SIP Returns: భవిష్యత్తు కోసం డబ్బు కూడబెట్టాలంటే పెద్ద మొత్తంలోనే పెట్టుబడి పెట్టాలని చాలామంది అనుకుంటారు. అయితే నెలకు రూ.3,000 వంటి చిన్న మొత్తంతో కూడా దీర్ఘకాలంలో మంచి నిధిని తయారు చేసుకోవచ్చు. అందుకు మ్యూచువల్ ఫండ్ SIP ఒక మార్గం. అయితే ఇందులో ఎంత కాలం పెట్టుబడి పెడుతున్నాం? ఎంత రాబడి వస్తోంది? అనే విషయాలపైనే చివరికి చేతికి వచ్చే మొత్తం ఆధారపడి ఉంటుంది. మీరుగనుక నెలకు రూ.3,000 చొప్పున 20 ఏళ్ల పాటు SIP చేస్తే, 15 శాతం వార్షిక రాబడి అంచనాతో సుమారు రూ.40.81 లక్షల నిధి ఏర్పడవచ్చు. అయితే ఈ మొత్తం రెండేళ్లలో వచ్చేది కాదు. దీనికోసం రెండు దశాబ్దాల పాటు పెట్టుబడిని కొనసాగించాలి. మరి 10, 15, 20 ఏళ్లలో ఎంత మొత్తం సమకూరుతుందో చూద్దాం.
నెలకు రూ.3,000 చొప్పున 10 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే మనం జమ చేసే మొత్తం రూ.3.60 లక్షలు. ఈ పెట్టుబడిపై ఏడాదికి 12 శాతం రాబడి వస్తుందని అనుకుంటే సుమారు రూ.6.7 లక్షల నుంచి రూ.6.9 లక్షల వరకు నిధి ఏర్పడవచ్చు. అదే 15 శాతం రాబడి వస్తే దాదాపు రూ.8.35 లక్షలు చేతికి రావచ్చు. అంటే పెట్టిన డబ్బుపై అదనంగా మంచి మొత్తమే సమకూరుతుంది.
ఇదే పెట్టుబడిని మరో ఐదేళ్లు కొనసాగిస్తే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది. 15 ఏళ్లలో మనం పెట్టే అసలు మొత్తం రూ.5.40 లక్షలు. దీనికి 12 శాతం రాబడిని అంచనా వేస్తే సుమారు రూ.15.13 లక్షలు రావచ్చు. అదే 15 శాతం రాబడి వస్తే దాదాపు రూ.18.49 లక్షల నిధి ఏర్పడే అవకాశం ఉంటుంది.
SIPలో ఎక్కువ కాలం పెట్టుబడి కొనసాగించడం వల్ల కాంపౌండింగ్ ప్రభావం కనిపిస్తుంది. నెలకు రూ.3,000 చొప్పున 20 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే మన జేబు నుంచి వెళ్లే మొత్తం రూ.7.20 లక్షలు మాత్రమే. 12 శాతం వార్షిక రాబడి అంచనాతో సుమారు రూ.27.59 లక్షలు రావచ్చు. అదే 15 శాతం రాబడి వస్తే రూ.40.81 లక్షల వరకు ఫండ్ పెరిగే అవకాశం ఉంటుంది.
అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మ్యూచువల్ ఫండ్లలో రాబడికి ఎలాంటి హామీ ఉండదు. మార్కెట్ పరిస్థితులను బట్టి లాభాలు తగ్గవచ్చు, పెరగవచ్చు. కాబట్టి ఈ లెక్కలను ఖచ్చితంగా వచ్చే మొత్తంగా కాకుండా ఒక అంచనాగా మాత్రమే చూడాలి. పెట్టుబడి పెట్టే ముందు ఫండ్ రిస్క్, పెట్టుబడి కాలం, మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలించడం మంచిది.
Read Also: PPF vs SIP vs SSY… 3000లతో 15 లక్షల సంపాదన… పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ?