Tata Trust Vs Tata Sons: టాటా గ్రూప్‌లో ఏం జరుగుతోంది? టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్‌ని టాటా ట్రస్ట్స్ ఎందుకు వ్యతిరేకిస్తోంది? అంతర్గత కారణాలు అందుకు కారణమా? చంద్రశేఖరన్‌ను టాటా సన్స్ ఛైర్మన్‌గా తిరిగి నియమించే తీర్మానం చెల్లదని ఎందుకు ప్రస్తావించింది? అంతర్గత కలహాలు గ్రూప్‌పై పడుతుందా? దాని ప్రభావం సోమవారం మార్కెట్‌పై పడుతుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ పునర్నియామకం టాటా గ్రూప్‌లో మరొక వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది. ఆయన నియామకాన్ని సవాల్ చేసింది టాటా ట్రస్ట్. ఈ మేరకు మెజారిటీ వాటాదారుడైన టాటా ట్రస్ట్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 17న జరిగిన బోర్డు సమావేశంలో చంద్రశేఖరన్ రీనియామకం ఆమోదించిన తీర్మానం చట్ట బద్ధంగా చెల్లదని తేల్చేసింది. దానికి ఎలాంటి విలువ లేదని స్పష్టం చేసింది టాటా ట్రస్ట్. కంపెనీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రకారం.. బోర్డు తీసుకునే ఏ నిర్ణయానికైనా టాటా ట్రస్ట్స్ నామినేట్ చేసిన డైరెక్టర్లలో మెజారిటీ మద్దతు తప్పనిసరి అని ప్రస్తావించింది. బోర్డులో ఇద్దరు ట్రస్ట్ నామినీల్లో ఒకరు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారని పేర్కొంది.
అవసరమైన మద్దతు లభించలేదని దీనివల్ల ఆ తీర్మానం వీగిపోయిందనేది ట్రస్ట్ వాదన. ఓట్లు సమానమైనప్పుడు చైర్మన్‌కు కాస్టింగ్ ఓటు హక్కు ఉంటుందని గుర్తు చేసింది. ట్రస్ట్ నామినీల మద్దతుకు సంబంధించిన ప్రత్యేక నిబంధనను అధిగమించలేదని తెలిపింది. ఓటింగ్ బోర్డులో ప్రతిష్టంభనను సృష్టించిందన్న వాదనలను ట్రస్టు తోసిపుచ్చింది. ఛైర్మన్ నిర్ణయాత్మక ఓటు ఈ నిబంధనను అధిగమించలేదని పేర్కొంది. ఆ తీర్మానం ప్రారంభం నుంచి చెల్లదని ప్రకటించింది. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీకి చంద్రశేఖరన్ ఛైర్మన్‌గా కొనసాగేందుకు అనుకూలంగా సెప్టెంబర్ 17న టాటా సన్స్ బోర్డు 4-1 ఓట్లతో తీర్మానించిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. టాటా సన్స్ నియమావళి ప్రకారం.. బోర్డు తీసుకునే నిర్ణయాన్ని కేవలం డైరెక్టర్ల సంఖ్యపై ఆధారపడి ఉండదని ఆ ప్రకటన పేర్కొంది.
ALSO READ: సెప్టెంబర్ 28 నుంచి సమ్మె.. అలర్టయిన ఎస్బీఐ, కస్టమర్లకు ముఖ్య గమనిక
ట్రస్ట్ నామినేట్ చేసిన ఇద్దరిలో ఒకరు చంద్రశేఖరన్ పునఃనియామకాన్ని వ్యతిరేకించినందున ఆ ప్రతిపాదనకు ఆమోదం లభించలేదని వాదించింది. గతంలో టాటా-మిస్త్రీ కేసులో సుప్రీంకోర్టు తమ రక్షణ హక్కులను సమర్థించిందని ఈ సందర్భంగా టాటా ట్రస్ట్స్ ప్రస్తావించింది. ప్రస్తుత చైర్మన్ కంపెనీ నిబంధనలను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. ఈ వ్యవహారం కోర్టు ద్వారా తేల్చుకునేందుకు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని నియమించుకుంది టాటా ట్రస్ట్. వాటాదారుల ప్రాథమిక హక్కులను నీరుగార్చడం భారతీయ కంపెనీల కార్పొరేట్ పాలనకు ప్రమాదకరమన్నది అడ్వకేట్ సింఘ్వీ మాట.