Middle Class Budget Relief | సగటు మనిషి నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకూ అందరికీ కేంద్ర బడ్జెట్ ఒక ‘ఆశల పల్లకి’ లాంటిదని చెప్పవచ్చు. ప్రతి వర్గం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ బడ్జెట్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వృద్ధిని పురొగతి దిశగా నడిపించే ప్రతిపాదనలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పాలి.
ప్రస్తుతం వృద్ధిరేటు అంచనాలకు అందకుండా రోజురోజుకూ క్షీణిస్తున్న పరిస్థితి. అధికధరలతో దేశంలో ద్రవ్యోల్బణం పైపైకే సాగుతోంది. రూపాయి పతనం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వంటి ప్రతికూల పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.4 శాతానికే పరిమితమవుతుందన్న అంచనాలు ఆర్థిక మందగమనాన్ని సూచిస్తున్నాయి. ప్రభుత్వ అంచనాలు ఆర్‌బీఐ అంచనాలకంటే తక్కువగా ఉండటం, అంతర్జాతీయ సంస్థలు కూడా జీడీపీ వృద్ధిరేటును 6 శాతానికే పరిమితం చేయడం ఆందోళన కలిగిస్తున్నాయి.
జీడీపీ వృద్ధి సాధించాలంటే మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం పెద్దఎత్తున ఖర్చు చేయడంతోపాటు దేశీయ వినియోగాన్ని పెంచే చర్యలు చేపట్టాలి. బడ్జెట్ రూపకల్పనలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడమే కాకుండా రైతుల ఆదాయాన్ని పెంచే విధంగా కేటాయింపులు జరగాలి. మధ్యతరగతి ప్రజల భారం తగ్గించేందుకు పన్ను మినహాయింపులు, ఇతర ఆర్థిక ఉపశమనం కల్పించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజల చేతుల్లో డబ్బు ఉంటుంది. దీంతో వినియోగం కూడా పెరుగుతుంది.
వినియోగాన్ని పెంచడం కీలకం
జీడీపీ వృద్ధికి వినియోగం పెరగాలి. వినియోగం పెరగాలంటే ప్రజల చేతుల్లో డబ్బు ఉండాలి. గత ఏడాది పట్టణ వినియోగం తగ్గడం వల్ల జీడీపీలో ప్రభావం కనిపించింది. పట్టణ వినియోగాన్ని మెరుగుపరచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి.
మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే చర్యలు కీలకం. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడం, పాత పన్ను విధానం నుంచి కొత్త విధానానికి మారేందుకు ప్రోత్సాహకాలు కల్పించడం, స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.75వేల నుంచి రూ.1 లక్షకు పెంపు వంటి చర్యలు అవసరం.
Also Read: అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్న భారతీయులు.. జెరోదా సిఈఓ హెచ్చరిక
గ్రామీణ అభివృద్ధి
గ్రామీణ ఉపాధి కల్పన పథకాలకు కేటాయింపులు పెంచాలి. ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో వేతనాలను పెంచి పల్లెల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అందిస్తున్న రూ.6 వేల ఆర్థిక సాయాన్ని రూ.10 వేలకు పెంచాలని సూచించాలి. వ్యవసాయ రంగానికి మరింత రుణ సాయం అవసరం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు పంటలకు గిట్టుబాటు ధరలు, రుణాలపై వడ్డీ తగ్గింపు వంటి చర్యలు అవసరం.
మౌలిక సదుపాయాలపై వ్యయం
దేశ జీడీపీ స్థిరంగా వృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి. బడ్జెట్‌లో మూలధన వ్యయాన్ని రూ.12 లక్షల కోట్లకు పెంచి, వివిధ ప్రాజెక్టులను వేగవంతంగా అమలు చేయాలి.
ఎంఎస్‌ఎంఈల అభివృద్ధి
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు పీఎల్‌ఐ పథకం ద్వారా ప్రోత్సాహకాలు అందించాలి. వీటికి ఆర్థిక సాయం అందించి, ఎగుమతులను ప్రోత్సహించాలి.
సమగ్రంగా, ఈ బడ్జెట్ వృద్ధికి ఊతమిచ్చేలా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా రూపొందించడం ఆర్థిక మంత్రికి క్లిషమైన కార్యమనే చెప్పాలి.