Karnataka CM War: అప్పుడే ఆ ఇద్దరు కలిసి ఉన్నట్లు కనిపిస్తారు. లోలోపల మాత్రం నివురుగప్పిన నిప్పు అలాగే ఉన్నట్లు అనిపిస్తుంది. కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య జరుగుతున్న ఆధిపత్యం మరోసారి హైలెట్ అయింది. రెండు పవర్ సెంటర్లు.. ఎమ్మెల్యేలు కూడా రెండు వర్గాలుగా చీలిపోయి ఉన్నాయి. కర్ణాటక కాంగ్రెస్ లో ఎందుకిలా జరుగుతోంది? సీఎం పీఠం చుట్టూ గొడవెందుకు?
రెండుగా చీలిన సిద్ధ, డీకే వర్గాలు
కర్ణాటక కాంగ్రెస్‌లో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంటుంది. పార్టీపై ఆధిపత్యం కోసం రెండు శక్తి కేంద్రాలు పనిచేస్తున్నట్లుగా అందరికీ అర్థమయ్యేలా రాజకీయం తిరుగుతుంటుంది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరాటం అంతర్గతంగా నడుస్తుంది. ఎమ్మెల్యేలు కూడా రెండు వర్గాలుగా చీలిపోయినట్లు కనిపిస్తారు. అప్పుడే చేతులు కలుపుతారు.. అప్పుడే కత్తులు దూసుకునేలా మ్యాటర్ కనిపిస్తుంది. ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడే టీకప్పులో తుఫాన్ మాదిరి ముగిసిపోతుంది. ఇదే కర్ణాటక కాంగ్రెస్ కథ.
100మంది ఎమ్మెల్యేల సపోర్ట్ డీకేకు ఉందన్న MLA ఇక్బాల్
ఇప్పుడు కూడా సైలెంట్‌గా ఒక కోరస్ మొదలైంది. దాని సారాంశం రాష్ట్రంలో సీఎంను మార్చాలి. డీకేను కుర్చీలో కూర్చోబెట్టాలి. ఈ డిమాండ్ మెల్లగా మొదలై.. ప్రకంపనలు సృష్టించే దాకా వెళ్లింది. కాంగ్రెస్ హైకమాండ్ ఏకంగా రణ్ దీప్ సూర్జేవాలాను రంగంలోకి దింపి పరిస్థితిని శాంతింపచేయాల్సిన సిచ్యువేషన్ తీసుకొచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడిన మాటలతో మ్యాటర్ ఓ రేంజ్ కు వెళ్లింది. 100 మంది ఎమ్మెల్యేలు డీకేఎస్ కు సపోర్ట్ ఇస్తున్నారని, 100 మందికి పైగా ఎమ్మెల్యేలు మార్పును కోరుకుంటున్నారన్నారు. మంచి పాలన కోరుకుంటున్నారని, డికె శివకుమార్ సీఎం అవకాశం పొందేందుకు అర్హుడన్నారు.
కేపీసీసీ అధ్యక్షుడయ్యాకే జోష్ పెరిగిందన్న వ్యాఖ్యలు
అక్కడితో మ్యాటర్ ఆగి ఉంటే బాగుండేది. కానీ డీకే శివకుమార్ పార్టీ కోసం బాగా కష్టపడ్డారని, కాంగ్రెస్ ను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని, కెపిసిసి అధ్యక్షుడైనప్పటి నుండి పార్టీలో కొత్త జోష్ వచ్చిందని ఇలా చాలా మాటలు చెప్పుకొచ్చారు. అందుకే ఎక్కువ మంది ప్రజలు డీకేఎస్ కు సపోర్ట్ గా ఉన్నారన్నారు.ఇప్పుడు సీఎం మార్పు జరగకపోతే 2028లో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారాన్ని నిలుపుకోవడం కష్టమే అని అనడంతో ఏదో జరుగుతోందన్న చర్చ మొదలైంది. ఈ చర్చ హైవోల్టేజ్ గా మారడంతో ఖర్గే కూడా రియాక్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి పదవిపై పార్టీ హైకమాండ్ మాత్రమే నిర్ణయం తీసుకుంటుందన్నారు ఖర్గే. అయితే అయితే కాంగ్రెస్‌లో క్రమశిక్షణ ఉంటుందని, తాము ఎల్లప్పుడూ హైకమాండ్‌ను గౌరవిస్తామమని, అయితే వాస్తవాలు చెప్పాలన్నారు హుస్సేన్.
