BigTV English

Gold In India: కొండలా పేరుకుపోతున్న పసిడి నిల్వలు.. భారత్‌లో ఎంత గోల్డ్ ఉందో తెలుసా?

Gold In India: కొండలా పేరుకుపోతున్న పసిడి నిల్వలు.. భారత్‌లో ఎంత గోల్డ్ ఉందో తెలుసా?

Gold In India: ప్రతి దేశానికో కరెన్సీ ఉంటుంది. దానికి.. ప్రపంచంలో ఒక్కో చోట ఒక్కో విలువ ఉంటుంది. ప్లేస్‌ని బట్టి.. కరెన్సీ కథే మారిపోతుంది. కానీ.. బంగారం అలా కాదు. గోల్డ్ ఎక్కడైనా గోల్డే. అది అమెరికా అయినా.. అమీర్‌పేట్ అయినా. ఇప్పుడు జనమే కాదు.. దేశాలు కూడా బంగారం కొనుగోళ్లపై ఫోకస్ పెట్టాయి. బంగారం నిల్వల్ని పెంచుకుంటున్నాయి. మరి.. ఏ దేశంలో అత్యధిక పుత్తడి నిల్వలున్నాయి? భారత్‌ దగ్గర ఎన్ని టన్నుల బంగారం ఉంది?


బంగారం నిల్వల్ని పెంచుకుంటున్న దేశాలు

బంగారం అంటే ఆభరణం, ఆకర్షణ మాత్రమే కాదు. ఆదాయం కూడా. అందుకే.. పుత్తడిని స్థిరమైన, నమ్మదగిన వనరుగా భావిస్తారు. ముఖ్యంగా భారతీయులకు బంగారం అంటే ఎంతిష్టమో.. అందరికీ తెలుసు. అంత డిమాండ్ ఉంది కాబట్టే.. ఏటా టన్నులకొద్దీ బంగారం భారత్‌కు దిగుమతి అవుతోంది. బంగారం మన దగ్గర ఉంటే.. ఆ భరోసా ఎలా ఉంటుందో జనానికి బాగా తెలుసు. డబ్బు సంపాదనపై ఎంత పక్కాగా ఉంటారో.. బంగారం కొనుగోళ్లపైనా అంతే పక్కాగా ఉంటారు. అయితే.. ప్రజలే కాదు.. దేశ, విదేశాల ప్రభుత్వాలు కూడా బంగారం నిల్వల్ని పెంచుకుంటున్నాయి. ఇటీవలే భారతీయ రిజర్వ్ బ్యాంక్ 100 టన్నుల బంగారాన్ని ఇండియాకు తీసుకొచ్చింది. ఆర్థికంగా అనిశ్చిత పరిస్థితులు ఎదురైనప్పుడు.. ఈ నిల్వలు ఆదుకుంటాయని భారత్‌తో పాటు ప్రపంచ దేశాలన్నీ నమ్ముతున్నాయి.


దూకుడుగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్న ఆర్బీఐ

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో భారత్ కంటే దాదాపు 10 రెట్లు బంగారం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. అమెరికా దగ్గర.. చైనా కంటే మూడున్నర రెట్ల ఎక్కువ బంగారం నిల్వలున్నాయి. మన ఆర్బీఐ కూడా ఈ మధ్య దూకుడుగా బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. ఇదే.. అత్యధిక బంగార నిల్వలున్న దేశాల లిస్టులో.. భారతదేశం ర్యాంక్‌ని పైకి ఎగసేలా చేసింది. 2024 నాటికి.. ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు కలిగిన దేశాలేమిటో.. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఓ డేటా రిలీజ్ చేసింది. అందులో.. టాప్ 10లో భారత్ కూడా ఉంది. అయితే.. ఏ దేశం దగ్గర ఎక్కువ బంగారం ఉంది? అందులో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? ప్రతి ఏడాది టన్నులకొద్దీ బంగారం కొనుగోలు చేస్తున్న భారత్ దగ్గర ఎంత బంగారం ఉందనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.

బంగారం నిల్వల్లో అమెరికా అగ్రస్థానంలో

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం.. అత్యధిక బంగారం నిల్వలున్న దేశాల్లో.. పేరుకు తగ్గట్లుగానే అగ్రరాజ్యం అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం అమెరికా దగ్గర మొత్తం 8 వేల 133 టన్నుల బంగారం నిల్వలున్నాయి. ప్రతి ఏటా అమెరికా తన బంగారం నిల్వల్ని పెంచుకుంటోంది. యూఎస్ తర్వాత రెండో స్థానంలో జర్మనీ ఉంది. ప్రస్తుతం జర్మనీ దగ్గర.. 3 వేల 351.5 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. మూడో స్థానంలో ఇటలీ ఉంది. WGC లేటెస్ట్ డేటా ప్రకారం.. ఇటలీ దగ్గర 2 వేల 451.8 టన్నుల బంగారం ఉంది. ఆ తర్వాత నాలుగో స్థానంలో ఫ్రాన్స్ ఉంది. ఫ్రాన్స్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర.. మొత్తం 2 వేల 2,437 టన్నుల బంగారం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక.. అత్యధిక బంగారం నిల్వల్లో ఐదో స్థానంలో భారత్ పొరుగు దేశం చైనా ఉంది. డ్రాగన్ కంట్రీ దగ్గర.. ప్రస్తుతం 2 వేల 264.3 టన్నుల బంగారం నిల్వలున్నాయి. ఇక.. 1040 టన్నుల బంగారం నిల్వలతో.. స్విట్జర్లాండ్ ఆరో స్థానంలో కొనసాగుతోంది.

