YSRCP Party: ఏపీలో వైసీపీ కనుమరుగు కానుందా ? అధినేత మాటను నేతలు పక్కన పెడుతున్నారా ? 40 శాతం ఓటు బ్యాంక్ ఉన్న ఫ్యాన్ పార్టీకి.. వారిని నడిపించే నాయకులు కరువవ్వడం ఖాయమా ? ఓ వైపు రాజీనామాలు, వలసల పర్వం నడుస్తున్న తరుణంలో జగన్ కి నేతలు మరో షాక్ ఇస్తున్నారా ? పార్టీ కార్యక్రమాన్ని నేతలు లైట్ తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి ? వైసీపీలో అసలు ఏం జరుగుతోంది… వాచ్ థిస్ స్టోరీ
ఏం చేసినా విమర్శల పాలవుతున్న మాజీ సీఎం జగన్
కాలం కలిసిరాకపోతే ఏది ముట్టుకున్న రివర్స్ అవుతోంది. ఇప్పుడు ఇదే ఫేజ్.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కి కూడా నడుస్తోంది. ఏం చేసినా విమర్శలు చుట్టుముడుతున్నాయి. నాడు చెప్పిందే వేదం.. చేసిందే చట్టం అన్నట్టు వ్యవహరించిన జగన్.. ఇప్పుడు నేతల తీరుతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారట. ఇప్పటికే ఓ వైపు పార్టీకి నాయకులంతా గుడ్ బై చెప్పేసి వెళ్తున్నారు. మరోవైపు పార్టీ కార్యకర్తలకు అండగా నిలవాల్సిన లీడర్లు మొహం చాటేస్తున్నారట. ఐదేళ్లపాటు పార్టీని అంటిపెట్టుకొని పనిచేసిన కార్యకర్తలు నడిపించే నాయకత్వం లేక ఢీలపడుతున్నారట.
అన్నదాతకు అండగా పేరుతో నిరసన కార్యక్రమానికి వైసీపీ పిలుపు
అన్నదాతలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని.. సర్కారుకి వ్యతిరేకంగా రోడ్డెక్కాలని నేతలకు జగన్ ఆదేశించారు. అన్నదాతకు అండగా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని.. అన్ని జిల్లాల కేంద్రాల్లో రైతులతో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించాలన్నారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందించాలన్నారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.. వైసీపీ బాస్ ఆదేశాలను సైతం నేతలు లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. డుమ్మా కొట్టడానికి పలు కారణాలు ఉన్నప్పటికీ.. మెజార్టీ నాయకులు అంతా సైడ్ అవ్వడం ఏంటని సర్వత్రా చర్చ జరుగుతోంది.
నిరసనకు దూరంగా ధర్మాన, తమ్మినేని, ఎమ్మెల్సీ దువ్వాడ
శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను నిరసన కార్యక్రమానికి హాజరుకాలేదట. ధర్మాన చాలాకాలం నుంచి వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన పార్టీ మారతారానే పుకార్లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ దువ్వాడకి జిల్లా నాయకత్వం నుంచి ఇంటిమెషన్ లేదట. దాంతో ఆయన కూడా ధర్నాకి దూరంగా ఉన్నారట. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం అనారోగ్య కారణాలు దృష్ట్యా చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లాలో మాత్రం ముఖ్యనేతలందరూ ధర్నాలో పాల్గొన్నారని అంటున్నారు.
ఉమ్మడి విశాఖలో జిల్లాలోను నేతలు డుమ్మా
ఉమ్మడి విశాఖలో జిల్లాలోను కొందరు నేతలు నిరసన కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ నార్త్ ఇంచార్జ్ కేకే రాజు, ఆడారీ ఆనంద్ ధర్నాలో పాల్గొనలేదట. ఎన్నికల తర్వాత నుంచి ఎంవీవీ సత్యానారయణ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆడారి ఆనంద్, కేకే రాజు విదేశాల్లో ఉండడంతో ధర్నాకు దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, ఎమ్మెల్సీ పందుల రవీంద్రబాబు, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే గడ్డం శ్రీనివాస్ నాయుడు నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.
ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సైతం మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం అధిష్టానాన్ని ఆలోచనలో పడేసిందట.
Also Read: దొరికిందే ఛాన్స్ అనుకుంటున్న వైసీపీ.. అల్లు అర్జున్‌ని అస్త్రంలా వాడుకుంటున్నారా?
కేసుల భయంతో పేర్ని నాని, పేర్ని కిట్టు డుమ్మా
ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీనియర్ నాయకులు చాలా మంది నిరసన కార్యక్రమానికి దూరంగా ఉన్నారట. మంత్రులుగా పని చేసిన కొడాలి నాని,పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేశ్ ఎక్కడ కనిపించకపోవడం జగన్ కి షాక్ ఇచ్చిందట. అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో చక్రం తిప్పిన నేతలు.. నిరసనకు దూరంగా ఉండడం చర్చనీయంశంగా మారింది. అలానే ఎంపీ అభ్యర్ధులుగా పోటీ చేసిన సింహాద్రి చంద్రశేఖర్, కేశినేని నాని ఇద్దరూ కూడా కార్యక్రమానికి దూరంగా ఉన్నారట. కేశినేని నాని పార్టీ మారతారనే టాక్ విజయవాడలో జోరుగా నడుస్తోందట. కేసుల భయంతో పేర్ని నాని, పేర్ని కిట్టు నిరసన కార్యక్రమానికి దూరమయ్యారని అనుకుంటున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ సేమ్ సీన్ రిపీట్
ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ మాజీ మంత్రి సుచరిత, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి,పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకరరావు, వేమూరు ఇంచార్జ్ అశోక్ కుమార్ ధర్నాకు దూరంగా ఉన్నారట. మాజీ మంత్రి సుచరిత కొంత కాలంగా పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. ఆమె పార్టీకి రాజీనామా చేస్తారనే టాక్ కూడా ఉందట. ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని ముఖ్యనేతలందరూ ధర్నాలో పాల్గొనడం వైసీపీకి కాస్త ఊరటనిస్తుంది.
నిరసనకు దూరంగా వైసీపీ ముఖ్య నేతలు పెద్దిరెడ్డి, రోజా
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా నిరసన కార్యక్రమానికి హాజరు కాకపోవడం కార్యకర్తలను కలవరపెడుతుందట. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, శింగనమల మాజీ ఎమ్మెల్యే జోన్నలగడ్డ పద్మావతి నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉన్నారట. ఉమ్మడి కడప జిల్లాలో మాత్రం మాజీ ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ లు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారట.
మనసులో మాట బయటపెట్టి అవంతి శ్రీనివాస్ పార్టీకి గుడ్ బై
మాజీ వైసీపీ నేత అవంతి శ్రీనివాస్.. మనసులో మాట బయటపెట్టి పార్టీని వీడారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి ఏడాదైనా సమయం ఇవ్వకుండానే ధర్నాలు, నిరసనలు అంటే ఎలా అని విమర్శించారు. ఆరు నెలల నుంచే ఆందోళన.. నిరసనలు అంటే, కార్యకర్తలు, నేతలు ఇబ్బంది పడతారన్నారని చెప్పారు. వైసీపీ హయాంలో సొంత పార్టీ కార్యకర్తలు, నేతలు ఇబ్బందులు పడ్డారని జగన్ కు సింపుల్ గా గుర్తు చేశారు. అంతా వాలంటీర్‌లే నడిపించారని తన మనసులో ఉన్న అసంతృప్తిని బయటపెట్టారు.
అంతే కాకుండా బ్రిటిషర్లు అక్కడ నిర్ణయాలు తీసుకుని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ఇక్కడ ధర్నాలు చేయమనడం సమంజసం కాదన్నారు. ఈ వరుస పరిణామాలతో జగన్ అయోమయంలో పడ్డారట. ఆయన తీరు మార్చుకోకపోతే వైసీపీ ఖాళీ కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వెళ్లే వాళ్లని ఆపలేని జగన్.. కనీసం ఉన్న వాళ్లనైనా ఏకపక్ష నిర్ణయాలతో ఇబ్బంది పెట్టకుండా కాపాడుకోవాలని సూచిస్తున్నారు.