Gold Price Increased: పసిడి.. పరుగు ఆపనంటోంది. మొన్నటి వరకు లక్ష అంటేనే అమ్మో జనాలకు ఇప్పుడు లక్షన్నరే నా టార్గెట్ అని చెప్పకనే చెబుతోంది. ముద్దుగా బంగారం అని పిలుచుకుందామన్నా భయపెట్టేలా చేస్తోంది పసిడి పరుగు. ఇంతకీ బంగారం ధర ఇలా పైపైకి ఎందుకు పోతుంది? లక్షన్నర పక్కా అని నిపుణులు ఏ నమ్మకంతో చెబుతున్నారు? దానికి వారు చెబుతున్న కారణాలేంటి?
ఇప్పటికే రూ. లక్ష దాటిన బంగారం ధర..
పలుకే బంగారమాయేనా.. అని ఊరికే అనలేదు పెద్దలు. బంగారానికి ఉండే విలువను అప్పుడే ఊహించారు. అందుకే ఈ పసిడి ధర పరుగులు ఆపడం లేదు. కాస్త తగ్గినట్టే తగ్గి ఇప్పుడు మళ్లీ పైపైకి పరుగులు తీస్తోంది. ఇకపై మీకిష్టమైనవారిని ముద్దుగా బంగారం అని పిలవాలనుకున్నా కాస్త ఆగి ఆలోచించాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది ఈ అసలు బంగారం. ఇప్పటికే లక్ష దాటింది బంగారం ధర. అయితే ఇది కాదు ఇప్పుడు అసలు న్యూస్.. ఈ ధర లక్షా 40 వేల నుంచి లక్షా 50 వేల వరకు చేరుకునే అవకాశం ఉంది. గోల్డ్.. గత 30 రోజుల్లో 6 వేలకు పైగా పెరిగింది బంగారం ధర. ఆగస్టు 5న లక్షా రూపాయలుగా ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర.. సరిగ్గా నెల రోజులు దాటిన తర్వాత లక్షా 6 వేలను చేరుకుంది. ఈ మధ్యలో లక్షా 7 వేలను కూడా టచ్ చేసింది. ఇక రీసెంట్‌గా లక్షా 8 వేలను కూడా దాటేసింది. అయితే ఈ పరుగు అప్పుడే అయిపోలేదు.. ముందు ముందు మరింత పెరగడం ఖాయమని చెబుతున్నారు నిపుణులు.
టారీఫ్‌ల పుణ్యమా అని బంగారం ధరకు రెక్కలు
మరి పసిడి ధరకు పరుగులు ఏంటి? అంటే సమాధానం అంతర్జాతీయంగా పెరిగిన అనిశ్చితి పరిస్థితులు, యుద్ధాలు.. ఇంకా ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే అడ్డగొలు నిర్ణయాలు. మాములుగా చరిత్రలో ఎప్పుడూ లేనంతగాఆల్ టైమ్ హైలో బంగారం కొండెక్కి కూర్చుంది. సరిగ్గా అదే సమయంలో ట్రంప్ టారీఫ్‌ల పుణ్యమా అని ఏకంగా కొత్త రెక్కలే పొడుచుకొచ్చాయి. ఎందుకంటే పదిగ్రాముల బంగారం ధర లక్ష అంటేనే ఓ షాక్. కానీ ఇప్పుడు లక్ష కామన్‌గా మారగా.. ఇప్పుడు లక్షా 50 వేలు అంటున్నారు. నిజానికి చాలా మంది జాతీయ, అంతర్జాతీయ నిపుణులు బంగారం లక్ష దాటుతుందన్నారు. కానీ దానికి చాలా సమయం పడుతుందని ఊహించారు. కానీ అంత టైమ్ కూడా ఇవ్వలేదు.. సూపర్ ఫాస్ట్‌గా టార్గెట్ చేరుకుంది. బంగారం ధర మరింత పెరగడానికి కొన్ని కారణాలు చెబుతున్నారు నిపుణులు.
