Investment Schemes: ఒకప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లు(FDs) అంటే వడ్డీ బాగా వస్తుందన్న అభిప్రాయం చాలా మంది పెట్టుబడిదారుల్లో ఉండేది. కానీ రాను రాను ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. ఎఫ్ డీపై ఇచ్చే వడ్డీరేట్లు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. సాధారణ బ్యాంక్ ఎఫ్‌డీలపై వార్షిక వడ్డీ 6.05% నుండి 6.40% వరకు మాత్రమే లభిస్తోంది. ఈ నేపథ్యంలో కాస్త తెలివిగా పెట్టుబడి పెడితే 8.20% వరకు గ్యారెంటీ రిటర్న్స్ పొందొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అది కూడా ప్రభుత్వ, బ్యాంకింగ్ పథకాల ద్వారా సంపాదించవచ్చని స్పష్టం చేస్తున్నారు. సాధారణ ఎఫ్‌డీ కంటే ఎక్కువ లాభాన్ని 4 కీలమైన మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు ఎఫ్‌డీ మొత్తాన్ని క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల బ్యాంకులు పెనాల్టీ విధిస్తాయి. ఈ ఇబ్బంది లేకుండా SBI తీసుకొచ్చిన ప్రత్యేక పథకమే ‘మల్టీ-ఆప్షన్ డిపాజిట్ (MOD)’. ఇది సేవింగ్స్ ఖాతాతో అనుసంధానమై ఉంటుంది. ఖాతాలో నిర్ణీత పరిమితికి మించిన అదనపు సొమ్ము దానంతట అదే ఎఫ్‌డీ రూపంలోకి మారుతుంది. మీకు ఎప్పుడైనా డబ్బు అవసరమైతే ఏటీఎం లేదా యూపీఐ (UPI) ద్వారా నేరుగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇలా చేసినప్పుడు ఎఫ్‌డీ మొత్తం రద్దు కాకుండా అవసరమైనంత మొత్తం మాత్రమే విత్‌డ్రా అవుతుంది. మిగిలిన డిపాజిట్‌పై సాధారణ ఎఫ్‌డీల లాగే 6.05% నుండి 6.45% వరకు పూర్తి వడ్డీ లభిస్తుంది.
ఒకటిన్నర సంవత్సరం కాలపరిమితికి డబ్బును సురక్షితంగా డిపాజిట్ చేయాలనుకునే వారికి SBI ‘అమృత్ వృష్టి’ స్కీమ్ చక్కగా ఉపయోగపడుతుంది. ఇది 444 రోజుల వ్యవధి కలిగిన ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం. సాధారణ ఎఫ్‌డీల కంటే ఇందులో వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఈ పథకం కింద సాధారణ పౌరులకు ఏటా 6.45%, సీనియర్ సిటిజన్లకు 6.95%, 80 ఏళ్లు దాటిన ‘సూపర్ సీనియర్ సిటిజన్లకు’ 7.05% వరకు వార్షిక వడ్డీ లభిస్తుంది. సాధారణ ఎఫ్‌డీకి వర్తించే లిక్విడిటీ నిబంధనలే దీనికి కూడా వర్తిస్తాయి.
సుదీర్ఘకాలంపాటు ఎలాంటి రిస్క్ లేని రాబడి కోరుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ‘ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లు (FRSB)’ బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. ఇవి భారత ప్రభుత్వం జారీ చేసే బాండ్లు కావడం వల్ల ఏమాత్రం రిస్క్ ఉండదు. ఈ బాండ్ల వడ్డీ రేటు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) రేటు కంటే 0.35% అదనంగా ఉంటుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ వడ్డీ రేట్లను సమీక్షిస్తారు. ప్రస్తుతం ఈ బాండ్లు ఏటా 8.05% వడ్డీని అందిస్తున్నాయి. ఇది SBI 5 ఏళ్ల ఎఫ్‌డీ (6.05%) కంటే 2 శాతం ఎక్కువ. అయితే ఈ బాండ్లకు 7 సంవత్సరాల లాకిన్ పీరియడ్ ఉంటుంది.
Also Read: 5thలో 48% మార్కులు.. తండ్రి షాపులో సమోసాల విక్రయం.. కట్ చేస్తే ఐఐటీ టాపర్, దుబాయిలో ఏఐ లీడ్!
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోస్ట్ ఆఫీస్ సంస్థ అద్బుతమైన స్కీమ్స్ తో మెరుగైన లాభాలను అందిస్తోంది. SBI 5 ఏళ్ల ఎఫ్‌డీపై 6.05% ఇస్తుంటే.. పోస్ట్ ఆఫీస్ 5 ఏళ్ల టైమ్ డిపాజిట్‌పై ఏటా 7.50% వడ్డీ ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పూర్తి పన్ను మినహాయింపు సైతం లభించనుంది. 6 నెలల తర్వాత నిబంధనలకు లోబడి డబ్బును వెనక్కి తీసుకునే సదుపాయం కూడా పోస్ట్ ఆఫీసు కల్పిస్తోంది. మరోవైపు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టే వృద్ధులకు ఏటా 8.20% గ్యారెంటీ వడ్డీని సైతం పోస్ట్ ఆఫీసు అందిస్తోంది.
Also Read: Jio vs Airtel.. కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లలో దేనివి బెస్ట్? సూటిగా సుత్తిలేకుండా!