Missed Call AI Company| ఒక్క ఫోన్ కాల్‌కు సమాధానం ఇవ్వకపోతే ఏమవుతుంది? ఒక చిన్న వ్యాపారానికి అది విలువైన కస్టమర్‌ను కోల్పోవడానికి కారణం కావచ్చు. చిన్నప్పుడు తన కుటుంబ వ్యాపారంలో ఇలాంటి సమస్యలను గమనించిన అపూర్వ శ్రీవాస్తవ, వాటికి పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్నారు. ఆ ఆలోచనే ఇప్పుడు ఆయనను బిలియన్ డాలర్ల ఏఐ స్టార్టప్ సహ వ్యవస్థాపకుడిగా నిలబెట్టింది.
అపూర్వ శ్రీవాస్తవ మిచిగన్‌లో పెరిగారు. టీనేజ్ నుంచే తల్లిదండ్రులకు బిజినెస్‌లో సహాయం చేసేవారు. ప్రతి కస్టమర్ ఫోన్‌కు సమాధానం ఇవ్వడం ఎంత కష్టమో అప్పుడే తెలుసుకున్నారు. తర్వాత ఆయన ప్రతిష్ఠాత్మక మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో కంప్యూటర్ సైన్స్ చదివారు. అవోకా సంస్థను ప్రారంభించడానికి ముందు ఆపిల్, సన్‌షైన్ కంపెనీల్లో ఏఐ ఉత్పత్తులపై పనిచేశారు. రెటూల్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా కూడా పనిచేశారు.
ఆయన సహ వ్యవస్థాపకుడు టైసన్ చెన్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఉంది. పెన్సిల్వేనియాలో తన తల్లి నిర్వహించిన ఆక్యుపంక్చర్ బిజినెస్‌లో ఫోన్ కాల్స్ చూసుకునేవారు. ఎంఐటీలో జరిగిన ఒక పోకర్ నైట్‌లో అపూర్వ, టైసన్ ఇద్దరూ కలుసుకున్నారు. తమ అనుభవాలను పంచుకుని, వ్యాపారాల సమస్యకు పరిష్కారం కనుగొనాలని భావించారు. అలా ప్రారంభమైంది అవోకా ఏఐ కంపెనీ.
మొదట రెస్టారెంట్ల కోసం ఏఐ ఆధారిత ఫోన్ ఆన్సరింగ్ సేవను రూపొందించాలని వారు భావించారు. అయితే టెక్సాస్‌లో జరిగిన రెస్టారెంట్ బిజినెస్ కాన్ఫెరెన్స్‌లో వారి ఆలోచన మారింది. అక్కడ డల్లాస్‌కు చెందిన రెస్క్యూ ఎయిర్ అనే ఎయిర్ కండిషనింగ్ సంస్థను కలిశారు. రెస్టారెంట్‌లో మిస్డ్ కాల్ వల్ల 30 లేదా 40 డాలర్ల ఆర్డర్ కోల్పోవచ్చు. కానీ ఏసీ లేదా హీటింగ్ సేవల సంస్థకు కాల్ మిస్ అయితే, 30 వేల నుంచి 40 వేల డాలర్ల విలువైన పని చేజారవచ్చు. ఈ అవకాశాన్ని గుర్తించిన అపూర్వ, టైసన్ 2023లో 3నెలలు శ్రమించి రెస్క్యూ ఎయిర్ ఎయిర్ కండీషన్ కంపెనీ కోసం ఒక ఉత్పత్తిని రూపొందించారు. ఆ కంపెనీ ద్వారా వారికి తొలి కస్టమర్లు లభించారు.
Also Read: పెళ్లి కోసం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారా? ఈ 7 సందర్భాల్లో మాత్రం మీకే నష్టం
అవోకా కంపెనీ హోమ్ సర్వీస్‌ల బిజినెస్‌ల కోసం ఏఐ వాయిస్ ఏజెంట్లను అభివృద్ధి చేస్తుంది. ఇవి ఫోన్ కాల్స్‌కు సమాధానం ఇస్తాయి. అపాయింట్‌మెంట్లు బుక్ చేస్తాయి. పెండింగ్ అంచనాలపై కస్టమర్లను సంప్రదిస్తాయి. సర్వీస్ పనుల నిర్వహణలో కూడా సహాయపడతాయి.
ప్లంబింగ్, రూఫింగ్, ఎలక్ట్రికల్, హీటింగ్, ఎయిర్ కండిషనింగ్ రంగాల్లో ఈ ఏఐ సేవలు ఉపయోగపడతాయి.
Also Read: ఉద్యోగం మానేసి వ్యాపారం చేయండి నేన్నున్నా.. టాలెంటెడ్ ఉద్యోగులను ప్రోత్సహిస్తున్న కంపెనీ బాస్
2026 ఏప్రిల్ 27న అవోకా 125 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు సమీకరించినట్లు ప్రకటించింది. మూడు విడతల్లో వచ్చిన ఈ పెట్టుబడులతో కంపెనీ విలువ బిలియన్ డాలర్లకు చేరింది. అంటే సుమారు రూ.8,300 కోట్లు.
వై కాంబినేటర్, క్లైనర్ పెర్కిన్స్, మెరిటెక్, జనరల్ క్యాటలిస్ట్, యాంప్లిఫై పార్ట్‌నర్స్ వంటి కంపెనీలు ఇందులో పెట్టుబడులు పెట్టాయి. ఫార్చ్యూన్ బిజినెస్ రిపోర్ట్ ప్రకారం.. అవోకాకు 800 మందికి పైగా కస్టమర్లు ఉన్నారు.