డాలర్ పెత్తనానికి ఎదురవుతున్న సవాళ్లు
నిజానికి ప్రతి దేశం డాలర్లలోనే తమ చెల్లింపులు చేస్తున్నాయి. కానీ ట్రంప్ పుణ్యమా అని ఇప్పుడు డాలర్ పెత్తనానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. దీనికి ఆజ్యం పోసింది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. ఈ యుద్ధం ప్రారంభం కాగానే అమెరికా తన అమ్ములపొదిలోని తొలి అస్త్రాన్ని రష్యాపై ప్రయోగించింది. రష్యా రిజర్వ్‌లోని 300 బిలియన్ డాలర్ల నిధులను ఫ్రీజ్ చేసింది. ఈ ఒక్క నిర్ణయం అనేక దేశాలను తిరిగి ఆలోచించేలా చేసింది. అమెరికాకు నచ్చకపోతే ఎప్పుడైనా మనపై కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకునే అవకాశం ఉందన్న ఆలోచన వచ్చేలా చేసింది. దీంతో అనేక దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు తమ దృష్టిని బంగారంవైపు మరల్చాయి. బంగారాన్ని ఓ ఇన్సూరెన్స్ పాలసీగా చూడటం ప్రారంభించాయి. కరెన్సీ విలువ మారుతుంది కానీ.. బంగారం విలువ మార్చడం అంత ఈజీ కాదనే ఆలోచన అనేక దేశాలది. ఒక్క మన సెంట్రల్ బ్యాంక్ వెయ్యి టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసంది. ఇది కేవలం కొనుగోలు చేయడం మాత్రమే కాదు.. ఇదో వ్యూహాత్మక చర్య అని చెప్పవచ్చు.
జూలైలో రూ.1,256 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్
మన దేశంలో కూడా బంగారానికి ఉండే ప్రాముఖ్యత అంతకంతకు పెరుగుతోంది. ఈ ఏడాది జులై, ఏప్రిల్ మధ్య జరిగిన లెక్కలను గమనిస్తే.. ఇన్వెస్టర్లు జూన్‌లో 2 వేల కోట్లు.. జులైలో 1256 కోట్లు బంగారంపై ఇన్వెస్ట్ చేశారు. ఏదో పండుగల సమయంలో కొనుగోలు చేసినట్టు కాకుండా.. భారతీయులు, భారతీయ సంస్థలు ఇప్పుడు బంగారాన్ని ఓ అసెట్‌గా చూస్తున్నారనేది దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇప్పటికే గోల్డ్ అంతర్జాతీయంగా చూస్తే రికార్డులను క్రియేట్ చేసింది. ఏప్రిల్ ఔన్స్ బంగారం ధర 3 వేల 500 డాలర్లకు చేరింది. ఇప్పుడిది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ బంగారం ధరల పెరుగుదల వెనక ట్రంప్ హస్తం కూడా ఉందనే చెప్పాలి. నిజానికి బంగారం 3 వేల 500 డాలర్లకు చేరిన సమయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఏప్రిల్‌లో ట్రంప్ ఎప్పుడైతే లిబరేషన్ డే టారిఫ్స్ అంటూ మొదటు పెట్టారో.. అప్పుడే పసిరి పరుగు మళ్లీ మొదలైంది. ఆ తర్వాత యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌పై ట్రంప్ ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాలని డిమాండ్ మొదలుపెట్టారు. ఈ పరిణామాలన్నింటిని చూస్తున్న ఇన్వెస్టర్లకు తమకు రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టడానికి బంగారం సేఫ్ అని భావించడం మొదలుపెట్టారు ఇన్వెస్టర్లు. ఒక వేళ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినా నష్టపోకుండా తమ ఫోకస్‌ను గోల్డ్‌పైకి షిఫ్ట్ చేశారని చెప్పవచ్చు.
ఏ దేశ కరెన్సీ అయినా దాని విలువ తగ్గిపోతుంది అని తెలిసినప్పుడు.. ఆయా దేశాలకు ప్రత్యామ్నాయంగా కనిపించేది బంగారమే. అంతేగాకుండా అమెరికా బాండ్‌లను కొనుగోలు చేయడం కంటే.. తమ డాలర్ రిజర్వ్‌లను బంగారంగా మలుచుకోవడమే మేలనే భావన ఇప్పటికే అనేక దేశాల్లో ఉంది. ట్రంప్ పాలన తీరు, ఆయన సంచలన నిర్ణయాలు చూస్తుంటే.. యూఎస్‌లో వ్యూహత్మక పెట్టుబడులు పెట్టేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అంతేగాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు గతేడాది దాదాపు వెయ్యి 40 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయంటేనే అర్థం చేసుకోవచ్చు. ఈ కొనుగోళ్లు ఇప్పటికి కూడా ఆగడం లేదు. బంగారం ధర పెరుగుతుందంటే ఇన్వెస్టర్లంతా వారి ఫోకస్ దానిపైనే పెడతారు. మరి ఇది ఎంత వరకు సేఫ్. నిజంగా ధర పెరుగుతుందన్న భరోసా భారీగా పెట్టుబడులు పెట్టొచ్చా? బంగారం ధర అలా పైపైకి వెళ్లడం ఎంత వరకు నిజం? గత అనుభవాలు ఏం చెబుతున్నాయి?
