Bengaluru Cook Payment Average Food| ఉద్యోగాలకు వెళ్లే దంపతులకు రోజూ వంట చేయడం పెద్ద పనిగా మారుతోంది. కూరగాయలు కొనడం నుంచి వంట చేయడం, వంటగదిని శుభ్రం చేయడం వరకు ఎన్నో పనులు ఉంటాయి. ఈ ఇబ్బందులను తగ్గించుకోవడానికి చాలామంది వంట మనుషులను నియమించుకుంటున్నారు. అయితే, వంట రుచిగా లేకపోయినా నెలకు రూ.8,000 చెల్లిస్తూ తన వంట మనిషిని కొనసాగిస్తున్నానని బెంగళూరుకు చెందిన మేఘా అనే మహిళ సోషల్ మీడియాలో చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మేఘా తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులో ఇద్దరు మనుషుల కుటుంబం కోసం రోజుకు రెండుసార్లు వంట చేయడానికి నెలకు సుమారు రూ.7,000 నుంచి రూ.8,000 వరకు ఖర్చవుతుంది. సాధారణంగా వంట మనుషులు రోజులో పలు ఇళ్లకు వెళ్లి వంట చేయాల్సి ఉంటుంది. అందువల్ల ప్రతి ఇంట్లో ఎక్కువ సమయం కేటాయించడం సాధ్యం కాదు.
కూరగాయలు తరగడం, రెండు వంటకాలు తయారు చేయడం, వెంటనే మరో ఇంటికి వెళ్లడం వంటి పనులతో వారు బిజీగా ఉంటారు. ప్రెషర్ కుక్కర్లలో పప్పు, బంగాళాదుంపలు, సోయా, చికెన్ వంటి పదార్థాలను త్వరగా వండేస్తారని మేఘా సరదాగా వ్యాఖ్యానించారు. పైగా వంటిమనిషికి సరైన సూచనలు చేయకపోతే వంటలో నూనె, మసాలాలు ఎక్కువయ్యే అవకాశం కూడా ఉందన్నారు.
వంట మనిషిని నియమించుకోవడం అంటే కేవలం భోజనం తయారు చేయించుకోవడం మాత్రమే కాదని మేఘా అభిప్రాయపడ్డారు. రోజూ ఏం వండాలి? ఏ కూరగాయలు కొనాలి? వంటకు కావాల్సిన సరుకులు ఎలా సిద్ధం చేసుకోవాలి? అనే ఆలోచనల నుంచి కూడా కొంత ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగాలకు వెళ్లే దంపతులకు ఈ సౌకర్యం ఎంతో ఉపయోగపడుతుంది. వంట కోసం వెచ్చించాల్సిన సమయాన్ని ఇతర పనులకు లేదా విశ్రాంతికి కేటాయించవచ్చు.
మేఘా పోస్ట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు ముందుగానే పదార్థాలను సిద్ధం చేసుకుని అరగంటలో వంట పూర్తి చేయవచ్చని సూచించారు. మరికొందరు వారానికి సరిపడా భోజనం సిద్ధం చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే, వంట చేయడం అంటే కేవలం పొయ్యి వెలిగించడం కాదని మరికొందరు గుర్తుచేశారు. సరుకులు కొనడం, మెనూ ప్లాన్ చేయడం, పదార్థాలను నిల్వ చేయడం వంటి పనులకు కూడా సమయం పడుతుందని పేర్కొన్నారు. చెన్నైలో ఇలాంటి సేవలకు నెలకు రూ.12,000 నుంచి రూ.15,000 వరకు ఖర్చవుతుందని ఓ నెటిజన్ చెప్పారు.
Also Read: గర్ల్‌ఫ్రెండ్ బర్త్‌డే కోసం ఏ గిఫ్ట్ కొనాలా అని టెన్షన్ పడుతున్నారా? 5 బెస్ట్ ఐడియాస్ మీ కోసం
కొంతమంది యూజర్స్.. తమ ఇంట్లో వంటమనుషులు వివిధ రకాల వంటకాలు కూడా అద్భుతంగా తయారు చేస్తారని తెలిపారు. మరికొందరు మాత్రం రుచి విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని బట్టి ప్రతి కుటుంబం అభిరుచులు, అంచనాలు వేర్వేరుగా ఉంటాయని అర్థమవుతోంది.
మొత్తానికి, వంట మనిషిని నియమించుకోవాలా వద్దా అనేది వారి బడ్జెట్, ఆహారపు అభిరుచులు, సమయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కొందరికి రుచికరమైన భోజనం ముఖ్యం కాగా, మరికొందరికి రోజువారీ పనుల నుంచి లభించే సమయమే అసలైన ప్రయోజనం.
Also Read: స్వీట్స్ తినడం కంటే ఇది డేంజర్.. షుగర్ సమస్య పెరగడానికి అతిపెద్ద కారణం ఇదే