సీఎం మార్పుపై రిస్క్ తీసుకోవద్దనుకున్న హైకమాండ్
కొంతకాలంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాల మధ్య పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇద్దరి మధ్య రెండున్నర సంవత్సరాల పదవి షేరింగ్ ఉందన్న చర్చ తెరపైకి తెచ్చారు. సిద్ధరామయ్య మే 2023లో సీఎం బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రెండున్నరేళ్లు పూర్తవుతుందని గుర్తు చేస్తున్నారు. అందుకే సీఎం మార్పు వ్యవహారం ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. అయితే కర్ణాటకలో సీఎంను మార్చి హైకమాండ్ రిస్క్ తీసుకోదన్న విషయాన్ని క్లారిఫై చేసింది. కాంగ్రెస్‌లో ఉన్న ఏకైక వెనుకబడిన తరగతుల ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే అని, అలాంటి నాయకున్ని ఎలా తొలగిస్తుందన్న వాదనను సిద్ధరామయ్య సన్నిహితులు వినిపిస్తున్నారు.
2023లో గెలిచాక సీఎం పదవికి గట్టి పోటీ
2023 ఎన్నికల తర్వాత సిద్ధరామయ్య, డీకేఎస్ మధ్య సీఎం పదవి విషయంలో వార్ నడిచింది. పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత అసంతృప్తి చెందిన డీకేఎస్ డిప్యూటీ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఆయన కేపీసీసీ చీఫ్ గానూ కొనసాగారు. పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న రూల్ ఉంది. అయితే డీకే విషయంలో హైకమాండ్ ఆ రూల్ ను పక్కన పెట్టింది. సో నాయకత్వ మార్పులపై సిద్ధరామయ్య, డీకే ఇద్దరూ రియాక్ట్ అయ్యారు. తాము ఒక్కటే అని చేతిలో చెయ్యి వేసి మీడియాకు కనిపించారు. ఈ ప్రభుత్వం ఐదేళ్లపాటు రాయిలా దృఢంగా ఉంటుందన్నారు సిద్ధరామయ్య. తమ మధ్య సత్సంబంధాలున్నాయన్నారు. అటు డీకే కూడా తనకు సీఎం పదవి అంటూ ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడొద్దని అన్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని నిలుపుకునేలా పని చేయాలని పిలుపునిచ్చారు. ఎవరైనా సీఎం పదవి అంటూ మాట్లాడితే హైకమాండ్ వారిపై చర్యలు తీసుకుంటుందని ఘాటుగా వార్నింగ్ ఇవ్వడం ద్వారా ఒక పుల్ స్టాప్ అయితే పెట్టగలిగారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.
కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇద్దరూ ఇద్దరే.. పార్టీలో ఆధిపత్యం, జనంలో పట్టు ఇద్దరికీ ఉంది. ఈ ఇద్దరి మధ్య అప్పుడప్పుడు కోల్డ్ వార్ కూడా జరుగుతుంటుంది. అంతలోనే సర్దుకుంటుంది. ఈసారి కూడా అలాంటి కథే నడిచింది. తాత్కాలికంగా ముగిసింది. ఎందుకిలా జరుగుతోంది?
కొన్నిసార్లు బహిర్గతమైన విబేధాలు
కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ముఖ్యమంత్రి పదవి, శాఖల నియంత్రణ, రాజకీయ ప్రాబల్యం చుట్టూ ఆధిపత్య వ్యవహారాలు తిరిగాయి. ఈ డిఫరెన్సెస్ కొన్నిసార్లు పబ్లిక్ గానే బహిర్గతం అయ్యాయి. ఇంకొన్ని సార్లు ఊహాగానాలు లేదంటే మద్దతుదారుల చర్యల ద్వారా బయటపడ్డాయి. అయితే ఇద్దరూ ప్రతి సందర్భంలో తమ మధ్య విభేదాలు లేవని పదేపదే ప్రకటించుకున్నారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్ధరామయ్యకు మైనారిటీలు, అణగారిన వర్గాలు, ముఖ్యంగా ఓబీసీల సపోర్ట్ ఉందని, కాంగ్రెస్ పార్టీకి చెందిన 135 మంది ఎమ్మెల్యేలలో మెజారిటీ సంఖ్య ఆయన వెనకే ఉందన్న చర్చ ఉంది. 2013 ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ విజయాన్ని సాధించడంలో సిద్ధరామయ్యకు క్రెడిట్ ఉంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 122 సీట్లు గెలుచుకుని బిజెపిని ఓడించింది. ఐదేళ్లు సాఫీగా ప్రభుత్వం నడిపిన చరిత్ర ఉంది. వీటితో పాటే వెనుకబడిన కురుబ వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఆయనను తొలగించడం అసాధ్యం అన్న చర్చ తెరపైకి వచ్చింది.
