BigTV English

Pahalgam Terror Attack: పాకిస్థాన్ మిస్సైల్ టెస్ట్.. భారత్ అలర్ట్.. ఏ క్షణంలోనైనా..

Pahalgam Terror Attack: పాకిస్థాన్ మిస్సైల్ టెస్ట్.. భారత్ అలర్ట్.. ఏ క్షణంలోనైనా..

Pahalgam Terror Attack: గంట గంటకూ పరిస్థితులు మరింత ఉత్కంఠంగా మారుతున్నాయి. పహల్గామ్ ఉదంతంపై పాకిస్తాన్ బుకాయిస్తున్నప్పటికీ.. భారత్ మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఈసారి ఎవ్వర్నీ వదిలిపెట్టేది లేదని కచ్చితంగా చెప్పేసింది. దేశ స్ఫూర్తిని దెబ్బతీస్తే.. ప్రతిస్పందన ఎలా ఉంటుందో ఉగ్రవాదులకు, వాళ్ల వెనకున్నవాళ్లకు ఇప్పుడు తెలుస్తుందని చెప్పింది. త్రివిద దళాలను అప్రమత్తం చేసింది. అటు పాకిస్తాన్ కూడా సైనికపరంగా సంసిద్ధమవుతోంది. ఇంతకీ, పహల్గామ్ దాడుల తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలు ఏంటీ..? పాకిస్తాన్ తాజా మిస్సైల్ టెస్ట్.. పాక్ ప్రధాని నేషనల్ సెక్యూరిటీ కమిటీ మీటింగ్ వెనుక అర్థం ఏంటీ..? రాబోయే రోజుల్లో ఏం జరగనుంది..?


పహల్గామ్‌లో తీవ్రవాదులు చేసిన విధ్వంసం

ఎవ్వరూ ఊహించని అత్యంత పాశవికమైన ఉగ్రదాడికి యావత్ భారతదేశం ఉలిక్కిపడింది. అద్భుతమైన కశ్మీర్ అందాలను తిలకిస్తున్న పర్యాటకులపై విచక్షణారహితంగా జరిగిన దాడులకు 26 మంది ప్రాణాలు కోల్పాయారు. ఐదు నుండి ఏడుగురు తీవ్రవాదులు పహల్గామ్‌లో చేసిన విధ్వంసం కార్గిల్ నుండి కన్యాకుమారి వరకూ ప్రతి భారతీయుడి రక్తాన్ని మరిగిస్తోంది. కశ్మీర్ తీవ్రవాదాన్ని భూసమాధి చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. మతవాదం పులుముకున్న ఈ ఉగ్రవాద చర్యలను కూకటి వేళ్లతో పెకిలిస్తామని భారత ప్రధాని హామీ ఇచ్చారు. భారతదేశ స్ఫూర్తిని దెబ్బతీసిన ఉగ్రవాదుల్ని, వాళ్ల వెనుకున్న ఏ ఒక్కర్నీ వదలమని ప్రకటించారు. నిజానికి, ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనేది సుస్పష్టంగా అర్థం అవుతోంది.


పాకిస్తాన్ తాజాగా మిస్సెల్ పరీక్షలు ఎందుకు చేపట్టింది?

కొన్ని రోజుల క్రితం పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేసిన రెచ్చ గొట్టే వ్యాఖ్యలు.. కశ్మీర్ తీవ్రవాదులన్ని మరింత ఉసిగొల్పాయన్నది వాస్తవం. అయితే, దాడి జరిగిన రోజే పాకిస్తాన్ మాత్రం బుకాయించింది. కశ్మీర్‌లో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెబల్స్ చేసిన చర్యను పాకిస్తాన్‌పై రుద్దడం భారత్‌కు అలవాటయ్యిందని పాత పాటే పాడింది. అదే నిజమైతే.. పాకిస్తాన్ తాజాగా మిస్సెల్ పరీక్షలు ఎందుకు చేపట్టింది..? బోర్డర్‌లో పాక్ సైన్యాన్ని, వైమానికి దళాన్ని ఎందుకు అప్రమత్తం చేసింది..? నిరాటంకంగా పాకిస్తాన్ సి-130హెచ్ విమానాలు ఆకాశంలో ఎందుకు ఎగిరాయి..? పాక్ ప్రధాని నేషనల్ సెక్యూరిటీ కమిటీ మీటింగ్ ఎందుకు నిర్వహించారు..? అందుకే, భుజాలు తడుముకుంటున్నవారికి బుద్ది చేప్పడానికి భారత్ కూడా రెడీ అయ్యింది.

