Success Story| ఒక క్రియేటివ్ ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఇలాంటి కథే అజయ్ గోపీనాథ్‌ది. ఒక సాధారణ రెస్టారెంట్ భోజనం అజయ్ గోపీనాథ్ జీవితంలో కొత్త ఆలోచనకు కారణమైంది.
కేరళలోని కొచ్చికి చెందిన అజయ్ అప్పట్లో బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్నారు. బెంగళూరులోని ఒక రెస్టారెంట్‌కు వెళ్లిన సమయంలో ఆయన మైక్రోగ్రీన్స్.. మొదటిసారి చూశారు. మైక్రోగ్రీన్స్ అంటే కూరగాయలు, ఆకుకూరలు, మూలికల చిన్న మొక్కలు. వాటిని వంటకాల్లో రుచి, రంగు, పోషక విలువలు పెంచేందుకు ఉపయోగిస్తారు. ఈ చిన్న మొక్కలను చూసిన అజయ్ వాటి గురించి మరింత తెలుసుకోవాలని ఆసక్తి చూపించారు.
మైక్రోగ్రీన్స్‌ను ఎలా పెంచాలి అనే విషయంపై అజయ్ పరిశోధన ప్రారంభించారు. 2017 – 18 ప్రాంతంలో ఇంట్లోనే చిన్న స్థాయిలో మైక్రోగ్రీన్స్ సాగు చేయడం మొదలుపెట్టారు. అయితే, వెంటనే వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన చేయలేదు. దాదాపు రెండేళ్ల పాటు వివిధ పద్ధతులను పరిశీలిస్తూ ప్రయోగాలు చేశారు. విత్తనాలు, ఉష్ణోగ్రత, పెంపకం విధానాలపై అనేక పరీక్షలు నిర్వహించారు.
అజయ్ చేసిన తొలి ప్రయోగాలు అన్నీ విజయవంతం కాలేదు. ఆయన టిష్యూ పేపర్ ఉపయోగించి పెసలను పెంచేందుకు ప్రయత్నించారు. అయితే, ఆశించిన ఫలితాలు రాలేదు. ఆన్‌లైన్ వీడియోలు కూడా ఆయనకు అవసరమైన పూర్తి సమాచారం ఇవ్వలేకపోయాయి. దీంతో అజయ్ బ్రిటన్‌లోని ఒక మైక్రోగ్రీన్స్ నిపుణుడి సలహా తీసుకున్నారు. మంచి మైక్రోగ్రీన్స్ కోసం సరైన విత్తనాలను ఎంచుకోవడం ముఖ్యమని తెలుసుకున్నారు. అజయ్ నాన్ – జిఎంఓ, నాన్ – హైబ్రిడ్ విత్తనాలను ఉపయోగించడంపై దృష్టి పెట్టారు. అలాగే, ట్రీట్మెంట్ చేయని, ఓపెన్ – పాలినేటెడ్ విత్తనాలను ఎంచుకున్నారు.
ఆయన బెంగళూరు, పుణే, ఛత్తీస్‌గఢ్ వంటి ప్రాంతాల నుంచి విత్తనాలు సేకరించారు. ప్రతి ప్రయోగంతో తన సాగు పద్ధతులను మరింత మెరుగుపరుచుకున్నారు.
మైక్రోగీన్స్ గురించి మంచి అనుభవం పొందిన తర్వాత అజయ్ ఇంట్లోని చిన్న గదిని సాగు కేంద్రంగా మార్చారు. దాదాపు 80 చదరపు అడుగుల గదిలో ‘గ్రో గ్రీన్స్’ బిజినెస్ ప్రారంభమైంది. ఆయన మొదట రెండు ర్యాక్‌లు, కొన్ని ట్రేలతో సాగు ప్రారంభించారు. తక్కువ స్థలంలో మైక్రోగ్రీన్స్ పెంచవచ్చు, కానీ సరైన జాగ్రత్తలు అవసరం. ఉష్ణోగ్రత, విత్తనాల క్వాలిటీ, పెరుగుదల పరిస్థితులపై ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తర్వాత రాడిష్, మస్టర్డ్, సన్‌ఫ్లవర్, బీట్ వంటి రకాలను సాగులోకి తీసుకొచ్చారు.
‘గ్రో గ్రీన్స్’ ప్రస్తుతం 35కి పైగా మైక్రోగ్రీన్స్ రకాలను అందిస్తుందని కంపెనీ వెబ్‌సైట్ చెబుతోంది. దేశవ్యాప్తంగా 140కి పైగా ఫ్రాంచైజ్ మోడళ్లతో పనిచేస్తున్నట్లు కంపెనీ పేర్కొంటోంది. కంపెనీ రోజుకు సుమారు 5 కిలోల తాజా మైక్రోగ్రీన్స్ ఉత్పత్తి చేస్తోంది. పురుగుమందులు, ఎరువులు లేకుండా ఉత్పత్తి చేస్తున్నట్లు అజయ్ తెలిపారు.
Also Read: వయసు 21 ఏళ్లు.. ఒక్క నెలలో రూ.2.6 కోట్లు సంపాదన.. యువకుడి బిజినెస్ ఐడియా అదుర్స్
చిన్న ఇంటి ప్రయోగంతో ప్రారంభమైన అజయ్ ప్రయాణం ఇప్పుడు పెద్ద వ్యాపారంగా మారింది. మైక్రోగ్రీన్స్ ద్వారా అజయ్ నెలకు రూ.5 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఉద్యోగం వదిలి వ్యాపారం ప్రారంభించే ముందు అజయ్ చాలా కాలం పాటు నేర్చుకున్నారు. పరిశోధన, ప్రయోగాలు, నాణ్యతపై దృష్టి ఆయన వ్యాపార ప్రయాణంలో కీలకంగా నిలిచాయి.
చిన్న స్థలాన్ని ఉపయోగించి వ్యవసాయ ఆధారిత వ్యాపారం చేయవచ్చని ఆయన ప్రయాణం చూపిస్తోంది. సరైన పరిజ్ఞానం, నాణ్యమైన విత్తనాలు, స్థిరమైన ఉత్పత్తి ఉంటే అవకాశాలు పెరుగుతాయి.
Also Read: అత్యవసరంగా డబ్బు కావాలా? మీ పిపిఎఫ్ అకౌంట్ నుంచి ఈజీ లోన్ లభిస్తుందిగా