చీరతో అంటే చీర కట్టేవారితో గొడవలుంటాయనడంతో.. అక్కడున్న వారి మెదళ్లలో వెంటనే బల్పులు టపీ టపీమంటూ వెలిగాయట.

కుటుంబంలోని స్త్రీ ద్వారా సమస్యలంటూ పంచాంగ శ్రవణం

చిత్రమైన విషయమేంటంటే.. జగన్ కి ఈ ఏడాది ఒక స్త్రీ మూలకంగా సమస్యలు ఎదురవుతాయని చెప్పడం మాత్రమే కాకుండా.. కుటుంబంలోని స్త్రీ ద్వారానే ఈ చిక్కులు ఎదురుకానున్నట్టు చెప్పడంతో.. విన్నవారి మెదళ్లలో ఒక క్లారిటీ అయితే వచ్చేసిందట. అవును ఫలానా స్త్రీ కారణంగా సమస్యలు రావచ్చంటూ ఒకరికొకరు గుసగుసలాడారట.

లిస్ట్ లో ఫస్ట్ పేరు సిస్టర్ షర్మిళగానే ఊహాగానాలు

ఇంతకీ ఆ స్త్రీ ఎవరని సిద్దాంతి విన్నవించలేదు కానీ ఎవరికి వారు ఊహాగానాలైతే మొదలెట్టేశారట. ఈ లిస్టులో ఫస్ట్ బెస్ట్ ప్లేస్ మాత్రం సిస్టర్ షర్మిళదేనట. ఇప్పటికే షర్మిళ రూపంలో జగన్ కి ఎదురవుతున్న కష్టాలేమంత కొత్తవి కావు. గత ఎన్నిల ముందు షర్మిళ.. జగనన్న నుంచి వేరు పడ్డం. ఆ వెంటనే తెలంగాణలో పార్టీ పెట్టడం. ఇక ఎన్నికలొస్తాయనగా ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ గా ఇక్కడికివచ్చి జగన్ వ్యతిరేక వాదన వినిపించడం. ఆ తర్వాత తన తల్లిని కూడా అన్నయ్య నుంచి దూరం చేయడం.. ప్రస్తుతం జగన్ కి బద్ధశతృవు మరెవరో కాదు.. షర్మిళే అన్న ముద్ర వేయించుకోవడం తెలిసిందే.

శతృవులు ఎక్కడో ఉండరు.. చెల్లిళ్ల రూపంలో ఉంటారన్న సినిమా డైలాగ్

శతృవులు ఎక్కడో ఉండరు. ఇంట్లో చెల్లిళ్ల రూపంలోనే ఉంటారంటూ.. ఆయా సినిమా డైలాగులు వినే ఉంటాం. ఈ క్రమంలో షర్మిళ అతిపెద్ద లేడీ ఎనిమీ ఆఫ్ జగన్.. ఇన్ ద ఫ్యామిలీ అంటూ చిన్నపిల్లాడ్ని అడిగినా చెప్పేస్తాడు. అంతగా ఆమె పేరు ముద్ర పడింది. ఒక దశలో తన చెల్లికి తాను 200 కోట్ల రూపాయలను ఇచ్చానని కూడా చెప్పుకున్నారు జగన్. ఇలా ఏ అన్న కూడా ఇచ్చి ఉండరని అంటారాయన. ఇంత పెద్ద మొత్తంలో సిస్టర్ ట్యాక్స్ పే చేసి కూడా జగన్ ఇంకా సోదరి నుంచి శతృత్వాన్ని ఎదుర్కుంటూనే ఉన్నారంటారు కొందరు.

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వరకూ వెళ్లిన సోదరితో శతృత్వం

తన సోదరితో జగన్ కి ఉన్న తగవులాట నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వరకూ వెళ్లింది కూడా. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిళపై సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల వివాదంలో కేసు వేశారు జగన్. ఈ వివాదం ఇంకా NCLTలో నడుస్తూనే ఉంది కూడా. ఇప్పటికున్న ఈ కష్టాలు- నష్టాలు చాలవన్నట్టు కొత్తవి కూడా వస్తాయా? అయినా, చెల్లి తాలూకూ శాపాలు ఈ సరికే ముగిశాయిగా.. కాబట్టి షర్మిళ కాక పోవచ్చంటూ అంచనా వేస్తారు మరికొందరు.

