UPI Number Verification Fees| గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం వంటి యుపిఐలు ఇకపై యూజర్ల నుంచి కొత్త ఛార్జీలు వసూలు చేయవచ్చు. టెలికాం విభాగం (DoT) మొబైల్ నంబర్లతో సంబంధం ఉన్న మోసపూరిత కార్యకలాపాలను తగ్గించేందుకు సైబర్ భద్రతా నిబంధనలలో మార్పులను ప్రతిపాదించింది. జూన్ 24న ప్రచురించిన డ్రాఫ్ట్ సైబర్ భద్రతా నిబంధనల ప్రకారం.. మొబైల్ నంబర్ ధృవీకరణ కోసం కొత్త వేదికను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొంచారు. ఈ వేదికలో బ్యాంకులు వంటి ఆర్థిక సంస్థలు కూడా ఉంటాయి. ఇవి UPI లావాదేవీల వంటి లావాదేవీల సమయంలో కస్టమర్ గుర్తింపు కోసం మొబైల్ నంబర్లను ఉపయోగిస్తాయి. ఈ కొత్త విధానం “MNV ప్లాట్‌ఫామ్” (మొబైల్ నంబర్ వెరిఫికేషన్ ప్లాట్‌ఫామ్)ను కలిగి ఉంటుంది. ఈ వేదిక ద్వారా అనుమతి పొందిన సంస్థలు, లైసెన్స్‌దారులు ఒక మొబైల్ నంబర్ అధీకృత డేటాబేస్‌లో ఉందా లేదా అని ధృవీకరించగలరు.
కొత్త నిబంధనలో ఛార్జీల ప్రతిపాదన
కొత్త నిబంధన ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాలచే అధీకృతమైన సంస్థ నిర్వహించే టెలికాం డేటాబేస్‌లో మొబైల్ నంబర్ స్టేటస్ ని ధృవీకరించడానికి ఒక్కో అప్లికేషన్‌కు 1.5 రూపాయల రుసుము విధించాలని ప్రతిపాదించారు. ఇతర సంస్థలు మొబైల్ నంబర్ ధృవీకరణ కోసం 3 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ రుసుమును చివరికి ఎవరు చెల్లిస్తారనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. కానీ వినియోగదారులే ఈ రుసుమును చెల్లించే అవకాశం ఎక్కువగా ఉంది.
డ్రాఫ్ట్‌పై అభిప్రాయాల సేకరణ
టెలికాం విభాగం ఈ డ్రాఫ్ట్‌పై సంబంధిత వర్గాల నుండి 30 రోజులలోపు అభిప్రాయాలను ఆహ్వానించింది. కొత్త నిబంధనలు అమలులోకి వస్తే.. ప్రభుత్వం అధీకృత ఏజెన్సీలు, చట్ట అమలు సంస్థలు టెలికాం రంగం కాని సంస్థల నుండి వ్యక్తుల లావాదేవీ వివరాలను సేకరించే అధికారం పొందుతాయి.
పైలట్ ప్రాజెక్ట్ ఇప్పటికే మొదలు
ఒక బ్యాంకు ఈ కొత్త విధానాన్ని పరీక్షించడానికి ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ద్వారా మోసపూరిత లావాదేవీలలో పాల్గొన్న నంబర్లను గుర్తించవచ్చు. గుర్తించబడిన ఏదైనా నంబర్ 90 రోజుల పాటు డియాక్టివేట్ చేయబడుతుంది, ఆ తర్వాత దాని హిసర్టీ ఆటోమెటిక్ గా డెలీట్ అయిపోతుంది. దీని వల్ల ఆ నంబర్‌ను తర్వాత తీసుకున్న వ్యక్తికి ఎటువంటి సమస్య ఉండదు.
Also Read: ఆదాయాన్ని మింగేస్తున్న ఖర్చులు.. ఈఎంఐ ఉచ్చులో భారతీయులు
కొత్త నిబంధనల ప్రభావం
ఈ కొత్త నిబంధనలు మోసాలను తగ్గించడంలో సహాయపడవచ్చు, కానీ వినియోగదారులపై ఈ ఛార్జీల భారం పడే అవకాశం ఉంది. UPI లాంటి సేవలను ఉపయోగించే వారు ఈ ధృవీకరణ రుసుమును చెల్లించాల్సి రావచ్చు. ఈ నిబంధనలు అమలులోకి వస్తే.. బ్యాంకులు మరియు ఇతర సంస్థలు మొబైల్ నంబర్ల ధృవీకరణ కోసం కొత్త విధానాలను అనుసరించాల్సి ఉంటుంది. ఈ మార్పులు సైబర్ భద్రతను మెరుగుపరచడంతో పాటు, లావాదేవీలలో పారదర్శకతను పెంచే అవకాశం ఉంది. అయితే, ఈ ఛార్జీల విధానం వినియోగదారులకు ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.