ఏప్రిల్ 22, 2025 మధ్యాహ్నం పహల్గామ్ ఉగ్రవాద దాడి

ఏప్రిల్ 22, 2025 మధ్యాహ్నం జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిపై భారత్ ప్రతీకారం తీర్చుకోడానికి అన్ని విధాలుగా సిద్ధం అవుతోంది. విదేశీ పర్యటనను మధ్యలోనే ముగించుకొచ్చిన భారత ప్రధాని మోడీ అత్యవసర మీటింగ్ తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంది. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశంలో ప్రధాని మోడీ అధ్యక్షతన తీసుకున్న ఐదు ఇందులో కీలకంగా మారాయి. ముఖ్యంగా, 1960లో ఇరు దేశాల మధ్య జరిగిన సింధు జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేసారు.

అటారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను మూసివేత

కశ్మీర్‌లో ఉగ్రదాడులకు పాకిస్తాన్ మద్దతు ఇస్తున్నందుకు ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. అయితే, ఈ దెబ్బతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలం కానుంది. మరోవైపు, అటారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను మూసివేస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది. ఈ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ను తక్షణమే మూసివేశారు. మే 1, 2025 లోపు అనుమతులు ఉన్నవారు మాత్రమే ఈ మార్గం ద్వారా తిరిగి వెళ్తారు. తర్వాత, నో ఎంట్రీ ప్రకటించింది.

పాకిస్తానీ పౌరులకు భారత్‌లోకి ప్రవేశం నిషేధం

ఇక, పాకిస్తానీ పౌరులకు ఇప్పుడు భారత్‌లోకి ప్రవేశం నిషేధం. సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్తానీ పౌరులకు భారత్‌లోకి ప్రవేశం నిషేధించారు. ప్రస్తుతం భారత్‌లో ఉన్న పాకిస్తానీలు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. అలాగే, పాకిస్తాన్ హైకమిషన్‌లోని రక్షణ సలహాదారులను వెళ్లగొట్టే చర్యలు తీసుకున్నారు. వీరిని పర్సోనా నాన్ గ్రాటా.. అంటే, స్వీకారానికి అనర్హులుగా ప్రకటించారు. అలాగే, ఇస్లామాబాద్‌లో ఉన్న భారత సలహాదారులను కూడా తిరిగి భారతదేశానికి రప్పించారు.

భారత సైన్యానికి, భద్రతా బలగాలన్నింటీ హై అలెర్ట్

మరోవైపు, సరిహద్దుల్లో అధిక భద్రతను భారీగా పెంచారు. భారత సైన్యానికి, భద్రతా బలగాలన్నింటీ హై అలెర్ట్ ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఇప్పటి వరకూ భారత్ తీసుకున్న ఈ చర్యలు పాకిస్తాన్‌పై దౌత్యపరమైన, ఆర్థిక ఒత్తిడిని పెంచాయి. అయితే, ఇవి ఇంతటితో ఆగవు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినందుకు పాకిస్తాన్ మూల్యం చెల్లించేలా చేయడం లక్ష్యంగా భారత్ మరిన్న కఠిన నిర్ణయాలు తీసుకోనుంది.

పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తం

అయితే, భారత్ ఇలా స్పందిస్తుందని పాకిస్తాన్‌కు తెలియంది కాదు. గతంలో ఉరి దాడులు, పుల్వామా దాడుల తర్వాత భారతదేశ ఉక్రోషాన్ని పాక్ రుచి చూసింది. పీఓకేలోకి చొరబడిన భారత భద్రతా దళాల సామర్థ్యాన్ని అంచనా వేసింది. అందుకే, పహల్గామ్ దాడుల తర్వాత పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అత్యవసరంగా నేషనల్ సెక్యూరిటీ కమిటీ మీటింగ్‌కు కాల్ చేశారు. తర్వాత, పాకిస్తాన్ తన వైమానిక రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేసింది. పూర్తి స్థాయిలో అంతా సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. అణ్వాయుధ భారతదేశంతో తీవ్రంగా మారబోతున్న ప్రమాదాన్ని తలుచుకుంటూ పాక్ వణికిపోతుంది. పహల్గామ్ మారణహోమంలో పాక్ హస్తం స్పష్టంగా ఉంది కాబట్టే ఆ దేశం ఇంతగా కంగారు పడుతోంది. ప్రస్తుతం, పూర్తి స్థాయి యుద్ధాన్ని ఊహించకపోయినప్పటికీ.. పలు రకాల సైనిక సంసిద్ధతకు పాక్ వ్యూహాలను రెడీ చేసుకుంటుంది. ఇక, తుది నిర్ణయం తీసుకోవడం మాత్రమే మిగిలుంది.

