DMart: హైదరాబాద్ లోని డిమార్ట్ లో తాజాగా షాకింగ్ దొంగతనం జరిగింది. ఓ యువకుడు వింత దొంగతనం చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. ఈ దొంగతనానికి సంబంధించిన వ్యవహారం అంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఒక యువకుడు తన లోదుస్తులలో ఏలకులను పెట్టుకుని దొంగిలించడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
ఇంతకీ అసలు ఏం జరిగిదంటే?
ఈ ఘటన సనత్ నగర్ డిమార్ట్ లో జరిగింది. సిబ్బంది చెప్పిన వివరాల ప్రకారం.. ఓ యువకుడు సాధారణ కస్టమర్ లా స్టోర్ లోకి అడుగు పెట్టాడు. కొన్ని కిరాణా వస్తువులను బుట్టలో వేసుకున్నాడు. వాటిలో ఓ యాలకుల ప్యాకెట్ కూడా ఉంది. వాటిని తీసుకుని బిల్లింగ్ కౌంటర్ కు కాకుండా లిఫ్ట్ లో పై అంతస్తుకు వెళ్లాడు. ఎవరూ చూడడం లేదని భావించి, యాలకుల పాడ్ ను తన లోదుస్తులలో పెట్టుకున్నాడు. లిఫ్ట్ లో ఉన్న సీసీ కెమెరాలో ఈ తతంగం అంతా రికార్డు అయ్యింది. ఆ తర్వాత అతడు కింది ఫ్లోర్ కు చేరుకుని మిగతా వస్తువులు అన్నింటినీ అక్కడే వదిలేసి బయటకు వెళ్లాడు. తొలిరోజు అతడిని సిబ్బంది అంతగా పట్టించుకోలేదు.
రెండో రోజు మళ్లీ దొంగతనం
తొలి రోజు సక్సెస్ కావడంతో రెండో రోజు మళ్లీ డిమార్ట్ కు వచ్చాడు సదరు యువకుడు. ఫస్ట్ డే ఒక యాలకుల ప్యాకెట్ తీసుకెళ్లగా, రెండో రోజు ఏకంగా రెండు ప్యాకెట్లను తీసుకున్నాడు. వాటిని తీసుకుని నేరుగా వాష్ రూమ్ కు వెళ్లాడు. ఫస్ట్ రోజు మాదిరిగానే మళ్లీ వాటిని లోదుస్తుల్లో దాచుకున్నాడు. తొలి రోజు దొంగతనం జరిగినట్లుగా గుర్తించిన సిబ్బంది రెండో రోజు అలర్ట్ అయ్యారు. యాలకుల ప్యాకెట్లు కనిపించకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది సీసీ కెమెరాలను పరిశీలించారు. అదే వ్యక్తి మళ్లీ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. ఎప్పటిలాగానే బిల్లింగ్ కు వెళ్లకుండా బయటకు వెళ్లడంతో డి-మార్ట్ ఉద్యోగులు అతడిని ఆపి చెక్ చేశారు. యాలకుల ప్యాకెట్లు బయటపడ్డాయి. వెంటనే స్టోర్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పాట్ కు చేరుకున్న పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
సోషల్ మీడియాలో విస్తృత చర్చ
ఇక ఈ యాలకుల దొంగతనానికి సంబంధించిన సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. దొంగిలించబడింది చిన్న వస్తువే అయినా, స్టోర్లలో దొంగతనాలు చేయాలని చూస్తే, ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని ఈఘటన నిరూపిస్తుందన్నంటున్నారు. ముఖ్యంగా డిమార్ట్ లాంటి ఎక్కువ మంది కస్టమర్లు వచ్చే స్టోర్లలో లిఫ్ట్‌లు, వాష్ రూమ్‌లు, ఎంట్రీలలో ఉంచిన సీసీటీవీ కెమెరాలు ఇలాంటి దొంగతనాలను గుర్తించడంలో సాయపడుతున్నాయి. అదే సమయంలో ఎవరూ చూడటం లేదని దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Read Also: డిమార్ట్ కు వ్యతిరేకంగా ఆందోళన, ఇదేం కొత్త పంచాయితీ సామీ!