2023 ఎన్నికల్లో విజయంలో కీ రోల్
ఇక డికెఎస్ విషయానికొస్తే.. ఆర్థికంగా బలమైన లీడర్. ప్రభావవంతమైన వొక్కలిగ సామాజిక వర్గం మద్దతు ఉంది. ఈ వర్గం కర్ణాటకలో దక్షిణ ప్రాంతంలో ఆధిపత్యంగా ఉంది. వారి ఓట్లు 2023లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి సహాయపడ్డాయి. నిజానికి ఈ సామాజికవర్గం సాంప్రదాయకంగా జేడీఎస్ కు ఓటు వేస్తుంది. ఓల్డ్ మైసూరు ఏరియాలో జేడీఎస్ ప్రాబల్యాన్ని తగ్గించడంలో డీకే శివకుమార్ చాలా కీరోల్ పోషించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ వొక్కలిగ సామాజికవర్గం ఆధిపత్యంగా ఉన్న 46 స్థానాల్లో 29 స్థానాలను గెలుచుకుంది. అదే 2018 ఎన్నికల్లో కేవలం 9 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
సోనియాగాంధీ ఒప్పించడంతో డిప్యూటీగా బాధ్యత
2023 మేలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలవగానే.. సీఎం పదవి తనకే వస్తుందని డీకే శివకుమార్ ఊహించారు. కానీ సీనియర్ గా సిద్ధరామయ్యను ఎంపిక చేశారు. అప్పుడు అసంతృప్తితో ఉన్నట్లు కనిపించారు. అయితే సోనియాగాంధీ స్వయంగా డీకేతో మాట్లాడి ఒప్పించారంటారు. సో అలా సర్దుకుపోయినా అప్పుడప్పుడూ కర్ణాటక కాంగ్రెస్ లో రెండు పవర్ సెంటర్ల మధ్య ఏదో అలజడి కనిపిస్తూనే ఉంటుంది. కాంగ్రెస్ లో పాత కొత్త నాయకుల మధ్య ఎప్పుడూ ఏదో ఒక సంఘర్షణ ఉంటుంది. రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య కూడా ఇలాంటి గ్యాప్ అప్పట్లో కనిపించింది.
సీఎం నేతృత్వంలో జరిగిన ట్రాన్స్ ఫర్లు..
నిజానికి సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఏదో జరుగుతోందనడానికి కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నాయి. మే నెలలో ఇరిగేషన్ శాఖకు చెందిన ఐదుగురు చీఫ్ ఇంజనీర్లు బదిలీ అయ్యారు. ఈ ట్రాన్స్ ఫర్లపై డీకే శివకుమార్ మండిపడ్డారు. అయితే ఈ ట్రాన్స్ ఫర్లు ముఖ్యమంత్రి సిద్దరామయ్య సిఫారసు మేరకే జరిగాయి. విషయం తెలిసిన తర్వాత డీకే తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. తన శాఖలో తన ప్రమేయం లేకుండానే చీఫ్ ఇంజనీర్లను ఎలా బదిలీ చేస్తారన్న ప్రశ్నల్ని నాడు సంధించారు. అంతే కాదు.. మే 13న సీఎస్ కు లెటర్ కూడా రాశారు. బదిలీని రద్దు చేసి ఇంజనీర్లను పూర్వపు స్థానాలకు పంపాలన్నారు.
Also Read: ప్రియురాలి కోసం భార్యని ఎలా ప్లాన్ చేసి చంపాడంటే..
ఇదే విషయంపై చీఫ్ సెక్రటరీకి నేరుగానే చెప్పేశారు. సీఎం పర్యవేక్షణలోనే ఈ ట్రాన్స్ ఫర్లు జరిగాయన్న విషయాన్ని డీకే దృష్టికి సీఎస్ తీసుకొచ్చారు. అయితే తన శాఖకు సంబంధించిన ఉద్యోగుల బదిలీలు, నియామకాల విషయంలో తన ప్రమేయంలేకుండా చేయొద్దని రెండేళ్ల క్రితం మంత్రిగా బాధ్యతలు స్వీకరించినపుడే సర్కులర్ జారీ చేసిన విషయాన్ని శివకుమార్ సీఎస్ దగ్గర ప్రస్తావించారు. ఇంజినీర్లకు కీలక పనులు అప్పగించిన టైంలో ట్రాన్స్ ఫర్ చేస్తే ఆ పనుల సంగతేంటని క్వశ్చన్ చేశారు. సో అది మొదలు.. ఇప్పుడు మరోసారి సీఎం పీఠంపై చర్చ దాకా కథ వాడివేడిగా నడుస్తోంది. ఇది ఇక్కడితో ముగుస్తుందా.. లేదంటే నివురుగప్పిన నిప్పులా మరోసారి రాజుకుంటుందా అన్నది కీలకంగా మారింది.