One State One RRB: భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకింగ్ సేవలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1, 2025 నుంచి దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఒకే ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ (RRB) మాత్రమే పనిచేస్తుంది. ఇది గ్రామీణ బ్యాంకింగ్ రంగంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన సంస్కరణగా పరిగణించబడుతుంది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 11 రాష్ట్రాల్లోని 15 RRBలు విలీనానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏకీకరణలో నాల్గో దశగా జరుగుతుంది. విలీనం అనంతరం దేశంలోని RRBల సంఖ్య ప్రస్తుత 43 నుంచి 28కి తగ్గనుంది.
పరిపాలనలో పారదర్శకత
ఈ చర్య ద్వారా కేంద్ర ప్రభుత్వం “ఒక రాష్ట్రం – ఒక గ్రామీణ బ్యాంక్” అనే లక్ష్యాన్ని సాకారం చేయాలనే దిశగా చర్యలు తీసుకున్నారు. ఈ సంస్కరణ గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవల అందుబాటును పెంచడమే కాకుండా, పరిపాలనలో పారదర్శకతను, సేవల సమర్థతను పెంచేలా దోహదపడనుంది.
ఏ రాష్ట్రాల్లో ఏకీకరణ జరుగుతోంది?
ఈ నూతన వ్యవస్థ ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ వంటి 11 రాష్ట్రాల్లో అమలుకానుంది. ఈ రాష్ట్రాల్లో పనిచేస్తున్న వివిధ RRBలు ఒక్కొక్కటి ఒక్కే బ్యాంకుగా విలీనం చేయబడతాయి.
ఆంధ్రప్రదేశ్:
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న నాలుగు RRBలు:
-చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్
-ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్
-సప్తగిరి గ్రామీణ బ్యాంక్
-ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్
-ఇవి విలీనం చెయ్యబడి ఒకే బ్యాంకుగా “ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్” పేరుతో ఏర్పాటవుతుంది. స్పాన్సర్ బ్యాంకులు: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
Read Also: Xiaomi Summer Sale 2025: సమ్మర్ సేవింగ్స్..అద్భుతమైన …
ఉత్తరప్రదేశ్:
-బరోడా యుపి బ్యాంక్
-ఆర్యవర్ట్ బ్యాంక్
-ప్రథమ యుపి గ్రామీణ బ్యాంక్ ఇవి కలిపి “ఉత్తరప్రదేశ్ గ్రామీణ బ్యాంక్”గా ఏర్పడుతుంది. లక్నో ప్రధాన కార్యాలయంగా ఉంటుంది. స్పాన్సర్: బ్యాంక్ ఆఫ్ బరోడా.
పశ్చిమ బెంగాల్:
-బంగియా గ్రామీణ వికాస్
-పశ్చిమ బెంగాల్ గ్రామీణ బ్యాంక్
-ఉత్తర్‌బాంగ్ RRB ఇవి ఒకే బ్యాంకుగా విలీనం చెయ్యబడి “పశ్చిమ బెంగాల్ గ్రామీణ బ్యాంక్”గా రూపాంతరం చెందుతుంది.
బీహార్:
-దక్షిణ బీహార్ గ్రామీణ బ్యాంకు
-ఉత్తర బీహార్ గ్రామీణ బ్యాంకు కలిపి “బీహార్ గ్రామీణ బ్యాంక్”గా ఏర్పాటవుతుంది. ప్రధాన కార్యాలయం పాట్నాలో ఉంటుంది.
గుజరాత్:
-బరోడా గుజరాత్ గ్రామీణ బ్యాంక్
-సౌరాష్ట్ర గ్రామీణ బ్యాంక్ కలిపి “గుజరాత్ గ్రామీణ బ్యాంక్”
మిగిలిన రాష్ట్రాలు:
కర్ణాటక, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోనూ ఇదే విధంగా రెండు లేదా మూడింటిని కలిపి ఒక్క RRBగా తీర్చిదిద్దుతున్నారు.
ఆర్థిక ఫలితాలు, మార్పులు
ఈ విలీన ప్రక్రియ తర్వాత: ప్రతి RRBకి రూ. 2,000 కోట్ల అధీకృత మూలధనం ఉంటుందనే నిబంధన విధించబడింది. బ్యాంకింగ్ సేవలు మరింత విస్తృతంగా అందుబాటులోకి వస్తాయి. నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. ఆధునిక సాంకేతికతను ఏకీకృతంగా వినియోగించుకునే అవకాశం పెరుగుతుంది.
ఈ మార్పుల వల్ల లబ్ధి ఎవరికి?
గ్రామీణ వినియోగదారులకు: సింగిల్ బ్యాంక్ ఉన్నందున సేవలు మరింత తేలికగా, సమర్థవంతంగా అందుతాయి. సేవల నాణ్యత పెరుగుతుంది, అందుబాటు మెరుగవుతుంది. బ్యాంకుల సంఖ్య తగ్గించినా, సేవల విస్తరణ మాత్రం ఎక్కువయ్యేలా ప్రణాళికలు రూపొందించారు.