Bigg Boss 9 Promo:బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త సీజన్లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇప్పటికే 8 సీజన్లు తెలుగులో పూర్తి కాగా.. ఇప్పుడు 9వ సీజన్ కూడా ప్రారంభం అయింది. అయితే అనూహ్యంగా ఈ సీజన్లో ఏకంగా కామన్ మ్యాన్ క్యాటగిరీలో 6 మంది వచ్చారు. అయితే ఆ 6 మందికి కూడా అగ్నిపరీక్ష అంటూ ఒక మినీ షో నిర్వహించి పలు రకాల టాస్కులు పెట్టి అందులో నెగ్గిన ఆరు మందిని ఇప్పుడు హౌస్ లోకి తీసుకోవడం జరిగింది. అలాగే సెలబ్రిటీలు 9 మంది హౌస్ లోకి వచ్చారు.
ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ సీజన్ నుంచి శ్రష్టి వర్మ మొదటి వారం ఎలిమినేట్ అవ్వగా.. మర్యాద మనీష్ రెండవ వారం ఎలిమినేట్ అయ్యారు. మూడవ వారం వచ్చేసింది. ఎప్పుడు నవ్వుతూ ఆడియన్స్ ను మెప్పించిన కంటెస్టెంట్స్ ఇప్పుడు అందరూ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయారు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఒకరిని మించి మరొకరు తమ కుటుంబ సభ్యులను తలుచుకొని ఏడవడం.. ఆడియన్స్ లో కూడా కన్నీటిని తెప్పించింది. ఇక్కడ అన్నిటికంటే హైలైట్ ఏంటంటే.. ఇంత క్లిష్ట సమయాలలో కూడా ఇమ్మానుయేల్ చేసిన త్యాగం అందరిని ఆశ్చర్యపరిచేలా చేసింది. మరి ఈ ప్రోమో ఏంటి అనే విషయం ఇప్పుడు చూద్దాం..
కన్నీళ్లు పెట్టుకుంటున్న కంటెస్టెంట్స్..
ప్రోమో విషయానికి వస్తే.. కంటెస్టెంట్స్ అందురూ టీవీ రూమ్ లోకి రాగా బిగ్ బాస్ మాట్లాడుతూ.. అందరికీ ఇప్పుడు నేనొక మంచి అవకాశాన్ని కల్పిస్తున్నాను. ఇంటి నుంచి వచ్చిన కొన్ని సందేశాలను మీరు నెమరు వేసుకోగలుగుతారు. అయితే ఇందులో ఏది పొందాలనుకున్నా.. అందుకు కొంత మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అది మీ ముందున్న బ్యాటరీ రూపంలో ఉంది. దేని ఖరీదు ఎంతో.. సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. ఎందుకంటే ఈ అవకాశం అందరికీ దొరక్కపోవచ్చు. అంటూ బిగ్ బాస్ చెప్పగానే కంటెస్టెంట్స్ అందరూ తమ ఫ్యామిలీలను తలుచుకొని ఎమోషనల్ అయిపోయారు.టాస్క్ నిర్వహించగా ఎవరైతే ముందుగా బజార్ నొక్కుతారో.. వారికే అవకాశం అని టాస్క్ నిర్వహించారు.
అంత దుఃఖంలో కూడా ఇమ్ము గొప్ప మనసు..
అందులో ఇమ్మానుయేల్ తనూజా తో పాటూ కొంతమంది పోటీ పడగా.. ఇమ్మానుయేల్ ఆ బజర్ టచ్ చేసారు. ఇక ఇమ్మానియేల్ కన్ఫెషన్ రూమ్ కి రాగానే.. బిగ్ బాస్ మాట్లాడుతూ.. టెన్షన్ గా ఉన్నట్లున్నారు అంటూ అడిగాడు. ఆ తర్వాత బిగ్ బాస్ చెబుతూ..” మీ తండ్రి నుంచి ఒక లెటర్ వచ్చింది. దీనిని పొందాలి అంటే హౌస్ బ్యాటరీ నుంచి 45 శాతం చార్జ్ తగ్గుతుంది. అలాగే మీ అమ్మ నుంచి ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. అది పొందాలి అంటే 30% తగ్గుతుంది. అలాగే మీ ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఫోటో వచ్చింది. దానిని పొందాలి అంటే 25% మీరు బ్యాటరీని ఖర్చు చేయాల్సి ఉంటుంది” అంటూ చెబుతాడు బిగ్ బాస్. ఈ మూడింటిలో మీరు ఏది ఎంచుకుంటారో అది చెప్పండి అని బిగ్ బాస్ అడగగా.. ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయిపోయారు ఇమ్మానుయేల్ అంత బాధను దిగమింగుకొని.. “సుమన్ గారు, తనూజ, ప్రియా అందరూ బయట ఏడ్చేస్తున్నారు” అంటూ అంత కష్టంలో కూడా మిగతా వారి కోసం ఆలోచించి గొప్ప మనసు చాటుకున్నారు ఇమ్మానుయేల్. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారుతుంది.
also read:Film industry: రియాలిటీ షోలో పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్.. ఎవరు? ఏ షో అంటే?