మళ్లీ పెరుగుతూ వచ్చిన బంగారం ధర
నిజానికి ఎప్పుడైతే బంగారం లక్ష మార్క్ దాటిందో.. అప్పటి నుంచి దేశీయంగా బంగారం కొనుగోళ్లలో డిమాండ్ కాస్త తగ్గింది. చాలా మంది తమ కొనుగోళ్లను కూడా వాయిదా వేసుకున్నారు. లక్ష దాటిన తర్వాత బంగారం ధర పడిపోవడం ప్రారంభించింది. దీంతో కొనుగోళ్లు కాస్త ఊపందుకున్నాయి. ఈ ధరల తగ్గుదల తాత్కాలికమా.. దీర్ఘకాలం కొనసాగుతుందా అనే దానిపైనా అప్పుడే సందిగ్ధత నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లలోని ఒడిదుడుకులు, దేశీయ డిమాండ్ సరళిని బట్టి.. బంగారం ధరలు మారే అవకాశం ఉంటుందని అందరికి తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే మళ్లీ బంగారం ధర పెరుగుతూ వచ్చింది.
డిజిటల్ బంగారం లేదంటే ETFలలో SIPల ద్వారా కొనుగోళ్లు
బంగారం రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతున్నప్పటికీ ఒకేసారి పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ఇది ఉత్తమ సమయం కాకపోవచ్చన్నది విశ్లేషకుల సలహా. పెట్టుబడిదారులు కాలక్రమేణా చిన్న మొత్తాలలో కొనుగోలు చేయడం ద్వారా బంగారాన్ని పోర్ట్‌ఫోలియోలలో చేర్చుకోవచ్చని అంటున్నారు. ఇక పెట్టుబడిదారులు, ఖర్చులను నిర్వహించడానికి డిజిటల్ బంగారం లేదంటే ETFలలో SIPల ద్వారా అస్థిరమైన కొనుగోళ్లను ఎంచుకోవచ్చని కూడా చెబుతున్నారు. ఎందుకంటే రాబడి కంటే.. గోల్డ్ భద్రత, వైవిధ్యీకరణ, అనిశ్చిత సమయాల్లో ఈజీ లిక్విడిటీ ఉంటుందని అంటున్నారు. నిజానికి బంగారం దీర్ఘకాలిక పరిణామాలను పరిశీలిస్తే.. గోల్డ్, ఈక్విటీలు రెండూ బలమైన రాబడిని ఇచ్చాయనడంలో సందేహం లేదు. 2014 నుండి 2024 వరకు.. బంగారం దాదాపు 178% రాబడిని ఇవ్వగా, నిఫ్టీ 50 ఇండెక్స్ దాదాపు 185 శాతం రాబడిని ఇచ్చింది. కాబట్టి ఎక్కువ కాల వ్యవధిలో.. ఈక్విటీలు.. కాంపౌండింగ్, పెయిడ్ డివిడెండ్‌లు, ఆర్థిక వృద్ధి కారణంగా సంపూర్ణ రాబడిలో స్వల్ప ప్రయోజనాన్ని కలిగి ఉంటాయనే అభిప్రాయం ఉంది. అయితే మార్కెట్ క్షీణత కాలంలో బంగారం మెరుగ్గా ఉంటుందనే సూచన కూడా ఉంది. తీవ్రమైన మార్కెట్ క్షీణతల సమయంలో బంగారం స్టాక్‌ల కంటే మూలధనాన్ని బాగా రక్షిస్తుంది.
స్టాక్స్ కంటే సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా బంగారం
సాధారణంగా బంగారాన్ని స్టాక్స్ కంటే సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావిస్తారు. ఎందుకంటే ఇది ఆర్థిక అస్థిరత, ద్రవ్యోల్బంణం సమయంలో విలువను నిలబెట్టుకుంటుంది. తక్కువ అస్థిరతను కలిగి ఉంటుంది. స్టాక్స్ అధిక రాబడిని అందిస్తాయి కానీ.. మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా ఎక్కువ రిస్క్‌తో ఉంటాయి. అయితే బంగారం దీర్ఘకాలంలో స్టాక్స్ లాంటి అధిక వృద్ధిని ఇవ్వకపోవచ్చని నిపుణులు అంటున్నారు. ఇక ఏది సురక్షితం అనే క్వశ్చన్‌కు సరైన సమాధానం చెప్పలేం. ఎందుకంటే మార్కెట్‌కు సంబంధించినది ఏదైనా రిస్క్ పైన ఆధారపడి ఉంటుంది. అంతేకాదు ఇన్వెస్టర్ల టార్గెట్‌లు, ఇన్వెస్ట్ కాలపరిమితిపై ఆధారపడి ఉంటుంది. అందుకే రిస్క్ తగ్గించడానికి బంగారం సురక్షితమే అయినప్పటికీ.. రాబడి కోసం స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచిదనేది ఓ వాదన. నిజానికి అందరూ బంగారంపై పెట్టుబడి పెడితే.. ఆర్థిక వ్యవస్థలో, మార్కెట్‌లో అనూహ్యమైన పరిణామాలు జరగడం ఖాయం.
