Updated Income Tax Return | 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి ముగుస్తున్న నేపథ్యంలో.. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు గత రెండు ఆర్థిక సంవత్సరాలకు (2022-23, 2023-24) సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నుల్లో ఏవైనా తప్పులు లేదా పొరపాట్లు ఉంటే.. వాటిని సరిదిద్దుకునే ముఖ్యమైన అవకాశం ఉంది. 2022 ఫైనాన్స్ చట్టంలో ప్రవేశపెట్టిన “అప్‌డేటెడ్ రిటర్న్” నిబంధన ప్రకారం.. 2022-23, 2023-24.. ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన రిటర్నులను పన్ను చెల్లింపుదారులు 2025 మార్చి 31నాటికి సరిదిద్దుకోవచ్చు.
అప్‌డేటెడ్ ఐటీఆర్ నిబంధన
ఈ నిబంధనను పన్ను చెల్లింపుదారుల స్వచ్ఛంద సమ్మతిని ప్రోత్సహించడానికి మరియు న్యాయ వివాదాలను తగ్గించడానికి ప్రవేశపెట్టారు. సంబంధిత మదింపు సంవత్సరం ముగిసిన రెండు సంవత్సరాల లోపు పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు, 2022-23 మదింపు సంవత్సరానికి (2021-22 ఆర్థిక సంవత్సరం) సంబంధించిన రిటర్నులను 2025 మార్చి 31నాటికి సరిదిద్దుకోవచ్చు.
అప్‌డేటెడ్ ఐటీఆర్ ముఖ్య అంశాలు
అప్‌డేటెడ్ రిటర్న్ దాఖలు చేయడానికి అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ అదనపు పన్ను మొత్తం.. మదింపు సంవత్సరం ముగిసిన తర్వాత గడిచిన సమయాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. ఎక్కువ సమయం జాప్యం చేస్తే.. అదనపు పన్ను మొత్తం కూడా పెరుగుతుంది.
కొన్ని అసాధారణ సందర్భాలను మినహాయించి, చాలా సందర్భాల్లో అప్‌డేటెడ్ రిటర్న్ దాఖలు చేయవచ్చు. అయితే, సవరించిన ఆదాయం తక్కువ పన్ను బాధ్యతకు దారితీస్తే.. తగిన పన్ను రిఫండ్ చేయబడుతుంది.. అలాకాకుండా ఒక వేళ అధిక రిఫండ్‌కు దారితీసినా.. లేదా పన్ను చెల్లింపుదారు ఇన్ కమ్ ట్యాక్స్ అధికారుల విచారణలో ఉంటే.. అప్‌డేటెడ్ రిటర్న్ దాఖలు చేయడానికి అనుమతి ఉండదు.
మొదట్లో అప్‌డేటెడ్ రిటర్న్ దాఖలు చేయడానికి గరిష్టంగా రెండు సంవత్సరాల వరకు మాత్రమే అవకాశం ఉండేది. కానీ 2025 బడ్జెట్‌లో ఈ గడువును 48 నెలలకు పొడిగించారు. దీంతో పన్ను చెల్లింపుదారులకు వారి రిటర్న్‌లలో ఏవైనా తప్పులను సరిదిద్దుకోవడానికి ఎక్కువ సమయం లభిస్తుంది.
Also Read: ఆదాయపు పన్ను సేవింగ్స్ చేయడానికి మార్చి 31 లాస్ట్ ఛాన్స్.. మిస్సైతే మీకే నష్టం..
అప్‌డేటెడ్ రిటర్న్ ఎలా ఫైల్ చేయాలి?
ఆదాయపు పన్ను శాఖ యొక్క ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా పన్ను చెల్లింపుదారులు అప్‌డేటెడ్ రిటర్న్‌ను దాఖలు చేయవచ్చు. ఈ ప్రక్రియలో ఈ క్రింది దశలు ఉంటాయి:
ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ చేయండి: మీ క్రెడెన్షియల్స్ ఉపయోగించి ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి.
ఐటీఆర్-యు ఫారం ఎంచుకోండి: సంబంధిత మదింపు సంవత్సరానికి ఐటీఆర్-యు ఫారాన్ని ఎంచుకోండి.
వివరాలను పూరించండి: అదనపు ఆదాయం, చెల్లించాల్సిన పన్ను మొదలైన అవసరమైన వివరాలను అందించండి.
అదనపు పన్ను లెక్కించండి: మదింపు సంవత్సరం ముగిసిన తర్వాత గడిచిన సమయాన్ని బట్టి చెల్లించాల్సిన అదనపు పన్నును లెక్కించండి.
సబ్మిట్ చేయండి: వివరాలను సరిచూసుకుని, అప్‌డేటెడ్ రిటర్న్‌ను సబ్మిట్ చేయండి.
ఈ ప్రక్రియ ద్వారా పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లలో ఉన్న తప్పులను సరిదిద్దుకోవచ్చు, పన్ను బాధ్యతలను సక్రమంగా నిర్వహించుకోవచ్చు.