సిద్ధాంతి చెప్పిన స్త్రీ సునీతే కావచ్చన్న కామెంట్లు

ఇక వివేకా కుమార్తె సునీత కూడా కుటుంబ సభ్యురాలే కాబట్టి.. ఈమె రూపంలో మరేదైనా కొత్త సమైస్య తలెత్తవచ్చా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే తన తండ్రి హత్య కేసు వ్యవహారంలో ఆమె జగన్ న్ని టార్గెట్ చేశారు. ఈ కేసు ఇంకా రన్నింగ్ లో ఉంది కాబట్టి.. వచ్చే రోజుల్లో ఈ కేసు తాలూకూ ప్రభావం జగన్ పై భారీ ఎత్తున పడే అవకాశం లేక పోలేదన్నది మరో వాదన. షర్మిళ శతృత్వం పవరు తగ్గినా.. సునీత శతృత్వ ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది కాబట్టి. ఆ సిద్దాంతి చెప్పిన స్త్రీ ఈవిడే కావచ్చన్నది ఒక అంచనా.

జగన్ చుట్టూ ఉన్న స్త్రీమూర్తుల్లోని మరో స్త్రీ మూర్తి భారతీరెడ్డి

జగన్ చుట్టూ ఉన్న స్త్రీమూర్తుల్లోని మరొక స్త్రీమూర్తి భారతీరెడ్డి. భారతీ రెడ్డి- స్వయానా సతీమణి కాబట్టి. ఆమె నుంచి త్రెట్ ఉండే ఛాన్సే లేదంటారు. ఆ మాటకొస్తే భారతీరెడ్డి ఈ అవస్తలు మనకు అవసరమా? విదేశాలకు వెళ్లి సెటిలై పోదాం పద.. అంటూ తన భర్తకు ఎంత చెప్పినా వినడం లేదని స్వయంగా ఆమె గతంలో చెప్పుకుని బాధ పడ్డ విషయం తెలిసిందే.

కొడుకును కాదని కూతురు వైపు మొగ్గిన తల్లి విజయమ్మ

మిగిలింది తల్లి విజయమ్మ. కొడుకును కాదని కూతురు షర్మిళ వైపు మొగ్గు చూపుతూ… ఆమె దగ్గరే ఉంటున్నారు. 2024 అక్టోబర్‌లో విజయమ్మ రాసిన బహిరంగ లేఖపై వైసీపీ నేతలు సైతం విమర్శలు గుప్పించిన పరిస్థితులు. ఇప్పటికే ఆస్తుల విషయంపై NCLTలో విజయమ్మ అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఆస్తులను కుమార్తె షర్మిళకు సమానంగా పంచివ్వాలనే విధంగా విజయమ్మ చెప్పడాన్ని తప్పు పడతారు కొందరు.

విజయమ్మ కోపతాపాల శాపాలు 11 సీట్లతో చల్లారాయిగా అంటోన్న కేడర్

విజయమ్మకు షర్మిళ విషయంలో కొడుకు మీద ఎంత కోపం ఉన్నా.. ఆ కోపతాపాల శాపాలన్నీ మొన్నటి 11 సీట్ల ఫలితంతో ముగిసిపోయాయనే అంటారు మరికొందరు. చివరికి మిగిలింది లండన్ లో చదువుతున్న ఇద్దరు కూతుళ్లు. వారి ద్వారా తండ్రి జగన్ కంటూ.. ఎలాంటి సమస్య వచ్చే ప్రమాదం లేదు. పైపెచ్చు వారు చదువుల రూపంలో రేపు ఏదైనా ఘనత సాధిస్తే.. అదంతా తండ్రికొచ్చే మంచి పేరే తప్ప చెడ్డ పేరు ఎలాగవుతుంది? అన్న మాట వినిపిస్తోంది.

జగన్ ని ఇరకాటంలో పడవేసే ఆ స్త్రీ ఎవరు

ఇటు కుటుంబ స్త్రీలు మాత్రమే కాదు.. తానేదైనా పథకాలు ప్రారంభించినా కూడా అన్నిటినీ మహిళల పేరిట ఏర్పాటు చేయడం జగన్ అలవాటు. అలాంటి వారి రూపంలో ఆయనకు శాపాలకన్నా వరాలే ఎక్కువ రావాలి. కానీ గత ఎన్నికల్లో తానెంత చేసినా.. వారి నుంచి పడాల్సిన ఓటు శాతం పడలేదన్నది స్వయంగా జగనే చెప్పుకుని బాధ పడ్డ పరిస్థితులు. వీటన్నిటినీ అలాగుంచితే.. కుటుంబ స్త్రీ ద్వారా సమస్యలంటున్నారు కాబట్టి.. వీరు ఆ కోవలోకి వచ్చే అవకాశం లేదు. సో.. జగన్ ని ఇరకాటంలో పడవేసే ఆ స్త్రీ ఎవరా అన్నదిప్పుడు అతి పెద్ద చర్చగా తయారై కూర్చుంది.

