India Cheaper Electronics| భారత్‌లో తగ్గిన సెల్ ఫోన్లు, ఇతర ఎలెక్ట్రానిక్స్ ధరలు.. కారణం అదే
Electronics Cheaper in India Due to China Tariffs | భారతదేవంలో స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలెక్ట్రానిక్స్ ధరలు తగ్గనున్నాయి. కారణం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనే చెప్పాలి. ఆయన చైనాపై విధించిన భారీ సుంకాల ప్రభావం కారణంగా ఎలెక్ట్రానిక్స్ ఐటెమ్స్ తగనున్నాయి. అందుకే అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం భారతదేశానికి ప్రయోజనకరంగా మారవచ్చు.
చైనా నుంచి దిగుమతి అయ్యే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అమెరికా 145 శాతం సుంకాలు విధించిన తర్వాత, అనేక చైనా ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. అందుకే ఇతర దేశాల్లో డిమాండ్ పెంచుకోవాలని చూస్తున్నాయి. చైనా ఎలెక్ట్రానిక్స్ కాంపోనెంట్ తయారీదారులు ఇప్పుడు ఇండియా కంపెనీలకు 5 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ది ఎకనామిక్ టైమ్స్ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. ఈ తగ్గింపుల వల్ల భారతీయ వినియోగదారులకు నేరుగా లాభం కలగవచ్చు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు వంటి ఎలక్ట్రానిక్ సామగ్రి ధరలు తగ్గే అవకాశం ఉంది. దీని వల్ల వినియోగదారులకు లాభం చేకూరడమే కాకుండా, దేశీయ మార్కెట్లో డిమాండ్ ని కూడా పెంచగలదు.
అనేక చైనీస్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ తయారీదారులు ఇప్పుడు భారతీయ కంపెనీలకు 5 శాతం వరకు ధరలను తగ్గించడం ద్వారా, భారతదేశంలో అనేక ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గించే అవకాశం ఉందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీదారులు మార్కెట్లో విక్రయాలను పెంచడంపై దృష్టి పెట్టారు. ఈ ప్రణాళికలో భాగంగానే ప్రజలను ఆకర్షించడానికి కొన్ని ఐటెమ్స్.. డిస్కౌంట్ ధరలకు కూడా అందించే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.
Also Read: ఈయన ముందు ట్రంప్ బచ్చా.. ఎన్ని సవాళ్లు వచ్చినా ధీటుగా నిలబడ్డ ఒకే ఒక్కడు
అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం రోజు రోజుకీ తీవ్రమవుతోంది. ఏప్రిల్ 2న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై భారీ సుంకాలు విధించారు. దీనికి ప్రతిస్పందనగా చైనా అమెరికా నుండి దిగుమతి చేసుకున్న వస్తువులపై 34% సుంకాలు విధించింది. తరువాత అమెరికా మరోసారి ప్రతిచర్య తీసుకుంది. చైనా నుండి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను 104శాతానికి పెంచింది. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలను 84 శాతానికి పెంచింది. దీంతో ఆగ్రహించిన ప్రెసిడెంట్ ట్రంప్ ఏప్రిల్ 9న చైనాపై సుంకాలను 125 శాతానికి పెంచారు. ఆ తరువాత.. మళ్లీ ఏప్రిల్ 10న చైనా ఉత్పత్తులపై సుంకాలను 145 శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇది ప్రపంచంలో ఒకే దేశంపై అమెరికా విధించిన అత్యధిక సుంకాల రికార్డుగా నమోదైంది. అదే సమయంలో, భారతదేశంతో సహా అనేక దేశాలపై విధించిన పరస్పర సుంకాలను మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.
చైనా-అమెరికా మధ్య వాణిజ్య వివాదం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తున్నప్పటికీ.. ఈ వాణిజ్య అంతరాయం వల్ల భారతీయ కంపెనీలు ప్రయోజనం పొందే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అధిక సుంకాల కారణంగా అమెరికాలో చైనా దిగుమతి ఉత్పత్తుల ధరలు తీవ్రంగా పెరిగిపోతున్నాయని సమాచారం. దాంతో అక్కడ చైనా ఐటెమ్స్ విక్రయాలు తగ్గిపోయి వాటి డిమాండ్ తగ్గిపోతోంది. ఫలితంగా చైనా కాంపోనెంట్ తయారీదారులు ఆర్థిక ఒత్తిడి కారణంగా ఆ ఉత్పత్తులను ఇతర దేశాలకు విక్రయించాలని ప్లాన్ చేస్తున్నారు.