అత్యధిక బంగారం నిల్వలున్న దేశాల్లో భారత్‌ది 7వ స్థానం

అత్యధిక బంగారం నిల్వలున్న టాప్-10 దేశాల్లో భారత్ ఏడో స్థానంలో ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ప్రస్తుతం 853.63 టన్నుల బంగారం నిల్వలున్నట్లు.. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక చెబుతోంది. కొన్ని నెలల ముందు వరకు బంగారం నిల్వల్లో భారత్ తొమ్మిదో స్థానంలో ఉండేది. ఇప్పుడు.. రెండు స్థానాలు మెరుగుపరుచుకొని ఏడో స్థానానికి చేరింది. ఆర్బీఐ కూడా భారత బంగారు నిల్వలకు.. దూకుడుగా బంగారాన్ని యాడ్ చేస్తూ వెళుతోంది. ప్రతి ఏటా టన్నుల్లో బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. ఇటీవలి కాలంలో.. బంగారం నిల్వలు అత్యధికంగా పెరిగిన తొలి 5 దేశాల్లో భారత్ కూడా ఒకటిగా నిలిచినట్లు.. WGC రిపోర్ట్ తెలియజేసింది.

Also Read: ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల జాబితాలో ముగ్గురు భారతీయులు

భారత్ దగ్గర 853.63 టన్నుల బంగారం నిల్వలు

భారత్ తర్వాత అత్యధిక గోల్డ్ రిజర్వ్స్ ఉన్న దేశం జపాన్. 846 టన్నుల బంగారం నిల్వలతో.. జపాన్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. అలాగే.. 612.45 టన్నుల బంగారం నిల్వలతో.. నెదర్లాండ్స్ తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక.. అత్యధిక బంగారం నిల్వలున్న టాప్-10 దేశాల్లో.. టర్కీ పదో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మూడో త్రైమాసికం ముగిసే నాటికి.. టర్కీ దగ్గర 595.37 టన్నుల బంగారం నిల్వలున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చిత పరిస్థితుల కారణంగా.. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విధమైన పరిస్థితుల్లో స్థిరత్వాన్ని తీసుకొచ్చేందుకు.. ప్రపంచ దేశాలన్నీ బంగారాన్నే ఏకైక మార్గంగా చూస్తున్నాయి. దానికోసమే.. అన్ని దేశాలు బంగారం నిల్వల్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాయి.

దేశ ఆర్థిక స్థిరత్వానికి బంగారమే ఏకైక మార్గం!

ప్రపంచ దేశాలు బంగారం నిల్వలు పెంచుకోవడం వెనుక రకరకాల కారణాలుంటాయి. ఆ దేశంలో నెలకొన్న పరిస్థితులు, వాణిజ్య సంబంధాలు, ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా ఉంచేందుకు, ఆ దేశ కరెన్సీ విలువను పెంచుకునేందుకు.. ఇలా బంగారం నిల్వల వెనుక ఎన్నో అంశాలు ముడిపడి ఉంటయి. కరెన్సీ హెచ్చుతగ్గులు, ఆర్థిక సంక్షోభాల నుంచి రక్షణగా ఉండేందుకు, దేశంలో ఆర్థిక స్థిరత్వం నెలకొల్పేందుకు.. బంగారం నిల్వలు కీలకపాత్ర పోషిస్తాయ్. ఇవన్నీ.. ఆయా దేశాల రిజర్వ్ బ్యాంక్‌లు, సెంట్రల్ బ్యాంక్‌లే నిర్వహిస్తాయి. ముఖ్యంగా.. గోల్డ్ రిజర్వ్స్.. దేశాల ఆర్థిక స్థిరత్వానికి పునాదిగా పనిచేస్తాయి. వాటి కరెన్సీని బ్యాకప్ చేసేందుకు ఉపయోగించే.. ఓ స్పష్టమైన ఆస్తిగా బంగారం ఉంటుంది. ముఖ్యంగా.. ఆర్థిక అనిశ్చితి సమయాల్లో.. బంగారం నిల్వలు దేశ ద్రవ్య వ్యవస్థపై విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ప్రపంచ స్థాయిలో.. దేశాల ఆర్థిక స్థితిని, కరెన్సీ విలువను పటిష్టం చేస్తాయి. ఈ ప్రపంచంలో ఇప్పటివరకు తవ్విన మొత్తం బంగారంలో.. దాదాపు 20 శాతం సెంట్రల్ బ్యాంకులు కలిగి ఉన్నాయి.

