Bombay Stock Market: అంతర్జాతీయ పరిణామాలతో ఒక్కసారిగా చమురు ధరలు పెరిగాయి. ఫలితంగా మదుపరులు అమ్మకాలకు పాల్పడడంతో బాంబే స్టాక్‌మార్కెట్ సూచీలు కుప్పకూలాయి. ఈ నేపథ్యంలో మదుపరులకు సంబంధించి దాదాపు రూ.6 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఈ పతనం వెనుక అసలు ఏం జరిగింది?
ముడి చమురు ధరల పెరుగుదల, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, బలహీనమైన ప్రపంచ సంకేతాల మధ్య బాంబే స్టాక్‌మార్కెట్‌లోని బెంచ్ మార్క్ సూచీలు తమ ఏడు వారాల నష్టాల పరంపరను కొనసాగిస్తున్నాయి. సోమవారం ఉదయం మార్కెట్ ప్రారంభంకాగానే దాదాపు ఆరు నెలల కనిష్టస్థాయికి సూచీలు పడిపోయాయి. విదేశీ మదుపరులు నిధుల తరలింపుతో పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది.
స్టాక్‌మార్కెట్‌లో నిఫ్టీ, బీఎస్ఈ సెన్సెక్స్ వరుసగా ఏడు వారాలుగా క్షీణించి దాదాపు 6 శాతం నష్టపోయాయి. సోమవారం ఉదయం సుమారు 10.30 గంటలకు సెన్సెక్స్ 965.89 పాయింట్లు అంటే 1.31 శాతం తగ్గి 72,929.85 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 305 పాయింట్లు నష్టపోయి అంటే 1.32 శాతం తగ్గింది. ప్రస్తుతం 22,835 వద్దకు సూచీలు అటు ఇటు కదులుతున్నాయి. మొత్తం 16 ప్రధాన రంగాలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ స్మాల్‌క్యాప్, నిఫ్టీ 100, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీలు చెరో 1.43 శాతం మేరా పతనమయ్యాయి. భారీ అమ్మకాలతో బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ నుంచి దాదాపు రూ. 6 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది.
హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచి పోరాటాన్ని ముగించాలన్న ఇరాన్ ప్రతిపాదనను తిరస్కరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. ఆ తర్వాత ప్రపంచ చమురుపై తీవ్ర ప్రభావం చూపింది. చమురు ధరల ప్రభావం ద్రవ్యోల్బణాన్ని పెంచడం, దిగుమతి బిల్లును విస్తరించడం, కార్పొరేట్ లాభాలను తగ్గిస్తుందన్న సంకేతాలు భారత్ మార్కెట్‌పై పడినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా-కోస్పి, జపాన్ నిక్కీ-225 సూచీ, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. వాల్ స్ట్రీట్ ఫ్యూచర్స్ 0.07 శాతం వరకు నష్టాల్లో ట్రేడ్ అయ్యింది.
ALSO READ: అక్టోబర్ 1 నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ రూల్స్‌లో మార్పులు.. రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనలు ఇవే