Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8లో ఫైనల్స్‌కు ఇంకా ఒక వారమే ఉండడంతో కంటెస్టెంట్స్ అందరి మధ్య పోటీ పెరిగింది. ఇక ఈ సమయంలో కంటెస్టెంట్స్ అంతా ప్రేక్షకులను స్పెషల్‌గా ఓటు అప్పీల్ చేసుకోవడం కోసం అవకాశం అందించారు బిగ్ బాస్. కానీ ఆ అవకాశం అంత ఈజీగా రాదు. టాస్కులు ఆడాలి, గెలుచుకోవాలి. అయితే ఇప్పటికే బిగ్ బాస్ 8 ఫైనలిస్ట్ అయిపోయాడు కాబట్టి తనకు ఈ అవకాశాన్ని దక్కకుండా చేశాడు నబీల్. దీంతో ఒకప్పుడు తనను ఎలిమినేట్ అవ్వకుండా కాపాడడానే విశ్వాసం కూడా లేకుండా నబీల్‌పై తన ప్రతాపం చూపించాడు అవినాష్. ఇలాంటి కీలకమైన సమయంలో కూడా రోహిణి కోసం విష్ణుప్రియా చేసిన త్యాగం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది.
మాట మార్చిన నబీల్
ఓటు అప్పీల్ టాస్కులు ఆడాలంటే కంటెస్టెంట్స్ అంతా జంటలుగా మారాలని బిగ్ బాస్ ఆదేశించారు. ఇక జంట లేని కంటెస్టెంట్ ముందే ఈ టాస్కుల నుండి తప్పుకోవాలని అన్నారు. అందులో ముందుగా ప్రేరణ వచ్చి నిఖిల్‌తో ఆడతానని చెప్పింది. విష్ణుప్రియా రోహిణితో ఆడడానికి ముందుకొచ్చింది. నబీల్.. అవినాష్‌తో ఆడతానని అన్నాడు. కానీ కాసేపటిలోనే తన మనసు మార్చుకున్న నబీల్.. గౌతమ్ పేరు చెప్పాడు. గత వారంలో టికెట్ టు ఫినాలే కంటెండర్ టాస్కులు జరిగినప్పుడు అవినాష్.. టేస్టీ తేజను సపోర్ట్ చేశాడని, గౌతమ్‌కు అన్యాయం జరిగిందని, అందుకే ఇప్పుడు తాను గౌతమ్‌తో కలిసి ఆడతానని అన్నాడు. అది అవినాష్‌కు తప్పుగా అనిపించింది. అందుకే అవినాష్, రోహిణి.. ఇద్దరూ కలిసి నబీల్‌తో వాగ్వాదానికి దిగారు.
Also Read: ప్రేమ పెళ్లికి సిద్ధం అంటున్న పృథ్వీ.. విష్ణుప్రియ లైన్ క్లియర్.?
విష్ణుప్రియా త్యాగం
మొత్తానికి నబీల్ – గౌతమ్, నిఖిల్ – ప్రేరణ, విష్ణుప్రియా – రోహిణి జంటలుగా విడిపోయి ఓటు అప్పీల్‌లో మొదటి టాస్కును మొదలుపెట్టారు. ఇందులో జంటలు కాలికి దారాన్ని కట్టుకొని ఇటుకలు సేకరించి టవర్ పేర్చాలి. ఆ టవర్ పేర్చడం పూర్తయిన తర్వాత జంటల్లో ఒకరు ఆ టవర్‌ను కాపాడుతుంటే మరొకరు ఇతరుల టవర్‌ను కూల్చడానికి ప్రయత్నించాలి. అందులో ముందుగా నబీల్, గౌతమ్ పేర్చిన టవర్ కూలిపోయింది. ఆ తర్వాత విష్ణుప్రియా, రోహిణి పేర్చిన టవర్ కిందపడిపోయింది. చివరిగా ప్రేరణ మాత్రమే తమ టవర్‌ను కాపాడగలిగింది. దీంతో రోహిణి, విష్ణుప్రియాలో ఒకరు మాత్రమే ఓటు అప్పీల్‌లో తర్వాతి టాస్క్ ఆడే అవకాశం దక్కించుకున్నారు. ఈ విషయంలో ఏ మాత్రం ఆలోచించకుండా తను త్యాగం చేసి ఆ అవకాశాన్ని రోహిణికి ఇచ్చింది విష్ణుప్రియా.
ప్రేరణకే అవకాశం
ఓటు అప్పీల్‌లో రెండో టాస్క్ ఆడే అవకాశం ప్రేరణ, రోహిణి, నిఖిల్‌కు దక్కింది. ఇందులో ప్రేరణ విన్నర్‌గా నిలిచింది. ముందుగా ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం ప్రేరణకే లభించింది. తను తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి కేవలం ఏడాదిన్నర మాత్రమే అవుతున్నా తనను తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారని థ్యాంక్స్ చెప్పుకుంది ప్రేరణ. బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ తనకు చాలా ఇష్టమని, అందుకే ఇందులోకి వచ్చానని సంతోషం వ్యక్తం చేసింది. ఈ షో వల్ల తనలోని మంచితో పాటు చెడు కూడా తెలుసుకున్నానని తెలిపింది. బిగ్ బాస్ హిస్టరీలోనే కప్ గెలిచిన మొదటి ఫీమేల్ కంటెస్టెంట్‌గా తనకు నిలవాలని ఉందని, అందుకే తనకు ఓటు వేయమని కోరుకుంది ప్రేరణ.