Bigg Boss 8 Telugu Elimination: బిగ్ బాస్ సీజన్ 8 నుండి ఫైనల్‌గా యష్మీ ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయింది. దీంతో చాలామంది ప్రేక్షకులు హమ్మయ్య అనుకుంటున్నారు. అసలైతే బిగ్ బాస్ 8 ప్రారంభం అయినప్పటి నుండే యష్మీ చాలామంది నచ్చడం లేదు. మొదటి వారంలోనే చీఫ్ అయ్యింది యష్మీ. తన లీడర్‌షిప్ చూసి అసలు ఈ అమ్మాయి ఎలిమినేట్ అయిపోతే బాగుంటుంది అనుకున్నవారు చాలామందే ఉన్నారు. తను చీఫ్‌గా ఉన్నంత కాలం బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన రచ్చ మామూలుగా లేదు. ఆ తర్వాత మెల్లగా తనలో ఫైర్ తగ్గిపోయింది. ఇక గత కొన్నివారాలుగా అయితే తనకు నిఖిల్ తప్పా వేరే ధ్యాసే లేదు. దానివల్లే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుండి తను ఎలిమినేట్ అవ్వక తప్పలేదు.
ప్రేక్షకులకు నచ్చలేదు
బిగ్ బాస్ 8లో ఇప్పటివరకు ఫ్రెండ్స్‌గా వచ్చి లవర్స్‌గా మారినవారు లేరు. మొదటి నుండి అసలు ఈ సీజన్‌లో కపుల్స్ ఎవరు అనే కన్ఫ్యూజన్ అందరు ప్రేక్షకుల్లో ఉంది. కానీ గత కొన్నివారాలుగా నిఖిల్, యష్మీ ఒక పెయిర్ ఏమో అని ప్రేక్షకులకు మాత్రమే కాదు.. కంటెస్టెంట్స్‌కు కూడా అనిపించింది. టాస్కులు వచ్చినప్పుడు నిఖిల్.. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయాడు. టీమ్స్‌లాగా విడిపోయినప్పుడు తన టీమ్ కోసం తను నిలబడ్డాడు. కానీ యష్మీ మాత్రం పూర్తిగా తన ఆటను పక్కన పెట్టి నిఖిల్‌తో క్లోజ్ అయ్యింది. అదే విషయాన్ని తన తండ్రి బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చినప్పుడు కూడా చెప్పారు. అయినా యష్మీ వైఖరి మారలేదు. అది ప్రేక్షకులకు నచ్చలేదు.
Also Read: యష్మీ గౌడ 12 వారాలకు ఎంత సంపాదించిందో తెలుసా?
ఎవరు ఏమనుకున్నా సరే
యష్మీ ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయే ముందు హౌస్‌లో తనకు ఫ్రెండ్స్ ఎవరు, శత్రువులు ఎవరు చెప్పి వెళ్లమన్నారు నాగార్జున. దీంతో ముందుగా ఫ్రెండ్స్ లిస్ట్‌లో ప్రేరణ పేరు చెప్పింది. వెళ్లిపోయే ముందు ప్రేరణ అంటే తనకు ఎంత ఇష్టమో మరోసారి చెప్పింది యష్మీ. ఆ తర్వాత నిఖిల్‌ను తన ఫ్రెండ్ లిస్ట్‌లో యాడ్ చేసింది. ఎవరు ఏమనుకున్నా కూడా నిఖిల్ తనకు మంచి ఫ్రెండ్ అని, ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ఆడమని మోటివేట్ చేసింది. ఆ తర్వాత పృథ్వితో తనకు ఉన్న సాన్నిహిత్యం గురించి చెప్పింది. పృథ్వి, తను పక్కపక్కనే పడుకునేవారని, తనతో ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నానని, తనను బాగా మిస్ అవుతానని ఫీలయ్యింది యష్మీ.
బిగ్ బాంబ్
చివరికి విష్ణుప్రియా కూడా తన ఫ్రెండే అంటూ ఆ లిస్ట్‌లో పెట్టింది యష్మీ. తను ఇచ్చిన సలహాలను ఫాలో అవుతూ వెళ్తే ఇంక తనకు ఎదురు ఉండదు అంటూ ధైర్యం చెప్పింది. హౌస్‌లో శత్రువులు ఎవరు అని అడగగా ముందుగా గౌతమ్ పేరే చెప్పింది యష్మీ. ఒంటరిగా ఆడాలి అనే విషయాన్ని మనసులో పెట్టుకొని ఆడకుండా, అందరితో సరదాగా ఉంటే మంచి ప్లేయర్ అవుతాడని సలహా ఇచ్చింది. ఇక అవినాష్, రోహిణిలను కూడా శత్రువుల కేటగిరిలో వేసి వాళ్లు వాళ్ల ఆటపై ఫోకస్ చేస్తే బాగుంటుందని, సొంతంగా ఆడమని తెలిపింది. వెళ్లే ముందు గౌతమ్, నిఖిల్‌లో ఒకరిపై బిగ్ బాంబ్ వేసే అవకాశమిచ్చారు నాగార్జున. దీంతో గౌతమ్‌పై బిగ్ బాంబ్ వేసి తను రేపు నామినేట్ అయ్యేలా చేసింది.