Star Health: ఆసుపత్రి పాలైనప్పుడు ఆదుకుంటుందని ఎంతో నమ్మకంతో ఆరోగ్య బీమా తీసుకుంటాం. తీరా బిల్లు కట్టే సమయానికి ఏదో ఒక సాకు చెప్పి క్లెయిమ్ రిజెక్ట్ చేస్తే ఆ బాధ అంతాఇంతా కాదు. సామాన్య పాలసీదారులకు ఎదురవుతున్న ఇలాంటి చేదు అనుభవాలపై భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) సీరియస్ అయింది. ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ ‘స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్’ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా రూ. 2 కోట్ల భారీ జరిమానా విధించింది.
అసలేం జరిగింది?
2022లో ఐఆర్‌డీఏఐ నిర్వహించిన తనిఖీల్లో స్టార్ హెల్త్ నిర్వాకాలు బయటపడ్డాయి. కొవిడ్-19 క్లెయిమ్‌లతో పాటు అనేక ఇతర ఆసుపత్రి బిల్లులను కంపెనీ అన్యాయంగా తిరస్కరించినట్లు అధికారులు గుర్తించారు. పాలసీదారులకు రావాల్సిన డబ్బులో ఇష్టారీతిన కోతలు పెట్టడమే కాకుండా, అందుకు గల సరైన కారణాలను కూడా వెల్లడించలేదు. దీనివల్ల బాధితులు సంస్థ నిర్ణయాన్ని ప్రశ్నించే అవకాశాన్ని కోల్పోయారు. ఈ ఉల్లంఘనలపై 2024 డిసెంబర్‌లో షో-కాజ్ నోటీసు ఇచ్చారు. 2025 జూన్‌లో విచారణ జరిపిన అనంతరం ఐఆర్‌డీఏఐ ఈ తుది ఆదేశాలు జారీ చేసింది.
రూ. 2 కోట్ల ఫైన్ లెక్క ఇదే
నిబంధనలకు విరుద్ధంగా క్లెయిమ్‌లను తిరస్కరించినందుకు రూ. కోటి, పారదర్శకత పాటించకుండా బిల్లుల్లో కోతలు పెట్టినందుకు మరో రూ. కోటి చొప్పున మొత్తం రూ. 2 కోట్ల పెనాల్టీని విధించారు. అంతేకాదు, ఆసుపత్రులతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం వచ్చే డిస్కౌంట్లను బిల్లుల్లో చూపించకపోవడం పై నియంత్రణ సంస్థ మండిపడింది.
పాలసీదారులకు భరోసా
ఇకపై క్లెయిమ్ సెటిల్‌మెంట్ లేఖలలో అనుమతించిన, తిరస్కరించిన, చెల్లించని మొత్తాలను విడివిడిగా స్పష్టంగా పేర్కొనాలని ఐఆర్‌డీఏఐ ఆదేశించింది. ఈ ఆదేశాలను బోర్డు ముందు ఉంచి, తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని స్టార్ హెల్త్ యాజమాన్యానికి స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ఇతర బీమా కంపెనీలకు కూడా ఒక గట్టి హెచ్చరికగా మారింది.
Also Read: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇంటింటికీ రూ.300లకే టీ-ఫైబర్ ఇంటర్‌నెట్!