Pakistan Stock Market Crash: ఉగ్రవాదాన్ని తన పెరట్లో మొక్కలాగా పెంచి పోషిస్తున్న పాక్‌కు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఫిక్స్ అయ్యింది భారత్. దాయాది దేశానికి ఎన్ని విధాలుగా షాక్ ఇవ్వాలో అన్ని అవకాశాలను వాడేసుకోంటుంది. ఇద్దరు వ్యక్తులు చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు పాక్‌కు కష్టాలతో పాటు నష్టాలు కూడా ప్రారంభమయ్యాయి.
ఇక భారత్ దెబ్బకు పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఏకంగా వెబ్‌సైట్‌నే ఆఫ్‌లైన్‌లో పెట్టేసే పరిస్థితి వచ్చింది. ప్రధాని మోడీ చేసిన ఈ వ్యాఖ్యల్లో ఎక్కడా పాకిస్థాన్ పేరెత్తలేదు. ఉగ్రవాదులు ఎక్కడ నక్కి ఉన్నా వేటాడుతామని హెచ్చరించారు మోడీ.. కలలో కూడా ఊహించని శిక్ష వేస్తామన్నారు. ఉగ్రవాదులే కాదు వారికి ఆశ్రయమిస్తున్న వారిని సైతం విడిచిపెట్టబోమంటూ తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఆయన ఎక్కడా ఏ దేశం పేరు ఎత్తలేదు. అసలు పాక్ మాట అయితే అసలే తీయలేదు. కానీ ఈ ఎఫెక్ట్ మాత్రం పాక్‌పై గట్టిగానే పడింది.
పాక్ స్టాక్ మార్కెట్లపై భారత్ దెబ్బ పడింది. పాకిస్థాన్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అక్కడ ఇన్వెస్టర్లు ఒత్తిడికి లోనయ్యారు. దీంతో KSE-100 ఇండెక్స్ 2 శాతం పడిపోయింది. మొదటి ఐదు నిమిషాల్లోనే 2 వేల 400 పాయింట్లకు పైగా పడిపోయింది KSE-100 ఇండెక్స్. ఒకానొక దశలో ట్రేడింగ్ నిలిపివేశారు. పాక్ స్టాక్ మార్కెట్ అధికారిక వెబ్‌సైట్ ఆఫ్‌లైన్‌కు వెళ్లిపోయింది. ఇండస్ నదీ ఒప్పందం, వీసాల విషయంలో కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకోవడం అక్కడ ప్రతికూలంగా మారాయి. అయితే గతంతో పోలిస్తే ఈ నష్టాలు తక్కువే అంటున్నారు నిపుణులు.
మాములుగానే ప్రస్తుతం పాకిస్థాన్ గడ్డు పరిస్థితులను ఎదుర్కోంటోంది. పాకిస్థాన్ జీడీపీ వృద్ధి అంచనాలను వరల్డ్ బ్యాంక్ 2.6 శాతానికి తగ్గించింది. దీంతో బుధవారమే అక్కడి స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. లెటెస్ట్‌గా దీనికి కేంద్రం తీసుకున్న నిర్ణయాలు కూడా తోడవ్వడంతో మరింత ఒత్తిడికి లోనయ్యారు. దీంతో నష్టాలు తప్పలేదు పాక్ స్టాక్ మార్కెట్‌కు.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, వాఘా-అటారీ సరిహద్దు వద్ద వాణిజ్యాన్ని మూసివేయడం, సార్క్ వీసా మినహాయింపులను రద్దు చేయడం వంటి కఠిన చర్యలను ప్రకటించింది. దీనికి తోడు పాకిస్థాన్ కూడా తమ గగనతలాన్ని భారత విమానాలకు మూసివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఇప్పటికే ఆర్థిక సవాళ్లతో సతమతమవుతున్న పాకిస్థాన్‌కు, అంతర్జాతీయ ద్రవ్య నిధి వృద్ధి రేటు అంచనాలను ఈ ఆర్థిక సంవత్సరానికి 2.6 శాతానికి తగ్గించడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ వరుస పరిణామాలు పెట్టుబడిదారులలో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.
కేంద్రం ఆంక్షలతో పాక్ కవ్వింపు చర్యలకు దిగింది. సింధూ జలాల ఒప్పందం నిలివేయడమే భారత్ యుద్ధాన్ని ప్రకటించడమేనని కామెంట్ చేసింది. ఆ దేశ సైనికులకు లీవ్స్ రద్దు చేసింది. దేనికైనా రెడీగా ఉండాలని సైన్యాన్ని ఆదేశించింది. పాక్ గగనతలంపై భారత్ విమానాలకు అనుమతి రద్దు చేసింది. సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నామని ప్రకటించింది. రెండు దేశాల ఆంక్షలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కశ్మీర్‌లో కేంద్రం భద్రతను పెంచింది. భారత్‌లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం దాడి జరిగిన తర్వాత కేంద్రానికి అందింది. దీంతో సైన్యం అనుమానికి ప్రాంతాల్లో జల్లెడపడుతుంది.
Also Read: పాకిస్థాన్ మిస్సైల్ టెస్ట్.. భారత్ అలర్ట్.. ఏ క్షణంలోనైనా..
ఇదిలా ఉంటే.. భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పులు జరిగాయి. శత్రు సైన్యానికి భారత ఆర్మీ గట్టిగా బదులిస్తోంది. నలుగురు పాక్ సైనికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇండియన్ ఆర్మీ సైడ్ ఎలాంటి ప్రాణ నష్టం లేదు.