BB Kannada 11:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ (Bigg Boss) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఇప్పటికే తెలుగులో ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో, హిందీలో ఏకంగా 18 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక ప్రతి భాష ఇండస్ట్రీలో కూడా ప్రసారమవుతూ ప్రేక్షకులకు నిర్విరామంగా ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న బిగ్ బాస్.. కన్నడలో 11వ సీజన్ తాజాగా ముగిసింది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) హోస్ట్ గా చేసిన ఈ సీజన్, దాదాపు 120 రోజులపాటు సాగింది. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఆదివారం చాలా ఘనంగా ముగిసింది. ఇక చాలా ఉత్కంఠగా హోరాహోరీగా సాగిన ఈ సీజన్ పూర్తి అవడంతో అభిమానులు కాస్త రిలాక్స్ అయ్యారని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సీజన్ విజేతగా హనుమంత లామా (Hanumantha lama) నిలిచారు. సీజన్ మధ్యలో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి, ఏకంగా టైటిల్ విజేతగా నిలవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి తెలుగులో అయితే వైల్డ్ కార్డు ఎంట్రీలను టైటిల్ విజేతగా ప్రకటించరు. ఎందుకంటే ఆరు వారాలు గేమ్ చూసి వస్తారు అనే కోణంలో వీరిని టైటిల్ విజేతగా ప్రకటించరు. కానీ కన్నడలో ఇవేవీ ఆలోచించరు. వారు ప్రేక్షకుల మనసులు గెలిచి ఆకట్టుకుంటే కచ్చితంగా టైటిల్ ఇచ్చేస్తారు. అలా వైల్డ్ కార్డు ద్వారా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన హనుమంత ఏకంగా ఛాంపియన్ అయిపోయారు.
హోరా హోరీగా సాగిన ఓటింగ్..
ఇకపోతే చివరిలో హనుమంత, నటుడు త్రివిక్రమ్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. కానీ చివరి క్షణంలో హనుమంత ఓట్లు భారీగా పెరిగిపోయాయి.సుమారుగా 5 కోట్ల ఓట్లు హనుమంతకు రాగా.. త్రివిక్రమ్ కు 2 కోట్లు వచ్చాయి.ఇక దీంతో హనుమంత ను విజేతగా హోస్ట్ సుదీప్ ప్రకటించారు.
ప్రైజ్ మనీ ఎంత అంటే..
బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 లో విజేతగా నిలిచిన 31 ఏళ్ల హనుమంతకు దాదాపు రూ. 50 కోట్ల ప్రైస్ మనీ లభించింది. ట్రోఫీతో పాటు ఒక లగ్జరీ కార్ ని కూడా అందించారు. రన్నరప్ త్రివిక్రమ్ కు రూ.10 లక్షల ప్రైజ్ మనీ లభించింది.
ఫైనలిస్టులు వీరే..
ఈసారి బిగ్ బాస్ సీజన్ 11 లో దాదాపు 20 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఫైనల్ కి హనుమంత, త్రివిక్రమ్, రజత్, మోక్షిత, మంజు చేరారు. దీంట్లో హనుమంత విన్నర్ కాగా.. త్రివిక్రమ్ రన్నరప్ గా నిలిచారు. రజత్ మూడో స్థానాన్ని కైవసం చేసుకోగా.. మోక్షిత నాలుగు, మంజు 5 స్థానాల్లో నిలిచారు.
ఎవరీ హనుమంత..?
ఇకపోతే ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి, సక్సెస్ కొట్టడంతో ఎవరు ఈ హనుమంత అని నెటిజెన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇతడి సొంత ఊరు కర్ణాటకలోని హవేరి. మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈయన.. డిగ్రీ వరకు హవేరీలో పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి పాటలు పాడేవారు. అలా ఎన్నో పాటల పోటీల్లో కూడా పాల్గొన్నారు. 2018 లో సరిగమప కన్నడ 15వ సీజన్లో పాల్గొన్నారు. అక్కడ మొదటి రన్నరప్ గా నిలిచి, మళ్లీ 2019లో డాన్స్ కర్ణాటక డాన్స్ ఫ్యామిలీ వార్ సీజన్ 2 లో కూడా పాల్గొన్నారు. ఇక 2023లో ఒక రియాల్టీ షో కూడా చేశారు.. ఇలా ప్రేక్షకులకు దగ్గరవుతూ వచ్చిన ఈయన Zee 5 లో కామెడీ ఖిలాడిగలు ప్రీమియర్ లో ఆకట్టుకున్నారు. దీంతో ప్రేక్షక ఆదరణ భారీగా పెరిగిపోయింది. బిగ్ బాస్ లోకి 21వ రోజు వైల్డ్ కార్డు ద్వారా వచ్చి ఏకంగా టైటిల్ ను కైవసం చేసుకున్నారు.