YS Jagan: ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని కుల సమీకరణాలు ఉన్నా గత ఎన్నికల్లో కాపు కులస్తులే నిర్ణయాత్మకంగా మారారు. ఆ సామాజికవర్గం అంతా పవన్‌కళ్యాణ్ వెన్నంటి నిలిచారు. వైసీపీ దారుణ పరాజయం పాలైంది. వైసీపీలోని కాపు నేతలు ఎన్నికల ముందు నుంచే వలస బాట పట్టారు. ఇక ఎన్నికల తర్వాత ఆ వర్గం నాయకులను కాపాడుకోవడం జగన్‌కు తలనొప్పిగా మారింది. దాంతో పార్టీకి దూరమవుతున్న ఆ సామాజిక వర్గ నాయకులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీలోని కీలక పదవులను అప్పగిస్తున్నారు. మరి కాపులను ఆకట్టుకోవడంలో జగన్ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా?
గత ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా వ్యవహరించిన కాపులు
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మొత్తం కుల సమీకరణాల చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఎన్నికలు వస్తే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కులాలవారీగా విడిపోయి రాజకీయం చేస్తారు. ఎన్నికల పూర్తయితే ఆ కులాల్లోని కీలకమైన నేతలను కాపాడుకోవడానికి పార్టీ అధ్యక్షులు నానా పాట్లు పడుతుంటారు. 2024 ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం కూలిపోవడంలో కాపు సామాజిక వర్గమే కీలకమైన పాత్ర పోషించింది. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ఏర్పడటంలో కూడా కాపు సామాజిక వర్గం కీలకంగా మారింది.
2019 ఎన్నికల్లో జగన్‌కు అండగా నిలిచిన కాపు
2019 ఎన్నికల్లో కాపుల ప్రాబల్యం ఉన్న గాజువాక, భీమవరం సెగ్మెంట్లలో పోటీ చేసిన పవన్‌కళ్యాణ్‌ని కూడా ఆ వర్గం ఆదరించలేదు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులకు మంత్రి పదవులను అనుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చి కాపు సామాజిక వర్గం తన వైపు ఉండేలా ప్లాన్ చేసుకున్నారు జగన్.. 2024 ఎన్నికల సమయానికి అది రివర్స్ అయింది. వైసీపీ కాపు నాయకులు పవన్ కళ్యాణ్‌ను తీవ్రస్థాయిలో దూషించడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేని కాపు సామాజిక వర్గం యువత జనసేన పార్టీని ఓన్ చేసుకుంది.
పవన్‌ను దూషించడాన్ని జీర్ణించుకోలేక పోయిన కాపులు
పవన్ కళ్యాణ్ ని ఎలాగైనా గెలిపించి తీరాలని కాపులంతా కంకణం కట్టుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం చెపితే అది శాసనం లాగా పాటించారు కాపు సామాజిక వర్గం నాయకులు.. పవన్ కళ్యాణ్ టిడిపికి మద్దతిచ్చి కూటమి కట్టి ఎన్నికలకు వెళ్లడంతో వైసిపి అధికారాన్ని కోల్పోవడం మాత్రమే కాదు కేవలం 11 సీట్లకే పరిమితం అయిపోయింది. ఎన్నికల తర్వాత కూడా వైసీపీపై కాపుల వ్యతిరేకత కొనసాగుతూనే వస్తుంది. వైసీపీలో ఎంతమంది కాపు వర్గానికి చెందిన నాయకులు ఉంటారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని చక్కదిద్దే పనిలో పడ్డాడు వైసీపీ అధ్యక్షుడు.
కాపు ఓటు బ్యాంకుని ఆకట్టుకోవడంపై జగన్ ఫోకస్
వైసీపీకి కాపు నేతలు దూరం అవుతున్న నేపథ్యంలో కాపు ఓటు బ్యాంకు పోకుండా జగన్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. వైసీపీ అధికారాన్ని కోల్పోయిన వెంటనే కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులు వైసీపీని వీడడంతో పార్టీలో మిగిలిఉన్న కాపు నేతలకు ప్రాధాన్యత ఇచ్చే ఆలోచనలో జగన్ పడ్డారు. 2029 ఎన్నికల నాటికి గాని లేదా జెమిలి ఎన్నికలు వస్తే ఎన్నికల సమయానికి గాని దూరం అవుతున్న కాపు ఓటు బ్యాంకును తిరిగి తమ వైపు తిప్పుకునేలాగా జగన్ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుండి కోస్తాంధ్ర వరకు యాక్టివ్‌గా ఉండే కాపు నేతలు బయటకు వెళ్లకుండా.. వారిని ఆక్టివేట్ చేసే పనిలో జగన్ వ్యూహాలు రచిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది.
