IRCTC Ticket Booking Tricks: ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటైన భారతీయ రైల్వే సంస్థ.. దేశ వ్యాప్తంగా రోజూ లక్షలాది మందిని తమ గమ్యస్థానాలకు చేర్చుతుంది. రోజూ వేలాది రైలు సర్వీసులను నడుపుతూ ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణాన్ని అందిస్తుంది. రైలు ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు సరికొత్త సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. రైల్వే సంస్థ కల్పించే సౌకర్యాల గురించి ప్రయాణీకులకు పెద్దగా తెలియదు. అందుకే వాటిని చాలా మంది వినియోగించుకోలేరు. ఇండియన్ రైల్వేస్ అందించే బెర్త్ సెలక్షన్ ఆప్షన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
లోయర్ బెర్త్ రైల్ టికెట్ బుకింగ్ రూల్స్
భారతీయ రైల్వే సంస్థ ద్వారా రోజూ లక్షలాది మంది ప్రయాణీకులు రైలు ప్రయాణం చేస్తారు. లోకల్ రైళ్లతో పాటు, ప్యాసింజర్ రైళ్లు దాదాపు నిండి ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలాసార్లు రైలులో వెయిటింగ్ టికెట్ తీసుకుని ప్రయాణించాల్సి ఉంటుంది. కోరుకున్న సీటు దొరకడం కష్టంగా భావిస్తారు. రైళ్లలో సీట్ల ఎంపికకు అవకాశం ఉందనే విషయాన్ని తెలియక ఏదో ఒక సీట్ దొరికితే చాలు అనుకుంటారు. కానీ, టికెట్ బుక్ అయినా కూడా లోయర్ బెర్త్ ను పొందే అవకాశం ఉంది.
లోయర్ బెర్త్ ఎవరు పొందే అవకాశం ఉంటుంది?
వాస్తవానికి, రైల్వే సంస్థ ఆయా రైళ్లలో కొన్ని సీట్లను రిజర్వ్ చేసి ఉంచుతుంది. దివ్యాంగులతో పాటు సీనియర్ సిటిజన్లకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలను అందిస్తుంది. అందులో భాగంగానే సాధారణంగా సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ లను కేటాయిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ కోటా సీనియర్ సిటిజన్లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే, భారతీయ రైల్వే మొదట సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ సీట్లు ఇస్తుంది. ఒకవేళ సీనియర్ సిటిజన్లు ఎవరూ లేకపోతే ఇతరులకు కేటాయిస్తుంది. అయితే, ఇక్కడ ఓ కండీషన్ ఉంది. సీనియర్ సిటిజన్ ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు లేదంటే ఇద్దరు సీనియర్ సిటిజన్లు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే లోయర్ సీట్ కోటా పొందే అవకాశం ఉంటుంది. ఇద్దరి కంటే ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు కలిసి ప్రయాణిస్తున్నట్లయితే, లోయర్ బెర్త్ సీట్ల రిజర్వేషన్ వర్తించదు. ఒకవేళ సీనియర్ సిటిజన్ కు అప్పర్, మిడిల్ బెర్త్ ఉంటే, టీసీని అడిగి దానిని మార్చుకునే అవకాశం ఉంటుంది.
ప్రయాణీకులు బెర్త్ ఎంపిక ఇవ్వగలరా?
భారతీయ రైల్వే.. ప్రయాణీకులకు బెర్త్ ను ఎంచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నది. టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. మీరు కూడా రైలు టిక్కెట్ ను బుక్ చేసుకునే సమయంలో లోయర్ బెర్త్ ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. అప్పటికే లోయర్ బెర్త్ సీట్లు కన్ఫామ్ కాకపోతే, మీకు కేటాయించే అవకాశం ఉంటుంది. ఒకవేళ వేరే ప్రయాణీకులకు బుక్కై, క్యాన్సిల్ చేసుకున్నా మీకు వాటిని కేటాయిస్తారు.