Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. అందుకే వారంతా ఆటలు ఆడుకుంటూ, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఈ వారాన్ని గడిపేయాలి. ఈ వారమంతా టాస్కులు, గొడవలు, నామినేషన్స్ ఏమీ ఉండవు. వారంతా కలిసి సరదాగా కాలాన్ని గడిపేయడం మాత్రమే ఉంటుంది. అందుకే ప్రస్తుతం హౌస్‌లో ఉన్న అవినాష్, ప్రేరణ, నబీల్, నిఖిల్, గౌతమ్ కలిసి దాగుడుమూతలు ఆడాలని ఫిక్స్ అయ్యారు. ఆట బాగానే మొదలయ్యింది కానీ చివర్లో అవినాష్‌కు షాకిచ్చారు బిగ్ బాస్. బిగ్ బాస్ ఇచ్చిన షాక్‌తో అవినాష్ భయంతో వణికిపోయాడు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.
చిన్నపిల్లల ఆటలు
‘‘బిగ్ బాస్.. మేము ఒక గేమ్ ఆడుతున్నాం. నేను వెళ్లి వాళ్లను కనిపెట్టాలి. నేను ముందుగా ఎవరిని కనిపెడతానో వారు ఔట్’’ అంటూ తాము ఆడే దాగుడుమూతల ఆట గురించి బిగ్ బాస్‌తో అవినాష్ వివరించడంతో ఈ ప్రోమో మొదలవుతుంది. ఈ ఆటలో నబీల్.. కన్ఫెషన్ ఏరియాలో దాక్కుంటాడు. నిఖిల్ స్టోరీ రూమ్‌లో వెళ్లి దాక్కుంటాడు. గౌతమ్ సోఫా వెనుక, ప్రేరణ ఏమో లివింగ్ రూమ్‌లోని టేబుల్ కింద దాక్కుంటుంది. అందరినీ కరెక్ట్‌గా కనిపెట్టగలుగుతాడు అవినాష్. ‘‘నలుగురిని పట్టేసుకున్నాను బిగ్ బాస్’’ అంటూ అవినాష్ చాలా హ్యాపీగా ఫీలవుతాడు. ఇక ఆ ఆటలో రెండో రౌండ్ మొదలవుతుంది.
Also Read: ఎవరీ బిగ్ బాస్.. ఎలా ఉంటారో మీకు తెలుసా..?
డోర్ ఓపెన్ చేయండి
ఈ ఆటలో ఒక్కొక్కరిగా కంటెస్టెంట్స్ యాక్షన్ రూమ్‌లోకి వెళ్లి బయటికి వస్తుంటారు. ఇక అవినాష్ యాక్షన్ రూమ్‌లోకి వెళ్లగానే డోర్ లాక్ అయిపోతుంది. నిఖిల్‌ను ఎంత పిలిచినా లాభం ఉండదు. అందుకే బిగ్ బాస్‌కే డోర్ ఓపెన్ చేయమని రిక్వెస్ట్ చేసుకుంటాడు అవినాష్. ‘‘మీకు దండం పెడతా డోర్ ఓపెన్ చేయండి బిగ్ బాస్. ఆట అయిపోయింది. ఉక్కపోస్తుంది’’ అని తను రిక్వెస్ట్ చేస్తుండగానే లైట్స్ ఆఫ్ చేస్తారు బిగ్ బాస్. గేమ్ ఓవర్ అని చెప్పగానే మొత్తంగా లైట్స్ ఆఫ్ అయిపోతాయి. దీంతో అవినాష్‌లో భయం మొదలవుతుంది. లైట్స్ ఆఫ్ అయ్యి, డోర్ లాక్ అవ్వడంతో ఏమీ చేయలేని అవినాష్.. పాటలు పాడుకుంటూ కూర్చుంటాడు. అదే సమయంలో గజ్జెల శబ్ధం వినిపిస్తుంది.
అవినాష్ అరుపులు
యాక్షన్ ఏరియాలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని మిగతా కంటెస్టెంట్స్ అంతా లివింగ్ రూమ్‌లోని టీవీలో చూస్తూనే ఉంటారు. లోపల అవినాష్ భయపడుతుంటే అందరూ నవ్వుకుంటారు. ‘‘ఇదంతా బయట జనాలు చూస్తే నవ్వుతారు బిగ్ బాస్’’ అంటూ ఏడుస్తూ చెప్తాడు అవినాష్. యాక్షన్ ఏరియాలో తనతో పాటు ఇంకెవరో ఉన్నారనుకొని వారితో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. అప్పుడే సడెన్‌గా ఏదో అరుపు వినిపించగానే వెంటనే వణికిపోతాడు. అలా అరుపులు వినిపిస్తూనే ఉండడంతో భయంతో తాను కూడా అరవడం మొదలుపెడతాడు. ఇదంతా బయట ఉన్న కంటెస్టెంట్స్‌కు మాత్రమే కాదు.. ప్రేక్షకులకు కూడా ఫన్నీ అనిపిస్తుంది.