ఎంచుకున్న సమయంలో, ప్రదేశంలో భారత్ దాడులు

ప్రస్తుతం, ఇరు దేశాల మధ్య కమ్ముకున్న ఉద్రిక్త పరిస్థితులు ముందుకు సాగితే.. ప్రతీకార దాడులు మాత్రం భీకరంగా ఉండనున్నాయనడంలో సందేహం లేదు. అయితే, ఇందులో భారతదేశానిదే ముందంజ అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. భారత్ ఎంచుకున్న సమయంలో, ఎంచుకున్న ప్రదేశంలో దాడులు ఊహించని విధంగా ఉంటాయి. ఏప్రిల్ 23న జరిగిన ఉన్నత స్థాయి సమావేశాల తర్వాత ఇది చాలా స్పష్టంగా అర్థం అయ్యింది.

సరిహద్దు దాటి తీసుకునే ప్రతీకారానికి దృఢంగా రెడీ

జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై మోడీ ప్రభుత్వం.. సరిహద్దు దాటి తీసుకునే ప్రతీకారానికి దృఢంగా రెడీ అయినట్లు తెలుస్తోంది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా భారత వైమానికి దళంతో నిర్వహించిన కార్యక్రమంలో క్లియర్ కట్ సందేశం ఇచ్చారు. పహల్గామ్ ఊచకోతలో పాల్గొన్న ఉగ్రవాదులపైనే కాకుండా, భారత గడ్డపై ఈ దారుణమైన చర్యకు కుట్ర పన్నిన ఆర్కెస్ట్రాటర్లపై కూడా బలమైన చర్యలు ఉంటాయని వెల్లడించారు.

పాకిస్తాన్ అప్రమత్తంగా ఉండదని అనుకోలేని పరిస్థితి

అయితే, ఫిబ్రవరి 2019లో బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో.. లేదంటే, సెప్టెంబర్ 2016లో నియంత్రణ రేఖ వెంట, నాలుగు ‘ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను’ ధ్వంసం చేసిన ల్యాండ్-బేస్డ్ ‘సర్జికల్ స్ట్రైక్స్’ సమయంలో జరిగినట్లుగా… పాకిస్తాన్ అప్రమత్తంగా ఉండదని అనుకోలేము. ఈ విషయం భారత సైనిక ఉన్నతాధికారులకు కూడా అవగాహన ఉంది. ఇప్పుడు, భారీగా సన్నద్ధమైన పాకిస్తాన్ సైన్యాన్ని తోకముడిచేలా చేయడానికి అన్ని వైపుల నుండీ వ్యూహాలు రెడీ చేస్తున్నారు.

సుఖోయ్-30MKIS వంటి యుద్ధ విమానాలు సిద్ధం

ఇందులో ప్రతీ అడుగులో ఉండే లాభ నష్టాలను అంచనా వేస్తున్నారు. అందుకే, భారత్ తన ఫ్రెంచ్ ‘స్కాల్ప్’ ఎయిర్-టు-గ్రౌండ్ క్రూయిజ్ క్షిపణులు, ఇజ్రాయెల్ క్రిస్టల్ మేజ్ క్షిపణులు, స్పైస్-2000 ప్రెసిషన్ గైడెడ్ పెనెట్రేషన్ బాంబులు వంటి దీర్ఘ-శ్రేణి ఆయుధాలను ప్రయోగించే రాఫెల్, మిరాజ్-2000, సుఖోయ్-30MKIS వంటి యుద్ధ విమానాలను సిద్ధం చేసింది. అనుకుంటున్న లక్ష్యాలపై… జాగ్రత్తగా లిస్ట్ చేసిన ఖచ్చితమైన వైమానిక దాడులకు రెడీ అయ్యింది. ఇక, ఇప్పుడు ఫైనల్ ఆర్డర్ కోసం మాత్రమే అంతా వెయిటింగ్..!

పాకిస్తాన్ గతంలో చేసిన ‘ఆపరేషన్ స్విఫ్ట్ రిటార్ట్’

రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధం అనివార్యమైతే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వైమానిక దాడులతో మొదటి రోజు ఉధ్రేకాలు చూపించుకోవచ్చు. కానా, గతంలో బాలకోట్ దాడుల తర్వాత రోజు… పాకిస్తాన్ చేసిన ‘ఆపరేషన్ స్విఫ్ట్ రిటార్ట్’తో భారత వైమానిక దళానికి కూడా షాక్ తగలకపోలేదు. ఆపరేషన్ స్విఫ్ట్ రిటార్ట్ అనేది పాకిస్తాన్ వైమానిక దళం చేపట్టిన సైనిక చర్య. ఇందులో భాగంగా.. ఫిబ్రవరి 27, 2019న భారత్‌లోని జమ్మూ కాశ్మీర్‌లో ఆరు స్థానాలపై పాకిస్తాన్ వైమానిక దాడులను నిర్వహించింది. ఇది ఫిబ్రవరి 26, 2019న భారత వైమానిక దళం చేపట్టిన బాలాకోట్ వైమానిక దాడికి ప్రతీకార చర్యగా జరిగింది.

