Hyundai: తెలంగాణలో హ్యూండాయ్ మోటర్స్ భారీ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి ఆ కంపెనీకి చెందిన ప్రతినిధులు జూన్‌లో రాష్ట్రానికి రానున్నారు. వేల కోట్ల రూపాయలతో కార్ల మెగా టెస్ట్ సెంటర్‌ను స్థాపించనుంది. దీనివల్ల స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కనుంది.
తెలంగాణకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి టీమ్ గతేడాది ఆగస్టులో దక్షిణ కొరియాలో పర్యటించింది. ఆదేశ రాజధాని సియోల్‌లో హ్యుందాయ్ మోటార్స్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ టీమ్ సమావేశమైంది. ఈ సందర్భంగా రైజింగ్ తెలంగాణ గురించి సీఎం రేవంత్ రెడ్డి ఆ కంపెనీ ప్రతినిధులకు వివరించారు.
గతంలో నిమ్జ్‌లో సుమారు రూ.3వేల కోట్ల పెట్టుబడులకు హ్యుందాయ్ ముందుకొచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో మరో రూ.5,528 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది ఆ సంస్థ. ఈ నేపథ్యంలో పెట్టుబడుల కోసం ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం ఇటీవల సమావేశమైంది. కంపెనీ స్థాపనకు ఆ కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఈ నెలలో హ్యుందాయ్ మోటార్స్ కంపెనీ ప్రతినిధులు తెలంగాణకు రానున్నారు. ప్రభుత్వం పెద్దలతో పెట్టుబడుల గురించి చర్చించనున్నారు. హ్యుందాయ్ మోటార్ కంపెనీ తెలంగాణలో కార్ల మెగా టెస్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతోపాటు అత్యాధునిక కార్ల తయారీ సౌకర్యం అందులో ఉండనుంది.
ALSO READ: మళ్లీ తగ్గిన బంగారం ధర, ఇదే మంచి ఛాన్స్
జహీరాబాద్‌లోని నిమ్జ్‌లో దాదాపు 675 ఎకరాల్లో రూ.8 వేల కోట్ల భారీ పెట్టుబడులు పెట్టనుంది. తొలుత గ్లోబల్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను స్థాపించాలని భావించింది. కార్ల టెస్టింగ్ సెంటర్‌ను ప్రారంభించాలని నిర్ణయించినట్టు పరిశ్రమ వర్గాల మాట. దీనివల్ల సుమారు 4,200 మంది యువతకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.