Dishotstar JioCinema JioHotstar App | స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 సంస్థల విలీన ప్రక్రియ పూర్తయింది. ఈ విలీనం తర్వాత ‘జియోస్టార్’ పేరుతో ఒక కొత్త జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు వీటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లైన జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్లను కూడా ఒకే వేదిక కిందకు తీసుకువచ్చారు. ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ను ‘జియోహాట్‌స్టార్ (JioHotstar)’ అనే పేరుతో శుక్రవారం ప్రారంభించారు. ఈ విషయాన్ని కంపెనీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈ ప్లాట్‌ఫామ్‌కు రూ.149 నుంచి ప్రారంభమయ్యే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది.
‘‘3 లక్షల గంటల ఎంటర్‌టైన్‌మెంట్, లైవ్ స్పోర్ట్స్ కవరేజీ.. 50 కోట్లకు పైగా యూజర్లతో ఇకపై ‘జియోహాట్‌స్టార్’ ప్రేక్షకులను మరింతగా ఆకర్షిస్తుంది. ప్రస్తుతం జియో సినిమా (JioCinema), డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) సబ్‌స్క్రైబర్లు ఈ కొత్త సేవలను సజావుగా కొనసాగించవచ్చు. జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకోవచ్చు’’ అని కంపెనీ తన ప్రకటనలో తెలిపింది.
ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై ప్రభావం
విలీనమైన జియోస్టార్ ఓటీటీ ఇప్పుడు ఇతర సబ్‌స్క్రిప్షన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లను గట్టిగానే పోటీ ఇవ్వబోతోంది. ఎందుకంటే హాలీవుడ్ సినిమాలతో పాటు 50 కోట్ల మంది యూజర్లకు జియో హాట్‌స్టార్ అన్ని రకాల కంటెంట్‌ను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పిస్తోంది. అంటే.. ఇతర ఓటీటీల్లో సబ్‌స్క్రిప్షన్‌తో చూసే కంటెంట్‌ను జియో హాట్‌స్టార్‌లో ఉచితంగా చూడవచ్చు. అయితే, వినియోగదారులు నెలలో పరిమిత సంఖ్యలో కంటెంట్‌ను వీక్షించవచ్చు. జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్లాన్స్‌ను కూడా సంస్థ ప్రకటించింది. ఇవి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి అగ్ర ఓటీటీ సంస్థల కంటే చౌకగా ఉన్నాయి.
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ల ప్లానస్ పోల్చితే..
ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ రూ.149 నుంచి ప్రారంభమవుతాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
మొబైల్ ప్లాన్ (యాడ్స్ ఉంటాయి): ప్రారంభ ధర రూ.149. ఇది 3 నెలల వ్యాలిడిటీతో ఉంటుంది. ఏడాది వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.499. ఈ ప్లాన్ ద్వారా కేవలం ఒక మొబైల్‌లో మాత్రమే కంటెంట్ చూడగలరు.
సూపర్ ప్లాన్ (యాడ్స్ ఉంటాయి): ఈ ప్లాన్ రెండు డివైజ్‌లకు సపోర్ట్ చేస్తుంది. 3 నెలల వ్యాలిడిటీతో ఉన్న ఈ ప్లాన్ ధర రూ.299. ఏడాది వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.899.
ప్రీమియం ప్లాన్ (యాడ్‌లు ఉండవు): ఈ ప్లాన్ ప్రకటనలు లేకుండా కంటెంట్‌ను వీక్షించే అవకాశాన్ని అందిస్తుంది. నెలకు రూ.299తో ప్రారంభమయ్యే ఈ ప్లాన్, 3 నెలలకు రూ.499, ఏడాది వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.1499. ఈ ప్లాన్ ద్వారా నాలుగు డివైజ్‌లలో కంటెంట్‌ను వీక్షించవచ్చు.
ఇప్పటివరకు ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించిన అభిమానులకు, ఇకపై ఆ అవకాశం లేదు. హాట్‌స్టార్, జియో కలిసి జియోహాట్‌స్టార్ పేరిట విలీనం అయిన తర్వాత, ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా చూడటం సాధ్యం కాదు. దీనికోసం కనీసం రూ.149 ప్లాన్‌తో సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: ఫాస్టాగ్ కొత్త నిబంధనలు ఇవే.. తెలుసుకోండి లేకపోతే భారీ జరిమానా!
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాన్:
నెలకు: రూ.299 , 3 నెలలకు: రూ.599, సంవత్సరానికి: రూ.1499
వార్షిక ప్రైమ్ లైట్: రూ.799 (ప్రైమ్ రీడింగ్, ప్రైమ్ గేమింగ్, ప్రైమ్ వీడియో యాక్సెస్ మినహా అన్ని ప్రైమ్ బెనిఫిట్స్ ఒక డివైజ్‌కే పరిమితం)
నెట్‌ఫ్లిక్స్:
మొబైల్ (480పీ): నెలకు రూ.149. ఒకేసారి ఒక డివైజ్‌లో ఒక యూజర్ మాత్రమే కంటెంట్‌ను వీక్షించవచ్చు.
బేసిక్ (720పీ): నెలకు రూ.199. మొబైల్, కంప్యూటర్, టీవీ, టాబ్లెట్‌తో సహా ఒకేసారి ఒక డివైజ్‌లో మాత్రమే చూడగలరు.
స్టాండర్డ్ (1080పీ): నెలకు రూ.499. ఒకేసారి రెండు డివైజ్‌లలో ఇద్దరు యూజర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు.
ప్రీమియం (4కె + హెచ్‌డిఆర్): నెలకు రూ.649. ఒకేసారి నాలుగు డివైజ్‌లలో నలుగురు యూజర్స్ కంటెంట్‌ను వీక్షించవచ్చు.
జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ విలీనం అవుతాయన్న వార్తలు బయటకు వచ్చినప్పటినుంచి అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. జియోహాట్‌స్టార్ పేరుతో కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్ అవతరించబోతోందని వార్తలు రావడం, ఆ డొమైన్ తనదేనంటూ ఒక యాప్ డెవలపర్ ముందుకు రావడం, తన చదువుకయ్యే ఖర్చు రిలయన్సే భరించాలంటూ పేర్కొనడం అందరికీ తెలిసిందే. ఓ దశలో తక్కువ మొత్తానికే తన డొమైన్ రిలయన్స్‌కు ఇస్తానని చెప్పి ఆ తరువాత ఒక్కసారిగా ఆ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత యూఏఈకి చెందిన ఇద్దరు చిన్నారులు తెరపైకి రావడం, ఈ డొమైన్‌ను ఉచితంగా ఇస్తామని ప్రకటించడం చర్చనీయాంశమయ్యాయి.
ఈ నేపథ్యంలో జియోహాట్‌స్టార్ డొమైన్ వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పెడుతూ, వయాకామ్ 18 మరియు స్టార్ ఇండియా కలిసి ‘జియోస్టార్’ అనే జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ఇప్పుడు ఈ వెంచర్ కిందే ‘జియోహాట్‌స్టార్’ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే ఇకపై జియో సినిమా మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌లోని కంటెంట్ అంతా ఒకేచోట దర్శనమిస్తుంది.