Cibil Score Wedding Cancel | ఆడ పిల్లలకు వివాహం చేసే ముందు, వరుడి కుటుంబ పరిస్థితి, ఆస్తిపాస్తులు, వ్యక్తిత్వం మొదలైన విషయాలను తనిఖీ చేస్తుంటారు. ఒకవేళ వరుడు మంచి వ్యక్తి కాదని లేదా అతనికి చెడు అలవాట్లు ఉన్నాయని తేలితే, వధువు కుటుంబం ఆ వివాహాన్ని రద్దు చేసుకునే ఘటనలు మనం తరచుగా చూస్తుంటాం. అయితే ఇటీవల మహారాష్ట్రలో ఒక ఘటన వైరల్ అయింది. ఇందులో వరుడి సిబిల్ స్కోర్ (CIBIL Score) తక్కువగా ఉన్నందున వివాహాన్ని రద్దు చేసుకున్నారు.
మహారాష్ట్రలోని ముర్తిజాపూర్ ప్రాంతానికి చెందిన ఒక యువతికి, అదే ప్రాంతానికి చెందిన ఒక యువకుడితో పెళ్లి సంబంధం కుదిరింది. వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని, తేదీ కూడా నిర్ణయించారు. అయితే వివాహానికి కొన్ని రోజుల ముందు, వధువు మేనమామ వరుడి సిబిల్ స్కోర్ తనిఖీ చేయగా, అతను అనేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు తేలింది. అంతేకాకుండా, అతని సిబిల్ స్కోర్ కూడా చాలా తక్కువగా ఉంది. ఈ విషయం తెలిసిన వధువు కుటుంబం, ఈ వివాహాన్ని రద్దు చేసుకున్నారు.
వరుడు ఇప్పటికే అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాడని, అతను తమ అమ్మాయికి ఆర్థిక భద్రతను ఎలా కల్పించగలడని వధువు కుటుంబం ప్రశ్నించారు. ఈ కారణంగా వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు వారు తెలిపారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు వధువు కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. అమ్మాయిలకు వివాహం చేయాలంటే, వరుడి ఆర్థిక స్థితి, సిబిల్ స్కోర్ వంటి అంశాలను తప్పకుండా తనిఖీ చేయాలని అభిప్రాయపడుతున్నారు.
సిబిల్ స్కోర్ అంటే ఏమిటి?
సిబిల్ స్కోర్ అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (లిమిటెడ్) (CIBIL) అందించే క్రెడిట్ స్కోర్. ఇది ఒక వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితి, రుణాలను ఎలా నిర్వహిస్తున్నాడు అనే దానిని బట్టి నిర్ణయించబడుతుంది. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు వంటి వాటిని ఎలా నిర్వహిస్తున్నారో ఈ స్కోర్ ద్వారా తెలుసుకోవచ్చు. బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందు ఈ స్కోరును పరిశీలిస్తాయి. మంచి స్కోరు ఉన్న వ్యక్తులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేస్తాయి.
Also Read: కొడుకు పెళ్లి సందర్భంగా రూ.10 వేలు కోట్లు దానం.. గౌతం అదానీ దాతృత్వం
క్రెడిట్ స్కోర్ తో జాగ్రత్త
ప్రస్తుతం వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వ్యక్తులకు బ్యాంకులు వడ్డీ రేట్లలో రాయితీలు అందిస్తున్నాయి. తాజాగా రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించింది. రానున్న రోజుల్లో వడ్డీ రేట్లు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, మన క్రెడిట్ స్కోరును జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కొత్తగా రుణం తీసుకోవాలనుకునే వ్యక్తులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
ఉదాహరణకు రాజు ఒక ఐటీ ఉద్యోగి. అతని నెలవేతనం రూ.1,50,000. ఆర్థికంగా ఎలాంటి లోట్లు లేవు. ఒక సంవత్సరం క్రితం సొంత ఇల్లు కొన్నాడు. అతని సిబిల్ స్కోరు 780 ఉండడంతో, బ్యాంకులు సులభంగా రుణం మంజూరు చేశాయి. అంతేకాకుండా వడ్డీ రేట్లో కూడా రాయితీలు అందించాయి. అయితే ఇల్లు కొన్న తర్వాత, ఫర్నిచర్, ఇతర అవసరాల కోసం వ్యక్తిగత రుణాలు తీసుకోవడం ప్రారంభించాడు. క్రెడిట్ కార్డు పరిమితిని పూర్తిగా ఉపయోగించడం మొదలు పెట్టాడు. తర్వాత కొత్త కారు కొనడానికి కూడా రుణం తీసుకున్నాడు. ఇవన్నీ కలిసి అతని నెలవేతనంలో ఎక్కువ భాగం రుణ వాయిదాలకు వెళ్లడం ప్రారంభమైంది. క్రెడిట్ కార్డు బిల్లులు కూడా సరిగ్గా చెల్లించకపోవడంతో, అతని క్రెడిట్ స్కోరు కూడా తగ్గింది. ఫలితంగా, అతను గృహ రుణం తీసుకున్న బ్యాంకు నుంచి వడ్డీ రేటును సవరిస్తున్నట్లు ఉత్తర్వులు వచ్చాయి.
క్రెడిట్ స్కోరు: మంచి క్రెడిట్ స్కోరు ఉండటం వల్ల రుణాలు సులభంగా లభిస్తాయి. అందువల్ల, మన క్రెడిట్ స్కోరును ఎల్లప్పుడూ అధికంగా ఉంచడానికి ప్రయత్నించాలి.
రుణ వాయిదాలు: మన నెలవేతనంలో 50% కంటే ఎక్కువ భాగం రుణ వాయిదాలకు వెళ్లకుండా చూసుకోవాలి. ఇది మన ఆర్థిక స్థిరత్వానికి ముఖ్యం.
రుణాలకు దరఖాస్తు: రుణం అవసరమైనప్పుడు, ఒకేసారి అనేక బ్యాంకులకు దరఖాస్తు చేయకూడదు. ఇది క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
క్రెడిట్ నివేదిక: తరచుగా మన క్రెడిట్ నివేదికను తనిఖీ చేసుకోవడం మంచిది. ఇప్పుడు అనేక సంస్థలు ఉచితంగా క్రెడిట్ నివేదికలను అందిస్తున్నాయి. ఇవి మన ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి.
ఆర్థిక స్థిరత్వం, భవిష్యత్తు భద్రత కోసం క్రెడిట్ స్కోరును జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ముఖ్యం. వివాహం వంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు, వరుడి ఆర్థిక స్థితిని తనిఖీ చేయడం అవసరం. ఇది భవిష్యత్తులో ఎదుర్కొనే సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.