Rs 15 Lakh Income Tax | మధ్య తరగతి ప్రజలకు ఆదాయ పన్ను నుంచి ఉపశమనం కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశంలో నిత్యావసరాల ధరలు పెరిగిపోయి ద్రవ్యోల్బణం పై పైకి దూసుకుపోతున్న నేపథ్యంలో వార్షిక ఆదాయం రూ.15 లక్షలు వరకు ఉన్న వారికి కూడా బడ్జెట్ 2025-26లో పన్ను తగ్గించేందుకు కేంద్రం యోచిస్తోంది. పన్ను శాతం తగ్గిస్తే.. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని నిపుణులు గత కొంత కాలంగా వాదిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను ఎంత శాతం తగ్గించనుందో స్పష్టం కాలేదు. ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. ఆ సమయంలోనే ఈ తగ్గిన పన్నుల స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అయితే వార్షికాదాయం రూ.3 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉన్న వారు.. ప్రస్తుతం 2020 ఆదాయ పన్నువిధానాల ప్రకారం.. 5 శాతం నుంచి 20 శాతం పన్ను చెల్లించాలి. రూ.15 లక్షలకు ఆదాయం మించితే 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. భారతదేశంలో ప్రస్తుతం రెండు ఆదాయ పన్ను విధానాలున్నాయి. పాత విధానంలో ఇంటి అద్దె, ఇన్సూరెన్స్ ప్రీమియంలపై పన్ను మినహాయింపులు ఉన్నాయి. కానీ 2020 విధానం ఈ మినహాయింపులు ఉండవు. కానీ పాత ఆదాయ పన్ను స్లాబ్ ప్రకారం.. రూ.12 లక్షల కు పై వార్షికాదాయం ఉన్నవారు 30 శాతం పన్ను చెల్లించాలి. కొత్త ఆదాయ పన్ను స్లాబ్ ప్రకారం.. రూ.15 లక్షల కంటే ఎక్కువ ఉన్నవారు మాత్రమే 30 శాతం పన్ను చెల్లించాలి.
అయితే ఇప్పుడు రూ.15 లక్షల ఆదాయ పరిమితి ఉన్నవారికి పన్ను శాతం తగ్గిస్తే.. దేశంలోని కోట్లాది మంది మధ్య తరగతి ప్రజలకు ఊరట లభిస్తుందనడంతో సందేహం లేదు. దేశంలో ఆదాయ పన్ను చెల్లించే వారిలో ఎక్కువగా కనీసం రూ.10 లక్షలు వార్షికాదాయం కలిగిన వారే ఉన్నారు. వీరు పాత ఇన్‌కం ట్యాక్స్ స్లాబ్ ప్రకారం.. 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది.
Also Read: బిజేపీకి రూ.2600 కోట్ల విరాళాలు.. కాంగ్రెస్‌కు రూ.281 కోట్లు మాత్రమే.. ఈసీ నివేదిక
అయితే ఆదాయ పరిమితి రూ.15 లక్షల వరకు ఉన్నవారికి పన్ను శాతం తగ్గిస్తే.. అందరూ కొత్త విధానాన్నే ఎంచుకుంటారు. దీంతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగి దేశంలో మందగించిన వ్యాపార వ్యవస్థ పరుగులు తీసే అవకాశం ఉందని నిపుణలు అభిప్రాయపడుతున్నారు. గత ఏడు త్రైమాసికాల కాలంలో గణాంకాలు చూస్తే.. దేశ ఆర్థిక వ్యవస్థ నత్తనడకన వృద్ధి సాధిస్తోంది. ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగిపోవడంతో ప్రజలు కార్లు, బైక్ లు, ఎఫ్ఎంసిజి ఉత్పత్తులు కొనుగోలుని తగ్గించేశారు. ధరలు పెరిగినంత వేగంగా ఆదాయాలు పెరగకపోపవడంతో దేశంలోని మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశంలోని ఆర్థికవేత్తలు, నీతి ఆయోగ్ నిపుణులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మందగించిన ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేయడానికి ఆర్థికవేత్తలందరూ పన్ను శాతం, బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించాలని, ఎగుమతులు పెంచేవిధంగా చర్యలు చేపట్టాలని కీలక సూచనలు చేశారు.
2024-25 బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇన్‌కం ట్యాక్స్ చట్టాన్ని పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తున్నామని ప్రకటించారు. దీని కోసం ఇన్‌కం ట్యాక్స్ చీఫ్ కమిషనర్ వికె గుప్తా నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇన్‌కం ట్యాక్స్ చట్టాన్ని సమీక్షించి భారీ మార్పులు చేసేందుకు సూచనలు చేస్తుందని సీతారామన్ తెలిపారు. అయితే ఫిబ్రవరి 1, 2025న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 సంవత్సరానికి గాను ఆదాయం పన్ను స్లాబ్ లో ఏ మార్పులు చేయనుందో వేచి చూడాల్సిన పరిస్థితి.