HBD Nikhil Siddhartha:నిఖిల్ సిద్ధార్థ(Nikhil Siddhartha).. హీరోగా తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ఈయన 1985 జూన్ 1న తెలంగాణ, హైదరాబాద్లో జన్మించారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన నిఖిల్.. పాఠశాలలో తనను తాను “బేగంపేట బోయ్” గా చెప్పుకునేవారట. ‘ముఫాఖమ్ ఝా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ’ లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిఖిల్..ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. కెరియర్ పీక్స్ లో ఉండగానే 2020లో డాక్టర్ పల్లవిని వివాహం చేసుకున్నారు. 2024లో ఒక పండంటి అబ్బాయికి జన్మనిచ్చారు. ఇకపోతే ఈరోజు నిఖిల్ 39వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అసిస్టెంట్ డైరెక్టర్గా తొలి సినీ ప్రయాణం..
నిఖిల్ సినీ ప్రయాణం విషయానికి వస్తే.. ‘హైదరాబాద్ నవాబ్స్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ ను మొదలుపెట్టారు. ఈ సినిమా కంటే ముందు 2003లో వచ్చిన ‘సంబరం’ సినిమాలో చిన్న పాత్ర పోషించారు. ఇక ‘హైదరాబాద్ నవాబ్స్’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గానే కాదు అందులో చిన్న పాత్ర కూడా పోషించారు నిఖిల్. నట శిక్షకుడు ఎన్.జే.భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్న నిఖిల్.. హ్యాపీడేస్ చిత్రంలో నటించడానికి ముందే చిన్న చిన్న పాత్రలు వివిధ సినిమాలలో పోషించాడు. అయితే హ్యాపీడేస్ సినిమాతోనే ఈయనకు మంచి గుర్తింపు లభించింది. ప్రముఖ జాతీయ అవార్డు గ్రహీత, డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న శేఖర్ కమ్ముల(Sekhar kammula) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నలుగురు స్నేహితులలో ఒకరిగా నిఖిల్ నటించారు. ఈ చిత్రం విజయంతో నిఖిల్ కెరియర్ కు బాగా ప్లస్ అయింది.. ఈ చిత్రం 2007లో అతి తక్కువ బడ్జెట్ తో తీసి కమర్షియల్ హిట్గా నిలిచింది. ఇకపోతే హీరోగా నిఖిల్ నటించిన తొలి చిత్రం ‘అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్’. ఆ తర్వాత ‘యువత’, ‘వీడు తేడా’ చిత్రాలలో నటించగా.. అవి 50 రోజులు ఆంధ్ర ప్రదేశ్ లో ఆడి నిఖిల్ కు మంచి గుర్తింపును అందించాయి. ఇకపోతే నిఖిల్ ఆ తర్వాత కాలంలో సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ వచ్చాడు. అలా స్వామి రారా , కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కిరిక్ పార్టీ, అర్జున్ సురవరం, కార్తికేయ 2, 18 పేజెస్, స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
నిఖిల్ రాజకీయ జీవితం..
నిఖిల్ హీరోగానే కాకుండా రాజకీయ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2024 మార్చి 29న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు.
నిఖిల్ సినిమాలు..
నిఖిల్ ప్రస్తుతం స్వయంభు సినిమాలో నటిస్తున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో హీరోయిన్గా సంయుక్త మీనన్ నటిస్తోంది. ఈ సినిమా తర్వాత ది ఇండియా హౌస్ అనే సినిమాలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. మరొక మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
ALSO READ:HBD R.Madhavan: ఆర్. మాధవన్ ఇప్పటివరకు ఎన్ని కోట్లు సంపాదించారో తెలుసా?