New Financial Rules July 2025| జూలై 2025 నుండి బ్యాంకు కస్టమర్లు, రైలు ప్రయాణికులు మరియు ఈపీఎఫ్ సభ్యులపై ప్రభావం చూపే కొన్ని ముఖ్యమైన ఆర్థిక మరియు సేవా సంబంధిత మార్పులు అమలులోకి వస్తున్నాయి. ఇండియన్ రైల్వే ఆన్‌లైన్ తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఆధార్ ఆధారిత ధృవీకరణను తప్పనిసరి చేసింది. ఈ కొత్త నియమాలు జూలై నెలలో దశలవారీగా అమలులోకి వస్తాయి. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఈపీఎఫ్‌వో వంటి సంస్థలు ఏటీఎం ఫీజులు, సేవా ఛార్జీలు, యూఏఎన్ యాక్టివేషన్ గడువులను సవరించాయి. జూలై 2025 నుండి అమలులోకి వచ్చే ఆర్థిక మార్పుల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
1. యాక్సిస్ బ్యాంక్ ఫీజు మార్పులు
జూలై 1, 2025 నుండి యాక్సిస్ బ్యాంక్ తన సేవింగ్స్, ట్రస్ట్ అకౌంట్‌ల కోసం కొత్త ఫీజులలో మార్పులు చేసింది. ఈ మార్పులు సేవింగ్స్, ఎన్‌ఆర్‌ఐ, ట్రస్ట్ అకౌంట్‌లు, ప్రైయారిటీ, బర్గండీ కస్టమర్లను ప్రభావితం చేస్తాయి. ఉచిత లిమిట్ మించిన ఏటీఎం లావాదేవీల (క్యాష్ విత్‌డ్రాయల్, బ్యాలెన్స్ ఎంక్వైరీ) ఫీజు రూ. 21 నుండి రూ. 23కి పెరుగుతుంది. ఈ రూ. 2 పెరుగుదల అన్ని ఫైనాన్షియల్ లావాదేవీలకు వర్తిస్తుంది.
2. తత్కాల్ టికెట్ బుకింగ్‌లో ఆధార్ ధృవీకరణ
జూలై 1, 2025 నుండి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా తత్కాల్ టికెట్‌లు బుక్ చేయాలంటే ఆధార్ ధృవీకరణ తప్పనిసరి. యూజర్లు తమ ఐఆర్‌సీటీసీ ప్రొఫైల్‌కు ఆధార్ నంబర్‌ను లింక్ చేసి ధృవీకరించాలి. జూలై 15, 2025 నుండి ఆన్‌లైన్ తత్కాల్ బుకింగ్‌లకు ఆధార్ ఆధారిత ఓటీపీ ధృవీకరణ అవసరం. అధీకృత ఏజెంట్లు బుకింగ్ విండో తొలి 30 నిమిషాలలో తత్కాల్ టికెట్‌లు బుక్ చేయలేరు. అదే రోజు నుండి, కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్‌ఎస్) కౌంటర్లు మరియు ఏజెంట్ల ద్వారా బుక్ చేసే తత్కాల్ టికెట్‌లకు ఓటీపీ ధృవీకరణ కావాలి.
3. ఐసీఐసీఐ బ్యాంక్ సేవా ఛార్జీలు
ఐసీఐసీఐ బ్యాంక్ జూలై 1, 2025 నుండి తమ సేవా ఛార్జీలను సవరించింది. డిమాండ్ డ్రాఫ్ట్‌లు, ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంలు కాని ఏటీఎంలలో లావాదేవీలు, క్యాష్ డిపాజిట్, విత్‌డ్రాయల్ సేవలు, డెబిట్ కార్డ్ ఫీజులపై కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. ఈ మార్పులు మెట్రో మరియు నాన్-మెట్రో నగరాలలోని కస్టమర్లను ప్రభావితం చేస్తాయి.
4. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు
ప్రభుత్వం జూలై నుండి సెప్టెంబర్ వరకు చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రకటిస్తుంది. ఈ రేట్లు.. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, ఇతర పథకాలపై ప్రభావం చూపుతాయి.
5. ఎచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్
ఎచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ఛార్జీలు కూడా పెరుగనున్నాయి. పేటీఎం, ఫోన్‌పే వంటి థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా చెల్లింపులకు 1 శాతం ఫీజు వసూలు చేస్తారు. అదనంగా, యుటిలిటీ బిల్లుల చెల్లింపులకు అదనపు ఛార్జీలు వర్తిస్తాయి.
6. పాన్ కార్డ్ కోసం ఆధార్ కార్డ్ తప్పనిసరి
జూలై 1, 2025 నుండి పాన్ కార్డ్ విధానంలో పెద్ద మార్పు వస్తోంది. మీడియా నివేదికల ప్రకారం.. పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డ్ తప్పనిసరి. ఒకవేళ మీ పాన్ కార్డ్ ఆధార్‌తో లింక్ కానట్లయితే, డిసెంబర్ 31, 2025 వరకు లింక్ చేయవచ్చు. కొందరు ఒకే వ్యక్తి పేరిట ఎక్కువ పాన్ కార్డ్‌లు తీసుకుని లేదా వేరొకరి పేరుతో పాన్ కార్డ్‌లు సృష్టించి పన్ను చెల్లింపుల్లో ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మోసాలను నివారించడానికే ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
Also Read: గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు అలర్ట్.. త్వరలోనే కొత్త ఛార్జీలు వసూలు
7. ఎల్‌పీజీ సిలిండర్ ధరలు
ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ సంస్థలు ఎల్‌పీజీ సిలిండర్ ధరలను సవరిస్తాయి. ఇందులో గృహ, వాణిజ్య సిలిండర్‌లు ఉన్నాయి. కొత్త ధరల కోసం గ్యాస్ ఏజెన్సీల ప్రకటనలు చేసే అవకాశం ఉంది.