2019 కంటే మరింత బలపడిన భారత్ వైమానిక సామర్థ్యం

అయితే, ఈ రెండు సంఘటనలు 2019లో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తీవ్రతరం చేశాయి. ఇవి 1971 తర్వాత రెండు దేశాల వైమానిక దళాలు లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి దాడులు చేసుకున్న మొదటి సంఘటనలు. అయితే, ఇప్పుడు భారత్ గత అనుభవం నుండి పాఠాలు నేర్చుకుందని అనడంలో సందేహం లేదు. ఇకపోతే, భారత్ వైమానికి సామర్థ్యం 2019 కంటే మరింత బలపడింది. ప్రభుత్వం వైమానిక దాడులకు వెళ్లాలని నిర్ణయించుకుంటే పాకిస్తాన్ కౌంటర్ చర్యలను కూడా తిప్పికొట్టడానికి పూర్తిగా సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న 778 కి.మీ. నియంత్రణ రేఖ

భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న 778 కి.మీ. నియంత్రణ రేఖ వెంట.. పాకిస్తాన్‌తో కొనసాగుతున్న సీజ్ ఫైర్‌ను అతిక్రమించడం ఒక వ్యూహాత్మక ఎంపికే కావచ్చే. అయితే, ఇది ఫిబ్రవరి 2021 తర్వాత అడపాదడపా కొనసాగుతూనే ఉంది. ఇందులో, ఫిరంగి తుపాకులు, భారీ మోర్టార్లతో కాల్పులు జరుగుతున్నాయి. అలాగే, బోర్డర్ ఏరియాలో గస్తీకి అంతరాయం కలిగించడానికి రెండు వైపుల నుండీ స్నిపింగ్, ఇతర కార్యకలాపాలు ఉంటున్నాయి. అయితే, ఇవన్నీ అవతలి వైపు ఖర్చులను పెంచడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి.

ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లు నాశనం చేయడానికి భారత్ దాడులు

ఇప్పటికే పాక్‌ యుద్ధ విమానాలు కరాచీ నుంచి ఉత్తరాన ఉన్న వైమానిక స్థావరాలకు బయల్దేరినట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘కరాచీలోని దక్షిణ ఎయిర్‌ కమాండ్‌ నుంచి లాహోర్, రావల్పిండి సమీపంలోని స్థావరాల వైపుగా పాక్‌ వైమానిక దళ విమానాలు కదలాడుతున్నాయి. రావల్పిండిలో పాక్‌కు అత్యంత కీలకమైన నూర్‌ఖాన్‌ బేస్‌ ఉంది. ఇది భారత్‌ సరిహద్దు సమీపంలో ఉన్న స్థావరం’ అంటూ సోషల్‌ మీడియాలో పలువురు పోస్టులు పెట్టారు.

నియంత్రణ రేఖ వెంబడి ఉన్న 42 లాంచ్ ప్యాడ్‌లలో..

తాజా అంచనాల ప్రకారం, నియంత్రణ రేఖ వెంబడి ఉన్న 42 లాంచ్ ప్యాడ్‌లలో 110 నుండి 120 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వీరిలో 32 మంది పిర్ పంజాల్ లైన్‌కు దక్షిణంగా.. ఇంకో 10 మంది ఉత్తరాన ఉన్నట్లు అనుమానం. అందుకే, నియంత్రణ రేఖకు దగ్గరగా ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లే లక్ష్యంగా భారత్ మొదటి దశ దాడులకు రెడీ అవుతుందని తెలుస్తోంది. ఇక, ఈ దాడుల తీవ్రత విషయానికి వస్తే.. ఫిరంగి దాడులకు 90 కి.మీ పరిధి గల స్మెర్చ్, 45 కి.మీ పినాకా రాకెట్ వ్యవస్థలు, బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల వంటి సుదూర స్టాండ్ఆఫ్ ఆయుధాలను కూడా ఉపయోగించొచ్చని అంచనా వేస్తున్నారు. వీటి దాడి పరిధి 450 కి.మీ.లకు విస్తరించి ఉంది. ఒకవేళ, భారత్ ఈ దిశగా అడుగులు వేస్తే… పాకిస్తాన్ ప్రొటెక్షన్ చర్యల్లో భాగంగా ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

