YS Jagan Public Tour: రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదు.. కొన్నిసార్లు జనాలు ఆదరిస్తే.. కొన్నిసార్లు ప్రతిపక్షంలో కూర్చోబెడతారు. అధికారం ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు ఒకలా ఉంటే.. ఓటర్లు ఆ విషయాన్ని పసిగడతారు. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారో ఏమో.. జగన్ తీరు మాత్రం కాస్త భిన్నంగా కనిపిస్తోందనే టాక్ నడుస్తోంది. ఆయన తమ వద్దకు ఎప్పుడు వస్తారా అని జనంతో పాటు నేతలు కూడా ఎదురుచూస్తున్నారట. వైసీపీ అధినేత మాత్రం.. మార్చి.. సెప్టెంబర్.. మార్చి.. సెప్టెంబర్ అని వాయిదాలు వేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి తర్వాత ప్రతి పార్లమెంట్‌లోనూ రెండురోజుల పాటు పర్యటిస్తానని చెప్పిన జగన్.. ఉగాది వస్తున్నా.. ఆ ఊసే ఎత్తటం లేదనే చర్చ జోరుగా సాగుతోంది.
జగన్ జిల్లాల పర్యటనపై సర్వత్రా ఆసక్తి
మాజీ ముఖ్యమంత్రి జగన్.. పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి పెద్దఎత్తున నియోజకవర్గం నుంచి ప్రజలు వచ్చారు. తమ సమస్యలను మాజీ సీఎంకు చెప్పుకున్నారు. ఆయన కూడా వచ్చిన అంశాలను స్పష్టంగా విన్నారు. ఇక్కడవరకూ ఓకే. పులివెందుల మాదిరే రాష్ట్రవ్యాప్తంగా తిరిగి.. ప్రజాసమస్యలను తెలుసుకుంటానని ఆయన ప్రకటించారు. పార్లమెంట్ స్థానాలు ఆధారంగా తన పర్యటన ఉంటుందని హింట్ ఇచ్చారు.
పార్లమెంట్ స్థానాలు ఆధారంగా పర్యటన ఉంటుందని హింట్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా.. జగన్ పర్యటన లేకపోవటంతో పార్టీ అభిమానులతో పాటు క్యాడర్‌కూడా వెయిట్ చేసే పరిస్థితి వచ్చిందట. అడపాదడపా పర్యటనలు చేసిన జగన్.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందంటూ ఆరోపిస్తూ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. అయితే చెప్పిన మాట ప్రకారం.. రాష్ట్రవ్యాప్త పర్యటన ఊసే లేకపోవటంతో.. నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సంక్రాంతి తర్వాత పర్యటన చెప్పిన వైసీపీ అధినేత
సంక్రాంతి తర్వాత ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ రెండురోజులపాటు బస చేస్తూ.. అక్కడ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటానని జగన్ చెప్పారట. కానీ.. మార్చి మొదటి వారం వచ్చినా.. ఆ ఉసే వినపడటం లేదనే సొంత పార్టీలోనే చర్చసాగుతోందట. తాజాగా.. ఉగాది తర్వాత జగన్ పర్యటన ఉంటుందంటూ అధిష్టానం నుంచి లీకులు వస్తున్న నేపథ్యంలో.. ఇదో కొత్తతరహా ప్లాన్ అంటూ నేతలు చర్చించుకుంటున్నారట.
అసలు విషయం అది కాదని.. జనం నుంచి స్పందన లేకపోవటం వల్లే వాయిదాలు వేస్తున్నట్లు కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరించిన నేతలు ఇప్పుడు కేసులు భయంతో నియోజకవర్గ మొహం కూడా చూడట్లేదనే టాక్ కూడా ఉంది. నాయకులే లేనప్పుడు అధినేత వచ్చి ఏం చేస్తారనే ఉద్దేశంతో జగన్.. తన పర్యటనను వాయిదాలు వేసుకుంటున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి.
ప్రజాపోరాటాలకు సిద్ధం కావాలని శ్రేణులకు జగన్ పిలుపు
ప్రజల కోసం ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని ఇటీవల జగన్ శ్రేణులు పిలుపునిచ్చారు. ఇప్పటికే రైతుల కోసం ధర్నా, కరెంట్ బిల్లులపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇంత తొందరగా ప్రజల్లోకి వెళ్తానని ఎప్పుడూ భావించలేదని చెప్పిన జగన్.. జనంలోకి ఎందుకు రావటం లేదని ఇతర పార్టీల వాదన. చంద్రబాబు సీఎం అయ్యాక..ప్రజలపై పెద్ద ఎత్తున భారం పడుతుందని.. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల ద్వారా ప్రజలపై అధికభారం మోపుతున్నారని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిరసన చేపట్టినా.. ఆశించిన విధంగా జనం నుంచి సపోర్టు రాలేదనే టాక్ కూడా నడుస్తోంది. అందుకే వైసీపీ అధినేత పర్యటనలు చేయటం లేదనేది కూటమి పార్టీల మాటగా తెలుస్తోంది.
2028లో జమిలి ఎన్నికలు అంటూ కొత్త రాగం
మొన్నటి వరకూ 2027లోనే జమిలి ఎన్నికలు వస్తాయని చెప్పుకొచ్చిన వైసీపీ అధినేత.. ప్రస్తుతం మాట మార్చారు. 2028లో జమినీ ఎన్నికలు అంటూ కొత్త రాగం అందుకున్నారు. ఆ ఎన్నికల పేరు చెప్పి కూటమి సర్కారు అంటే.. సీఎం చంద్రబాబులో భయం సృష్టించాలని యోచనలో వైసీపీ ఉందనే టాక్ వినిపిస్తోంది. అందుకే తాను కూడా పర్యటనలు చేస్తామని చెప్పిన జగన్.. ఇప్పుడు రూటు మార్చారంటూ వాదనలు తెరపైకి వస్తున్నాయి. నియోజకవర్గ నేతల సమావేశంలో మాత్రం.. వైసీపీ అధినేత రెట్టించిన ఉత్సాహంతో స్పీచ్ ఇస్తున్నారు.
నియోజకవర్గ నేతల్లో ఉత్సాహం నింపుతున్న జగన్
వచ్చే ఎన్నికల్లో విజయం మనదేనంటూ స్ఫూర్తి నింపుతున్నారు. పార్టీలో ఉండేవారు ఉంటారని వారికే వచ్చే ఎన్నికల్లో అవకాశాలంటూ క్యాడర్‌లో జోష్ నింపే యత్నం చేస్తున్నారు. దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా.. తమ హయాంలో ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చామని చెబుతున్నారు. అంతే కాదు.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపే ధ్యేయంగా పనిచేయాలని జగన్.. శ్రేణులకు పిలుపు ఇస్తున్నారు.
ఉగాది తర్వాత జనంలోకి జగన్
జిల్లాల పర్యటనలో భాగంగా.. నేతలు, కార్యకర్తలతో జగన సమావేశం అవుతారని వైసీపీ చెబుతోంది. ఉగాది తరువాత ఈ పర్యటన ప్రారంభం కాబోతుందని కరాఖండీగా చెబుతోంది. ఇన్ని రోజుల పాటు ఏదో ఒకటి చెప్పి మాట దాటవేసిన జగన్.. ఇప్పుడైనా జనంలోకి వెళ్తారా లేదా అనే ఉత్కంఠగా మారింది.