Waren Buffett US Tariffs| ప్రపంచ వ్యాప్తంగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌ల ధాటికి స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. అంతర్జాతీయంగా ఒక విధంగా వాణిజ్య యుద్ధం జరగడమే దీనికి కారణం. లోకల్, నాన్ లోకల్ అనే తేడా లేకుండా అన్ని కంపెనీలు నష్టపోతున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లు షేర్ల ధరలు పేక మేడల్లా కుప్పకూలిపోతున్నాయి. ప్రపంచ కుబేరుల ఆస్తులు సైతం ఈ ధాటికి భారీగా కరిగిపోయాయి.
గత రెండు రోజుల్లో అమెరికా స్టాక్ మార్కెట్‌ల నుండి ట్రిలియన్ డాలర్ల విలువ చేసే సంపద ఆవిరయింది. ఈ దెబ్బకు ఎలాన్ మస్క్, మార్క్ జకర్‌బర్గ్, బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్ వంటి టాప్ ఇన్వెస్టర్లు వందల బిలియన్ డాలర్ల నష్టాలను చవిచూశారు. కానీ ఇన్‌వెస్ట్ మెంట్ గురు మాత్రం ఈ సుంకాల తుపాను ఎదరు నిలబడ్డాడు. ఆయనే ప్రపంచంలోని పెట్టుబడి దారులందరికీ ఆదర్శం.. వారెన్ బఫెట్. స్టాక్ మార్కెట్లకు ట్రంప్ షాకిచ్చినా.. దాని ప్రభావం వారెన్ బఫెట్ కంపెనీ అయిన బెర్క్‌షైర్ హాత్వేపై పడలేదు. అందరూ నష్టపోతుంటే బెర్క్‌షైర్ హాత్వే ద్వారా కంపెనీ చైర్మెన్, సిఈఓ లాభాలు పొందుతూనే ఉన్నారు. ఆయన ఇదంతా ఎలా చేయగలిగారో తెలిస్తే షాకవుతారు. దీనంతటికీ ఆయన ముందు చూపు మాత్రమే కారణం.
Also Read: మండే మార్కెట్ ఎఫెక్ట్.. సంపద కోల్పోయిన భారత కుబేరులు
ట్రంప్ రెండవ పర్యాయం అధ్యక్షుడుగా ఎన్నికైన తర్వాత ఇప్పటివరకు 184 దేశాలపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. దీని ప్రభావంగా వాల్ స్ట్రీట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 8 ట్రిలియన్ డాలర్లు క్షీణించడంతో ప్రపంచ మార్కెట్‌లు భారీగా క్షీణించాయి. అమెరికా స్టాక్ మార్కెట్‌లు రెండు రోజుల్లోనే సుమారు 5 ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని రిజిస్టర్ చేశాయి. 2020 మార్చిలో కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఇదే అత్యంత పెద్ద పతనంగా నమోదైంది. అయితే ఈ పతన ధోరణి బఫెట్‌ను ఏ విధంగానూ ప్రభావితం చేయలేదు. ఈ సంవత్సరంలో బఫెట్ తన సంపదలో 12.7 బిలియన్ డాలర్లు పెంచుకున్నారు. ప్రస్తుతం బఫెట్ నికర సంపద 155 బిలియన్ డాలర్లుగా ఉంది.
ముందుచూపులో మాస్టర్
బఫెట్ ఈ మార్కెట్ పతనాన్ని ఎదుర్కోవడానికి కొన్ని వ్యూహాత్మక చర్యలు తీసుకున్నారు. స్టాక్ మార్కెట్‌లో తిరోగమనం వచ్చే అవకాశాన్ని ముందుగానే గమనించిన ఆయన, పెద్ద ఎత్తున కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేసి నగదు నిల్వలను పెంచుకున్నారు. బడా కంపెనీల్లో ఉన్న తన వాటాను ఆయన ముందే విక్రయించేశారు. దీంతో సుంకాల తుపాను వచ్చినా ఆయన మాత్రం క్షేమంగా బయటపడ్డారు. 2024లో బుల్ మార్కెట్‌లు అస్థిరంగా ఉన్న సమయంలో, బఫెట్ కంపెనీ ఈక్విటీల నుండి 134 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించి, 334 బిలియన్ డాలర్ల నగదు నిల్వలతో ఆర్థిక సంవత్సరాన్ని ముగించింది.
ఇతర పెట్టుబడిదారులు ఆర్థిక ప్రతికూల పరిస్థితులతో కష్టపడుతున్న సమయంలో.. యాపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి అమెరికన్ టెక్ స్టాక్‌లలో బఫెట్ తన పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకుని వ్యూహాత్మకంగా చర్యలు తీసుకున్నారు. మరోవైపు.. జపాన్ వాణిజ్య సంస్థలపై తన పెట్టుబడులను రెట్టింపు చేశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో.. బఫెట్ జపాన్‌లోని అయిదు అతిపెద్ద వాణిజ్య సంస్థలైన మిత్సుయి, మిత్సుబిషి, సుమిటోమో, ఇటోచు మరుబేనిలలో తన హోల్డింగ్‌లను గణనీయంగా పెంచుకున్నారు.
రెగ్యులేటరీ ఫైలింగ్‌ల ప్రకారం.. బెర్క్‌షైర్ హాత్వే ప్రస్తుతం మిత్సుయి అండ్ కోలో 9.82 శాతం, మిత్సుబిషి కార్ప్‌లో 9.67 శాతం, సుమిటోమో కార్ప్‌లో 9.29 శాతం, ఇటోచు కార్ప్‌లో 8.53 శాతం, మరుబేని కార్ప్‌లో 9.30 శాతం, షేర్‌హోల్డింగ్‌లను కలిగి ఉంది. ఈ వ్యూహాత్మక పెట్టుబడులతో బెర్క్‌షైర్ హాత్వే మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను 1.14 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. పైగా టెస్లా వంటి అగ్రశ్రేణి కంపెనీలను బఫెట్ కంపెనీ అధిగమించేసింది.