SSC Memo: పదో తరగతి మెమోలలో పేరు, పుట్టిన తేదీ సవరణల కోసం మీ-సేవ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 17 నుంచే ఈ ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
దరఖాస్తుల సమర్పణ ప్రక్రియను మరింత సులభతరం చేసి, విద్యార్థులు, తల్లిదండ్రులకు సౌలభ్యం కల్పించే ఉద్దేశంతో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు సంచాలకులు వివరించారు. మెమోలలో సవరణలు కోరే విద్యార్థులు, తల్లిదండ్రులు లేదా సంబంధిత వ్యక్తులు అవసరమైన ధ్రువపత్రాలతో సమీపంలోని మీ-సేవ కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. దరఖాస్తుదారులు సవరణలకు సంబంధించిన వివరాలను ఎటువంటి తప్పులు లేకుండా కచ్చితంగా నమోదు చేసి, సంబంధిత పత్రాలను జతచేయాలని తెలిపారు.
ఆన్‌లైన్ ద్వారా అందిన దరఖాస్తులను పాఠశాల విద్యాశాఖలో అమలులో ఉన్న నిబంధనలు, నిర్దేశిత విధానాల ప్రకారం పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కావున టెన్త్ మెమోలలో మార్పులు చేర్పులు చేసుకోవాలనుకునే విద్యార్థులు, ప్రజలు ఈ ఆన్‌లైన్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నవీన్ నికోలస్ సూచించారు.
Also Read: 8.20 శాతం వడ్డీ రేటు… ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే అధిక వడ్డీ ఇచ్చే ఈ 7 పథకాల గురించి తెలుసా ?