EPF 3.0 Launch| జూన్ 2025 నుంచి భారతదేశంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) సభ్యులకు గొప్ప డిజిటల్ అప్‌డేట్ వచ్చింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కొత్త ప్లాట్‌ఫామ్ EPFO 3.0ని ప్రారంభిస్తోంది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా 9 కోట్లకు పైగా సభ్యులు తమ డబ్బును సులభంగా, త్వరగా విత్ డ్రా చేసుకోగలరు. ఆర్థిక లావాదేవీలు కూడా ఏ కష్టం లేకుండా నిర్వహించవచ్చు. ఈ మార్పులు రిటైర్మెంట్ ఫండ్ వ్యవస్థను ఆధునిక డిజిటల్ బ్యాంకింగ్‌తో సమానంగా తీర్చిదిద్దుతాయి.
EPFO 3.0 అంటే ఏమిటి?
EPFO 3.0 అనేది కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్. ఇది ఇపిఎఫ్ (EPF) సభ్యులకు సేవలను సులభతరం చేస్తుంది. ఈ వ్యవస్థతో డబ్బు విత్‌డ్రా చేయడం, అకౌంట్ వివరాలను సవరించడం వంటి పనులు వేగంగా, సులభంగా చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులకు ఆర్థిక సేవలను డిజిటలైజ్ చేస్తోంది.
EPFO 3.0 లాంచ్ తేదీ
EPFO 3.0 జూన్ 1, 2025 నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ విషయాన్ని ధృవీకరించారు.
యుపిఐ, ఏటిఎం (UPI, ATM) ద్వారా విత్‌డ్రాయల్: ఇప్పటివరకు EPF డబ్బు విత్‌డ్రా చేయడానికి రోజులు, వారాలు వేచి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు యుపిఐ (UPI) లేదా ఎటిఎం (ATM) ద్వారా రూ. 1 లక్ష వరకు తక్షణమే విత్‌డ్రా చేయవచ్చు.
డిజిటల్ సవరణలు: పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్ వంటి వివరాలను ఆన్‌లైన్‌లో OTP ఆధారంగా సులభంగా సవరించవచ్చు. ఇపిఎఫ్ (EPF) కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు.
త్వరిత ఫిర్యాదు పరిష్కారం: కొత్త ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థ ద్వారా సమస్యలను ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసి, త్వరగా పరిష్కరించవచ్చు.
ప్రభుత్వ పథకాలతో అనుసంధానం: అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి జీవన బీమా యోజన వంటి పథకాలతో ఈ ప్లాట్‌ఫారమ్ అనుసంధానం అవుతుంది.
ఎల్‌పిజి (LPG) ధర తగ్గింపు
వాణిజ్య వినియోగదారులకు శుభవార్త! జూన్ 1 నుంచి 19 కేజీ LPG సిలిండర్ ధర రూ. 24 తగ్గింది. ఢిల్లీలో ఇప్పుడు దీని ధర రూ. 1,723.50. అయితే, 14 కేజీ గృహ వినియోగ సిలిండర్ ధరలో మార్పు లేదు.
ఉచిత ఆధార్ అప్‌డేట్ గడువు
ఆధార్ కార్డ్ హోల్డర్లు జూన్ 14, 2025 వరకు ఉచితంగా ఆన్‌లైన్‌లో వివరాలను అప్‌డేట్ చేయవచ్చు. ఈ గడువు తర్వాత ఆన్‌లైన్ అప్‌డేట్‌కు రూ. 25, ఆధార్ కేంద్రాల్లో రూ. 50 ఫీజు వసూలు చేస్తారు.
క్రెడిట్ కార్డ్ విధాన మార్పులు
కొటక్ మహీంద్రా బ్యాంక్ (జూన్ 1 నుంచి): రివార్డ్ పాయింట్లపై పరిమితులు, ఇంధనం, అద్దె, యుటిలిటీ బిల్లులపై 1% ట్రాన్సాక్షన్ ఫీజు విధించబడుతుంది.
HDFC బ్యాంక్ (జూన్ 10 నుంచి): టాటా న్యూ కార్డ్‌లకు లాంజ్ యాక్సెస్ కోసం కొత్త వోచర్ విధానం.
యాక్సిస్ బ్యాంక్ (జూన్ 20 నుంచి): రివార్డ్ కార్డ్‌లో క్యాష్‌బ్యాక్, లాంజ్ యాక్సెస్ మార్పులు.
ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్ల తగ్గింపు
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ జూన్ 1 నుంచి ఎఫ్‌డి వడ్డీ రేట్లను 60 బేసిస్ పాయింట్ల వరకు తగ్గిస్తోంది. రూ. 3 కోట్ల లోపు డిపాజిట్లకు రేట్లు 4 శాతం నుంచి 8.4 శాతం వరకు ఉంటాయి.