Diwali Gold Investment: ధన త్రయోదశి, దీపావళి పండుగల సమయంలో బంగారం కొనుగోలు చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. అయితే చాలామంది కేవలం ఆభరణాల కొనుగోలుకే ఈ సమయంలో ప్రాధాన్యం ఇస్తుంటారు. అలా కాకుండా బంగారాన్ని ఒక మంచి పెట్టుబడి సాధనంగా మార్చుకోవాలనుకునే వారికి అనేక ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పండుగ సీజన్‌లో పసిడిపై పెట్టుబడి పెట్టడానికి ఉన్న 5 ఉత్తమ మార్గాలేంటో ఈ కథనంలో చూద్దాం.
మన దేశంలో పండుగల వేళ ఆభరణాలు కొనడం సర్వసాధారణం. అయితే పెట్టుబడి కోణంలో ఆలోచించేవారు ఆభరణాల కంటే బంగారం నాణేలు (Coins) లేదా బిస్కెట్లను (Bars) ఎంచుకోవడం బెటర్. ఎందుకంటే ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు మేకింగ్ ఛార్జీలు, వాటిపై పడే జీఎస్‌టి (GST) వంటి అదనపు భారం పడుతుంది. భవిష్యత్తులో ఆ నగలను విక్రయించేటప్పుడు ఈ తయారీ ఖర్చుల మొత్తాన్ని తిరిగి పొందలేరు. కాబట్టి మేకింగ్ ఛార్జీల భారం లేకుండా కేవలం బంగారం విలువపైనే పెట్టుబడి పెట్టాలనుకుంటే గోల్డ్ కాయిన్స్, బిస్కెట్లు బెస్ట్ ఛాయిస్.
బంగారాన్ని భౌతికంగా దాచుకునే ఇబ్బంది లేకుండా డిజిటల్ రూపంలో పెట్టుబడి పెట్టడానికి గోల్డ్ ఈటీఎఫ్‌లు చాలా ఉపయోగపడతాయి. డీమ్యాట్ (Demat) ఖాతా ఉంటే స్టాక్ ఎక్స్ఛేంజ్ ద్వారా నేరుగా షేర్ల లాగానే వీటిని కొనుగోలు చేయవచ్చు, విక్రయించవచ్చు. బంగారం మార్కెట్ ధర ఆధారంగా వీటి విలువ ఉంటుంది. ఇక డీమ్యాట్ ఖాతా లేనివారు ‘గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్’ ద్వారా కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఇవి ప్రధానంగా గోల్డ్ ఈటీఎఫ్‌లలోనే పెట్టుబడి పెడతాయి.
తక్కువ మొత్తంతో బంగారంపై పెట్టుబడి ప్రారంభించాలనుకునే వారికి ‘డిజిటల్ గోల్డ్’ ఒక అద్భుతమైన ఛాన్స్. పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్‌ల ద్వారా కేవలం రూ. 1 నుండి కూడా డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఇందులో మీరు పెట్టిన పెట్టుబడికి సమానమైన బంగారం మీ పేరిట లాకర్లలో భద్రపరుస్తారు. అయితే ఈ డిజిటల్ గోల్డ్ ఆర్‌బీఐ (RBI), సెబీ (SEBI) నిబంధనల పరిధిలోకి రాదు. కాబట్టి ఇందులో పెట్టుబడి పెట్టే ముందు నియమాలు, రిస్క్‌లను అర్థం చేసుకుంటే బెటర్.
కేంద్రం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ ‘సోవరిన్ గోల్డ్ బాండ్ల’ను జారీ చేస్తుంది. ఈ బాండ్ల విలువను గ్రాముల బంగారంలో నిర్ణయిస్తారు. పెట్టుబడిదారులు వీటిని కొనుగోలు చేసేటప్పుడు ప్రస్తుత ధర చెల్లించాల్సి ఉంటుంది. బాండ్ గడువు ముగిసిన (Maturity) తర్వాత బంగారం మార్కెట్ ధర ఆధారంగా రాబడి లభిస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వం వీటిపై నిలకడైన వడ్డీని కూడా అందిస్తుంది. దొంగల భయం లేకుండా పూర్తి ప్రభుత్వ భద్రతతో బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి ఆప్షన్.
Also Read: జంతువుల కోసం ఫ్లైఓవరా? కెనడా చేసిన ఈ పనికి.. యావత్ ప్రపంచమే ఫిదా!
డిజిటల్ గా బంగారాన్ని కొనుగోలు చేసే మరో మార్గం ‘ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్’ (EGRs). ఇవి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో విక్రయించబడే డిజిటల్ సెక్యూరిటీలు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా గోల్డ్ ఈజీఆర్‌ల ధరలు నిర్ణయిస్తారు. వీటిని డీమ్యాట్ రూపంలో ఎప్పుడైనా కొనుగోలు చేయవచ్చు, విక్రయించవచ్చు. అంతేకాకుండా మీ వద్ద ఉన్న ఈజీఆర్‌లను నిర్దిష్ట పరిమితి దాటిన తర్వాత భౌతిక బంగారంగా మార్చుకునే సదుపాయం కూడా ఇందులో ఉంటుంది.
Also Read: ఆ ఆస్తులతో నీకు సంబంధం లేదు.. వైఎస్ షర్మిలకు భారతి లేఖ.. సోషల్ మీడియాలో వైరల్!