Clubbing Rules Income Tax | మీరు మీ భార్యకు వ్యక్తిగత ఖర్చులు లేదా ఇంటి అవసరాల కోసం ప్రతి నెల డబ్బు పంపుతున్నారా? ఆమె ఆ డబ్బును ఎలా వినియోగిస్తుందో గమనిస్తున్నారా? మీరు అలా డబ్బును పంపితే, మీకు పన్ను సమస్యలు వచ్చే అవకాశముంటుంది. ముఖ్యంగా, ఆ డబ్బును పెట్టుబడిగా ఉపయోగిస్తే.. క్లబ్బింగ్ రూల్స్ ప్రకారం మీరు పన్ను చెల్లించవలసి ఉంటుంది. అందుకే క్లబ్బింగ్ రూల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
క్లబ్బింగ్ రూల్స్ అంటే ఏమిటి?
ఆదాయపు పన్ను చట్టంలోని క్లబ్బింగ్ నిబంధనల ప్రకారం.. మీరు మీ భార్యకు లేదా ఇతర కుటుంబ సభ్యులకు డబ్బు బదిలీ చేసి, ఆ డబ్బుతో వారు పెట్టుబడులు చేస్తే.. ఆ పెట్టుబడుల నుంచి వచ్చే లాభాలను మీ ఆదాయంగా పరిగణిస్తారు. దీన్నే క్లబ్బింగ్ అంటారు.
ఎప్పుడు పన్ను బాధ్యత వస్తుంది?
మీరు మీ భార్యకు డబ్బు పంపి, ఆమె ఆ డబ్బును SIPలు, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు లేదా ఇతర పెట్టుబడుల్లో వేస్తే, ఆ పెట్టుబడుల ద్వారా వచ్చే డివిడెండ్లు, వడ్డీ, లాభాలు మీ ఆదాయంగా పరిగణించి పన్ను వేస్తారు.
అయితే, ఒకసారి ఆ పెట్టుబడి నుండి వచ్చిన లాభాలను మీ భార్య మళ్లీ పెట్టుబడి చేస్తే, ఆ రెండవ దశ ఆదాయం ఆమె పేరుతో పరిగణించబడుతుంది. దాంతో, ఆ రెండవ దశలో ఆమె పన్ను చెల్లించవలసి ఉంటుంది.
Also Read: బడ్జెట్ 2025-26.. ప్రజల వినియోగశక్తి పెంచడమే కీలకం
ఉదాహరణకు మీరు మీ భార్యకు నెలకు ₹50,000 పంపుతున్నారని అనుకుందాం. ఆమె ఆ డబ్బుతో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి చేస్తుంది. ఒక సంవత్సరం తర్వాత ఆ పెట్టుబడిపై ₹10,000 లాభం వస్తే, ఆ లాభం మీ ఆదాయంగా పరిగణించి మీరు పన్ను చెల్లించవలసి ఉంటుంది. కానీ, ఆ లాభాన్ని మీ భార్య మళ్లీ పెట్టుబడిగా వేస్తే, తదుపరి దశ ఆదాయం ఆమె పేరుతో పరిగణించబడుతుంది, అప్పటికి ఆమెపై పన్ను బాధ్యత ఉంటుంది.
పెట్టుబడులపై అవగాహన: మీ భార్య ఆ డబ్బును ఎలా వినియోగిస్తుందో గమనించడం ముఖ్యం.
సలహా కోసం నిపుణులను సంప్రదించండి: పన్ను సమస్యల నుంచి బయటపడేందుకు నిపుణుల సహాయం తీసుకోండి.
ITR దాఖలు చేయడం: మీ భార్య ఆదాయం పన్ను పరిధిలోకి రాకపోయినా, ITR ఫైల్ చేయడం మంచి చర్య.
నియమాలు తెలుసుకోండి: పన్ను చట్టాలు తరచూ మారుతుంటాయి. కాబట్టి, తాజా సమాచారం తెలుసుకోవడానికి నిపుణులను సంప్రదించండి.
మీ భార్యకు డబ్బు పంపేటప్పుడు, ఆ డబ్బు వినియోగం, పెట్టుబడులు, పన్ను చట్టాలపై అవగాహన ఉండటం చాలా ముఖ్యం. ఇవన్నీ గమనించి చర్యలు తీసుకుంటే పన్ను సమస్యల నుంచి బయటపడవచ్చు.