స్టాక్స్, బాండ్లు, రియల్ ఎస్టేట్ రంగాల్లో డబ్బు ప్రవాహంలో తగ్గుదల..
నిజానికి ఇన్వెస్టర్లంతా బంగారంపై పెట్టుబడి పెడితే.. స్టాక్స్, బాండ్లు, రియల్ ఎస్టేట్ వంటి ఇతర పెట్టుబడి రంగాలలో డబ్బు ప్రవాహం తగ్గుతుంది. దీనివల్ల ఆయా రంగాల ధరలు పడిపోవచ్చు. కంపెనీలకు మూలధనం సేకరణ కష్టమవుతుంది. ఇది ఆర్థిక వృద్ధిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. బంగారం ఉత్పాదక ఆస్తి కాదు కాబట్టి, అందరూ బంగారంలో పెట్టుబడి పెడితే, ఉత్పాదక రంగాలకు పెట్టుబడి తగ్గి, ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తాయి. దీంతో ఉద్యోగ నష్టాలు, ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం లేకపోలేదు.
కొనుగోళ్లు తగ్గితే ధరలు పడిపోయే అవకాశం
ఇక్కడ మరో కోణం కూడా ఉంది. బంగారం ధరలు అతిగా పెరిగితే కూడా నష్టమే. మనం చెప్పుకున్నట్టు కొనుగోళ్లు తగ్గితే ఒక్కసారిగా ధరలు పడిపోయే అవకాశం ఉంది. ఇది ఇన్వేస్టర్లకు ఓ చేదు జ్ఞాపకాన్ని మిగుల్చుతుంది. దీనికి తోడు బంగారం అనేది ఓ లోహం. డిమాండ్ భారీగా పెరిగితే ఫిజికల్‌గా దీనిని కొనుగోలు చేయడం కష్టమవుతుంది. ఇదే జరిగితే బంగారం ETFలు లేదంటే, ఇతర ఆర్థిక సాధనాలపై ఆధారపడేలా పరిస్థితులు ఏర్పడతాయి. ఇదే మరింత రిస్క్‌ను పెంచే విషయం. అందుకే తాత్కాలికంగా బంగారం ధరలు పెరిగినప్పటికీ.. ఆర్థిక స్థిరత్వం కోసం.. స్టాక్స్, బాండ్లు, బంగారం వంటి వివిధ ఆస్తుల మధ్య బ్యాలెన్స్‌డ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అవసరం అంటున్నారు నిపుణులు.
Also Read: చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు
బంగారం ధర ఎప్పుడేలా ఉంటుందో.. ఎలా ఊహకు అందదో చెప్పడానికి ఒక ఉదాహారణ చెప్పుకోవాలి. గోల్డ్‌మన్ సాచ్స్ నివేదికల ప్రకారం 2025 చివరి నాటికి అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 3 వేల డాలర్లు చేరే అవకాశం ఉంది. కానీ ఏప్రిల్ నాటికే 3 వేల 500 డాలర్లకు చేరింది. ఇక BMI నివేదిక ప్రకారం.. 2025లో ధరలు 15 శాతం తగ్గి.. 10 గ్రాముల బంగారం 64 వేల నుండి 70 వేలకు చేరుకుంటుందని అంచనా వేశారు. కానీ దీనికి వ్యతిరేకంగా ఆకాశంవైపు దూసుకుపోతుంది. అందుకే బంగారం విషయంలో ఎవరి అంచనాలు నిజమవుతాయి? ఎవరి అంచనాలు తప్పుతాయి అనేది పూర్తిగా ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం అనుకుంటున్న తులం బంగారం లక్షన్నరకు చేరే అవకాశం ఎంత అయితే ఉందో.. తగ్గడానికి కూడా కూడా అంతే ఉంది.
Story By Vamshi krishna, Bigtv