బంగారం నిల్వలు ప్రభుత్వ ఆర్థిక ఆస్తిగా పరిగణించబడతాయి

చరిత్ర మొత్తం బంగారం నిల్వలు కీలకమైన జాతీయ ఆస్తులుగా లెక్కగట్టారు. తరచుగా ఆర్థిక విధానాలు, యుద్థ వ్యూహాలు దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావితం చూపుతుంటాయి. అందువల్ల.. గ్లోబల్ ఫైనాన్స్‌లో వ్యూహాత్మక ఆస్తిగా బంగారం ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ బంగారం నిల్వలు ప్రభుత్వ ఆర్థిక ఆస్తిగా పరిగణించబడతాయి. ఆర్థిక అనిశ్చితి సమయంలో భద్రతను అందిస్తాయి. ఈ వ్యవస్థ.. ఓ దేశం కరెన్సీ విలువను.. నిర్ణీత మొత్తంలో బంగారంతో ముడిపెట్టింది. దేశాలు.. తమ డబ్బు సప్లైకి మద్దతుగా.. పెద్ద మొత్తంలో బంగారం నిల్వలను ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అవే.. ప్రపంచ ఆర్థిక మార్కెట్లపైనా ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక బంగారం నిల్వలున్న దేశం అమెరికా. ఇవే.. గ్లోబ్ వైడ్‌గా అమెరికా ఆధిపత్యానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. యూఎస్ ఆర్థిక స్థిరత్వానికి బంగారమే మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. అదే.. అమెరికా డాలర్‌ని.. వరల్డ్ రిజర్వ్ కరెన్సీగా స్థిరీకరించింది.

దేశాల ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలోనూ బంగారానిదే కీ రోల్

బంగారం నిల్వలు భద్రతను, లిక్విడిటీని పెంచుతుంది. ఆర్థిక సంక్షోభాల నుంచి దేశాన్ని వెంటనే బయటపడేస్తుంది. ఈ గోల్డ్ రిజర్వ్స్.. గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్‌లోనూ విశ్వసనీయతను సూచిస్తాయి. ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. దేశాల ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలోనూ బంగారానిదే కీ రోల్. ప్రపంచ ఆర్థిక ఒడిదొడుకులకు వ్యతిరేకంగా.. గోల్డ్ రక్షణ కవచంలా పనిచేస్తుంది. స్థిరమైన ఆర్థిక శక్తిగా నిలుస్తుంది. భారత్ పొరుగున ఉన్న చైనా కూడా సెంట్రల్ బ్యాంక్ ఆస్తుల్ని పెంచుకునేందుకు, డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకునే వ్యూహంలో భాగంగా.. గడిచిన పదేళ్లలో బంగారం నిల్వల్ని పెంచుకుంటూ వస్తోంది. చైనా ఆర్థిక వ్యవస్థకు బలమైన మద్దతిచ్చే ఫ్యాక్టర్‌గా ఇప్పుడు బంగారం నిల్వలే కనిపిస్తున్నాయి.

భారత్ దగ్గర 853 టన్నులకు పైగా బంగారం నిల్వలు

మరోవైపు.. భారత్ దగ్గర 853 టన్నులకు పైగా బంగారం నిల్వలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి విలువ 72 బిలియన్ డాలర్లకు పైనే ఉంది. మన రిజర్వ్ బ్యాంక్ కూడా స్థిరంగా బంగారం నిల్వల్ని పెంచుకుంటూ వస్తోంది. ఇది.. దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరిచే ఫ్యాక్టర్‌గా కనిపిస్తోంది. భారత్ దగ్గరున్న బంగారం నిల్వలు.. ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా.. రక్షణగా పనిచేస్తాయి. అంతేకాదు.. క్రమంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు ద్రవ్య స్థిరత్వాన్నిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకొనే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. గోల్డ్ హోల్డింగ్స్‌ని చురుగ్గా నిర్వహిస్తోంది. పైగా.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అనిశ్చితి, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల మధ్య.. ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేసేందుకు.. క్రమంగా బంగారం నిల్వల్ని పెంచుకుంటూ వస్తోంది మన రిజర్వ్ బ్యాంక్.

బంగారం నిల్వలు.. దేశాల విదేశీ మారక నిల్వల మధ్య స్థిరత్వాన్ని సైతం సూచిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య హెచ్చుతగ్గులు, కరెన్సీ సంక్షోభాల సమయంలో.. ఆర్థిక వ్యవస్థకు మద్దతిచ్చేలా.. బంగారం ఆర్థిక రక్షణగా పనిచేస్తుంది. అంతేకాదు.. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల మధ్య.. ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించేందుకు బంగారం నిల్వలు చాలా కీలకం. జాతీయ భద్రతను, ఆర్థిక స్థితిస్థాపకతను పెంపొందించేందుకు.. ప్రపంచ దేశాలన్నీ.. బంగారం నిల్వలను వ్యూహాత్మకంగా కూడగట్టుకుంటున్నాయి.

Related News

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Big Stories

×