Cheap Deals vs Small Traders: తక్కువ ధరల్లో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు క్వాలిటీ వస్తువులు, సరుకులు అందించడంలో డిమార్ట్ ముందుంటుంది. అదిరిపోయే డీల్స్ లో అన్ని రకాల వస్తువులను అందుబాటులో ఉంచుతుంది. కిరాణా సామాన్ల నుంచి గృహోపకరణాల వరకు, చెప్పుల నుంచి దుస్తుల వరకు అన్నీ తక్కువ ధరల్లోనే లభిస్తాయి. అయితే, డిమార్ట్ కారణంగా తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయంటూ తమిళనాడు ట్రేడ్ యూనియన్లు ఆందోళన బాటపట్టాయి. ఆగష్టు 30న తిరుచిరాపల్లిలోని డిమార్ట్ ముందు నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించాయి. రిటైల్ దిగ్గజ సంస్థకు వ్యతిరేకంగా చిన్న వ్యాపారాలను రక్షించడానికి వేలాది మంది వ్యాపారులు ఈ ఆందోళనలో పాల్గొననున్నారు.
సామాన్యులకు అందుబాటులో ధరలు
2002లో ప్రారంభించబడిన డి-మార్ట్ దేశంలో అత్యంత విశ్వసనీయ రిటైల్ చైన్ లలో ఒకటిగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. రోజువారీ నిత్యావసర వస్తువుల నుంచి గృహోపకరణాల వరకు ప్రతిదీ తక్కువ ధరలకు అందిస్తోంది. సామాన్యుల బడ్జెట్ లో అన్ని రకాల వస్తువులు అందిస్తోంది. డిమార్ట్ ప్రతి రోజూ వినియోగదారులకు తగ్గింపు ధరలను అందిస్తుంది. తరచుగా కొనుగోలు చేసే ముఖ్యమైన వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం, అమ్మడం వల్ల ఖర్చులు తగ్గుతాయి. డిమార్ట్ వ్యాపార విస్తరణ మరింత పెరిగింది. అయితే, ఈ పెరుగుదల చిన్న వ్యాపారుల జీవనోపాధిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది. వీధి పక్కన ఉన్న దుకాణాలు, సూపర్ మార్కెట్లు డిమార్ట్ లాంటి కంపెనీలతో పోటీ పడలేక ఇబ్బందులు పడుతున్నాయి.
ఆగష్టు 30న చిన్న వ్యాపారుల ఆందోళన
ఒకే చోట సరసమైన ఉత్పత్తులు అందుబాటులో ఉండటంతో, వినియోగదారులు చిన్న దుకాణాల దగ్గరికి వెళ్లడం లేదు. ఇది చిన్న వ్యాపారుల ఆదాయంపై ప్రభావాన్ని చూపుతుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ట్రేడ్ యూనియన్లు ఆగస్టు 30న తిరుచిరాపల్లిలోని వాయలూర్ లో డిమార్ట్ ను దిగ్బంధనం చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ నిరసనలో వేలాది మంది వ్యాపారులు పాల్గొనాలని నిర్ణయించారు. చిన్న వ్యాపారుల జీవనోపాధిని కాపాడటానికి, డిమార్ట్ లాంటి కంపెనీల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఈ ఆందోళన చేపట్టనున్నారు.
Read Also: డి-మార్ట్ లో అత్యంత చౌకగా లభించే వస్తువులేంటీ? ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తారు?
ఆందోళనలో డిమార్ట్ యాజమాన్యం
“రండి! ఐక్యంగా ఉందాం!! గెలుద్దాం!!!” అనే నినాదంతో చిన్న వ్యాపారులు ఈ నిరసనలో పాల్గొంటున్నారు. ఈ నిరసన ద్వారా చిన్న వ్యాపారులు తమ ఆందోళనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. డిమార్ట్ ద్వారా సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూర్చినప్పటికీ, వేలాది మంది చిన్న వ్యాపారుల జీవనోపాధిని నాశనం చేసిందని వ్యాపారులు వాదిస్తున్నారు. ఈ ఆందోళన ద్వారా తమ బాధను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అటు ఈ ఆందోళన తమ స్టోర్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందోనని డిమార్ట్ యాజమాన్యం ఆందోళన చెందుతోంది.
Read Also: డిమార్ట్ లో వస్తువుల ధరలు ఎందుకంత తక్కువ? ఏ రోజుల్లో మరింత చీప్ గా కొనేయొచ్చు?