Job Contract Penalty| ఉద్యోగ ఒప్పందంలో కనీస సేవా కాలం పూర్తి చేయకుండా ఉద్యోగం మానేస్తే సంస్థ లేదా యజమాని చట్టబద్ధంగా జరిమానా విధించవచ్చని సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఇంతకుముందు హై కోర్టు ఈ జరిమానాను రద్దు చేస్తూ తీర్పు చెప్పగా.. సుప్రీం కోర్టు తాజాగా ఆ తీర్పు చెల్లదని అభిప్రాయపడింది. విజయ బ్యాంక్ వర్సెస్ ప్రశాంత్ బి. నర్ణవరే కేసులో సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది.
ఉదాహరణకు మీ ఉద్యోగ ఒప్పందంలో 2 సంవత్సరాల కనీస సేవా కాలం ఉందనుకోండి. ఈ కాలం పూర్తి చేయకుండానే మీరు ఉద్యోగం మానేస్తే, మీ యజమాని మీపై జరిమానా విధించవచ్చు. సుప్రీంకోర్టు ఈ రకమైన నిబంధనలు సమర్థిస్తూ.. న్యాయమైనవిగా, పబ్లిక్ పాలసీకి వ్యతిరేకం కానివిగా పరిగణించింది. ఇవి ఉద్యోగులు త్వరగా ఉద్యోగం మానేయడాన్ని తగ్గించడానికి, సంస్థ సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడతాయని కోర్టు తెలిపింది.
ప్రశాంత్ బి. నర్ణవరే కేసు
1999లో ప్రశాంత్ బి. నర్ణవరే విజయ బ్యాంకులో ప్రొబేషనరీ అసిస్టెంట్ మేనేజర్‌గా చేరారు. 2006లో బ్యాంకు ఒక ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటనలో 3 సంవత్సరాల కనీస సేవా కాలం పూర్తి చేయాలని, లేకపోతే 2 లక్షల రూపాయల జరిమానా విధిస్తామని పేర్కొంది. నర్ణవరే ఈ ఒప్పందంపై సంతకం చేసి.. 2007 సెప్టెంబరులో సీనియర్ మేనేజర్ (కాస్ట్ అకౌంటెంట్)గా నియమితులయ్యారు. కానీ, 2009 జులైలో (అంటే మూడు సంవత్సరాలు పూర్తి చేయకుండానే) ఆయన ఐడిబిఐ (IDBI) బ్యాంకులో చేరడానికి రాజీనామా చేశారు. ఆయన 2 లక్షల రూపాయల జరిమానా చెల్లించినప్పటికీ, ఈ నిబంధనను కోర్టులో సవాలు చేశారు. 2014లో హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు చెబుతూ.. జరిమానా మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. కానీ, 2025 మే నెలలో సుప్రీంకోర్టు ఈ తీర్పును రద్దు చేసి, కనీస సేవా కాలం, జరిమానా నిబంధనలను సమర్థించింది.
ఉద్యోగ బాండ్ గరిష్ఠ కాలం ఎంత?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉద్యోగ బాండ్‌లో కనీస సేవా కాలం సమంజసంగా ఉండాలి, కానీ గరిష్ఠ కాలపరిమితిపై నిర్దిష్ట నియమం లేదు. ఈ బాండ్‌లు సంపూర్ణమైనవి కావు, కానీ వాటి చట్టబద్ధతను కొన్ని అంశాల ఆధారంగా పరిశీలిస్తారు.
నిబంధన ఉద్యోగ కాలంలో మాత్రమే వర్తించాలి, ఉద్యోగం మానేసిన తర్వాత ఉద్యోగి ఇతర అవకాశాలను అన్వేషించడాన్ని నిరోధించకూడదు.
నిబంధన సమంజసంగా, పబ్లిక్ పాలసీకి వ్యతిరేకంగా ఉండకూడదు. ప్రతి కేసును దాని వాస్తవాల ఆధారంగా నిర్ణయించాలి.
ఉద్యోగులు, యజమానులపై ప్రభావం
ఈ నిబంధనలు ఉద్యోగులు, యజమానులపై ఇరు పక్షాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కనీస సేవా కాలం నిబంధనలు ఉద్యోగులు త్వరగా ఉద్యోగం మానేయకుండా, ఇతర అవకాశాల పట్ల ఆకర్షితులు కాకుండా.. శిక్షణ, నియామక ఖర్చులను తిరిగి పొందడంలో కంపెనీలకు సహాయపడతాయి. కానీ, ఉద్యోగులకు ఈ నిబంధనలు ఉద్యోగం మార్చే సౌలభ్యాన్ని తగ్గిస్తాయి. దీర్ఘకాల సేవా నిబంధనలు ఉన్న సంస్థల్లో చేరడానికి ఉద్యోగులు ఇష్టపడకపోవచ్చు.
Also Read: అన్ని రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్.. దేశంలో పెట్టుబడులకు ఆదర్శ నగరం
ఉద్యోగం మానేసిన తర్వాత ప్రభావం
ఈ జరిమానాలు ఉద్యోగం మానేసిన తర్వాత ఉద్యోగి కెరీర్‌పై ప్రభావం చూపవు. ఈ నిబంధనలు ఉద్యోగ కాలంలో మాత్రమే వర్తిస్తాయని నిపుణులు చెబుతున్నారు. జరిమానా మొత్తం సమంజసంగా, సరైన కారణంతో ఉండాలి. అలాగే, ఈ నిబంధనలు ఉద్యోగి ఇతర కంపెనీల్లో అవకాశాలను అన్వేషించడాన్ని నిరోధించే విధంగా ఉండకూడదు. అందకే ఈ నిబంధనలు ఉద్యోగం మానేసిన కూడా వర్తించే విధంగా ఉండకూడదు.