కాపు నేతలు వైసీపీని వీడకుండా జగన్ జాగ్రత్తలు
2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ ప్రజాక్షేత్రానికి దూరమైనా.. పార్టీని గాడిలో పెట్టే పనిలో పడ్డట్లు కనిపిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో కాపు సామాజిక వర్గం వైసీపీకి పూర్తిగా దూరం కావడంతో ఇప్పుడు కాపు నేతలు వైసీపీని వీడకుండా ఆయన జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తున్నారు. నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టి అంటూ ఐదేళ్లు రాజకీయం చేసిన వైసీపీ అధ్యక్షుడు ఇప్పుడు రాజకీయంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడానికి కాపు సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో కాపు సామాజిక వర్గానికి చెందిన పేర్ని నాని, కురసాల కన్నబాబు, అంబటి రాంబాబు లాంటి నాయకులను టిడిపిపై, చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు చేయడానికి, గుడివాడ అమర్నాథ్ లాంటి నాయకుడిని పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడానికి జగన్ బానే వాడుకున్నారు.
ముద్రగడకు కాపులను ఆకట్టుకునే బాధ్యతలు
2024 ఎన్నికలకు ముందు కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మ లాభం లాంటి వాళ్లను పార్టీలో చేర్చుకుని కాపులను ఆకట్టుకునే బాధ్యత కూడా అప్పగించారు. అదే సమయంలో కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపీ హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు కూడా వైసీపీకి పరోక్షంగా సహకరించారు. కాపు సామాజిక వర్గంలో ఉన్న కీలకమైన నాయకులను వైసీపీలో జాయిన్ చేసుకున్నా, పరోక్షంగా కొందరు కాపు నాయకులు వైసీపీకి సహకరించినా కూడా కాపు ఓటర్లు కనికరించకపోవడంతో వైసీపీ అధినేత డైలమాలో పడ్డారు. ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాత కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నాయకులు వైసీపీకి రామ్ రామ్ చెప్పి టీడీపీ గూటికి వెళ్లిపోతుండడంతో వైసిపి అధినేత జగన్ ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది.
వైసీపీని వీడిన అవంతి శ్రీనివాస్, ఆళ్ల నాని
ముఖ్యంగా వైసీపీ అధికారాన్ని కోల్పోయిన వెంటనే ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేయడం, గోదావరి జిల్లాల నుంచి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వైసీపీని వదిలి టిడిపి కండువా కప్పుకోవడంతో జగన్‌లో అలజడి మొదలైనట్లు కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ పై కాపు సామాజిక వర్గంలో వ్యతిరేకత ఎలాగో పెరగదు. తమ నాయకుడిని ముఖ్యమంత్రి చేయాలని జనసేన నాయకులతో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కూడా పట్టుదలతో ఉండటంతో వారంతా మళ్లీ పవన్‌కళ్యాణ్‌కే జై కొట్టే అవకాశం కనిపిస్తుంది. ఇవన్నీ ఆలోచించిన జగన్ కాపుల మద్దతును కూడకట్టడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అని.. స్పష్టంగా అర్థం అవడంతో వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన కీలకమైన నాయకులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ తన వంతు ప్రయాత్నాలు మొదలుపెట్టారు.
పార్టీ మనుగడ కష్టమని భావిస్తున్న జగన్
ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుండి కోస్తాంధ్ర వరకు కాపుల ప్రాబల్యం రాజకీయాల్లో కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు అరెస్టు సమయంలో పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి మద్దతు పలికారు.. కాపులంతా పవన్ కళ్యాణ్ వైపు ఉండడంతో ఒక్కసారిగా జగన్ తన అధికారాన్ని కోల్పోయారు. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర నుండి కోస్తాంధ్ర వరకు ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులకు ప్రాధాన్యత ఇచ్చి పార్టీలో కంటిన్యూ అయ్యేలాగా చేయకపోతే పార్టీ మనుగడ కష్టమని భావిస్తున్న జగన్ ఎన్నికల్లో ఆ వర్గం నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
కన్నూబాబు, దాడిశెట్టి రాజాలకు పార్టీలో కీలక పదవులు
ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్సీ చేసి మండలికి పంపారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేసి కాకినాడ జిల్లాకు చెందిన మాజీమంత్రి కురసాల కన్నబాబును ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించారు. కాకినాడ జిల్లాకు మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను పార్టీ అధ్యక్షుడిగా నియమించడంతో ఉత్తరాంధ్ర నుండి కోస్తా వరకు ఉన్న కాపు నాయకులను, ఓటర్లను వైసీపీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.
జగన్ వ్యూహాలు ఫలిస్తాయా?
అయితే కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ పై అంతులేని అభిమానం కనిపిస్తుంది. ఆ వర్గానికి చెందిన మొదటి ముఖ్యమంత్రిగా పవన్‌ని చూడాలని వారంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌పై వారిలో ఇప్పట్లో వ్యతిరేకత వచ్చే అవకాశం లేదన్న అభిప్రాయం ఉంది. కాబట్టి జగన్ ఆలోచనలు ఏ స్థాయిలో వర్కౌట్ అవుతాయనేది డౌటే అంటున్నారు. మరి వైసీపీలో ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం తర్వాత కాపు సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న జగన్ వ్యూహాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.