ఓ స్త్రీ నువ్వెవరంటూ జుట్టు పీక్కుంటున్న పార్టీ కార్యకర్తలు

తన మానాన తానేదో తీపి- పులుపు- చేదు- వగరు- ఉప్పు- కారంతో కూడిన అర్దమయ్యీ అర్ధంకాని పంచాంగం చెప్పుకుని దయచేయకుండా.. ఈ సిద్ధాంతి ఒకడు. ఒక స్త్రీ రూపంలో జగన్ కి సమస్య తలెత్తుతుందని చెప్పడేమేంటి? తాము ఓ స్త్రీ రేపు రా అన్నట్టు ఓ స్త్రీ నువ్వెవరు? అంటూ జుట్టు పీక్కోడమేంటి? అర్ధం కావడం లేదని వాపోతున్నారట సదరు ఫ్యాను పార్టీ కార్యకర్తలు.

జగన్ మేక కాదు సింహం అంటూ అభివర్ణించిన సిద్ధాంతి

ఇదిలా ఉంటే.. సదరు సిద్ధాంతి.. ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా కొన్ని రాజకీయాంశాలను సైతం స్పృశించడం గమనార్హం. జగన్ని ఓడించినందుకు ప్రజలిప్పుడు తప్పు చేశామని బాధ పడుతున్నట్టు చెప్పారు. ఒక ముఖ్యమంత్రిగా జగన్ డబ్బు ఇటు కోల్పోవడం మాత్రమే కాకుండా.. అటు మాట కూడా పడుతున్నారని వ్యాఖ్యానించారాయన. ఏది ఏమైనా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో జగన్ తన పూర్వ వైభవాన్ని తిరిగి దక్కించుకోనున్నారనీ తేల్చారు సిద్ధాంతి. ఈ ఏడు జగన్ ఆరోగ్యం కూడా బాగుంటుందని అన్నారు సిద్ధాంతి. కుటుంబ రీత్యా ఇబ్బందులు సైతం తొలగిపోతాయనీ అన్నారు. జగన్ బంధువుల్లో ఒక స్త్రీ కారణంగా ఆయనకు సమస్య తలెత్తే అవకాశముందని అనడంతోనే అసలు చిక్కంతా వచ్చి పడింది. ఈ స్త్రీ కారక సమస్యల నుంచి తట్టుకునే నేర్పని తనం రావాలని కూడా కోరుకున్నారీ సిద్దాంతి.

మరి ఈ మగసింహాన్ని వెంటాడి వేధించే ఆ ఆడ సివంగి ఎవరు? 

అధికారంలో ఉండగా ఎంతో అట్టహాసంగా నిర్వహించిన ఉగాది వేడుకలు ఈ ఏడు మాత్రం బోసి పోయి కనిపించాయి. ఇదిలాగుంటే ఈ వేడుకలకు బెంగళూరుకే పరిమితమైన జగన్ రాక పోవడం కొసమెరుపు. జగన్ లేక పోవడం అన్న ఆవేదన అటుంచితే ఆయనకు స్త్రీ కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయనడంతో.. ఆ బాధ కాన్నా ఈ బాధే తమకు ఎక్కువైందని వాపోతున్నారు సగటు ఫ్యాను పార్టీ కార్యకర్తలు. మరి చూడాలి.. జగన్ ని ఒక ఆట ఆడించే ఆ ఆడ సింహం ఎవరో తేలాల్సి ఉంది. ఇందులో మరో ఊరటనిచ్చే అంశమేంటంటే.. జగన్ మేక కాదు సింహం అన్నారు సిద్ధాంతి. మరి ఆ మగసింహాన్ని ఢీ కొట్టనున్న ఆ ఆడ సివంగి ఎవరో తెలియాలంటే.. మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందేనంటున్నారు వైసీపీ కార్యకర్తలు.

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×