సరిహద్దులో స్మార్ట్ ఫెన్సింగ్ వ్యవస్థలను వేగవంతం

ప్రస్తుతానికైతే.. జమ్ము కశ్మీర్​ పహల్గామ్​లో జరిగిన ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో అప్రమత్త చర్యలు చేపట్టింది పాకిస్థాన్ ప్రభుత్వం. ఆర్మీతో పాటు ఎయిర్​ఫోర్స్, నేవీని అప్రమత్తం చేసింది. దీంతో పాటు క్షిపణి పరీక్షల కోసం పాకిస్థాన్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 24, 25 తేదీల్లో కరాచీ తీరం వెంబడి ఎకనామిక్ ఎక్ల్సూజివ్‌ జోన్‌లో భూతలం నుంచి భూతలం పైకి క్షిపణి ప్రయోగాలు నిర్వహించేందుకు పాకిస్థాన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 24-25తేదీల్లో 480 కిలోమీటర్ల మేర ఈ క్షిపణి పరీక్ష చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అరేబియా సముద్రంలో నో ఫ్లై జోన్​గా ప్రకటించడంతో పాటు జాలర్లను వేటకు వెళ్లొద్దని సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు పాకిస్థాన్​ క్షిపణి చర్యల నేపథ్యంలో భారత్ సైతం అప్రమత్తమైంది. పాక్ సరిహద్దులో జరిగే కార్యకలాపాలపైన నిశీతంగా పరిశీలిస్తున్నట్లు రక్షణ వర్గాలు చెబుతున్నాయి.

అధునాతన యాంటీ-ట్యాంక్ మిసైళ్లు..

మరోవైపు, భారత్ తన అధునాతన ఆయుధాలను LoC దగ్గర మోహరించింది. సరిహద్దు చెక్‌పోస్ట్‌లలో అధునాతన యాంటీ-ట్యాంక్ మిసైళ్లు, స్నిపర్ రైఫిల్స్, యాంటీ-డ్రోన్ జామర్లను మోహరించారు. ఇవి చొరబాట్లతో పాటు పాక్ నుండి వచ్చే డ్రోన్ దాడులను అడ్డుకోవడానికి ఉపయోగపడతాయి. ఇక, సరిహద్దు గ్రామాల్లోని స్థానికులతో భారత సైన్యం, BSFలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అనుమానాస్పద కార్యకలాపాల గురించి సమాచారం అందించమని కోరాయి. అలాగే, గ్రామ రక్షణ కమిటీలను బలోపేతం చేశారు.

అధునాతన రాడార్ వ్యవస్థలు, పెట్రోలింగ్ బోట్ల మోహరింపు

సరిహద్దు ప్రాంతాల్లోని సైనిక యూనిట్లకు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడం కోసం మాక్ డ్రిల్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఇక, పాకిస్తాన్‌ సరిహద్దు పంచుకుంటున్న గుజరాత్, పశ్చిమ తీరంలో సముద్ర మార్గంలో చొరబాట్లను నిరోధించడానికి కోస్ట్ గార్డ్, నౌకాదళం గస్తీని పెంచాయి. అధునాతన రాడార్ వ్యవస్థలు, పెట్రోలింగ్ బోట్లను మోహరించారు. కాగా, ఈ చర్యలు సరిహద్దు భద్రతను బలోపేతం చేయడంతో పాటు భవిష్యత్ ఉగ్రవాద దాడులు, పాకిస్తాన్ దూకుడు చర్యలకు అడ్డుకట్ట వేయనున్నాయి.

పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ సమావేశం

భారత్ తీసుకున్న దౌత్య, సైనిక నిర్ణయాలకు బదులుగా పాకిస్తాన్ కూడా సంసిద్ధం అవుతోంది. భారత్ తీసుకున్న కఠిన దౌత్య నిర్ణయాల తర్వాత, పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. ఈ సమావేశం భారత్ బాధ్యతారహిత్య చర్యలకు ప్రతిస్పందన అని అన్నారు. ఇందులో భాగంగా… భారత్‌తో అన్ని వాణిజ్య సంబంధాలను తక్షణమే నిలిపివేసింది. పాకిస్తాన్, తన వైమానిక పరిథిలో భారత విమానాల ఎగరకుండా నిషేధం విధించింది.

ఎంబ్రేయర్ ఫీనోమ్ 100 జెట్ PAF101 వంటి విమానాలు రెడీ

భారత రాయబారులను కూడా బహిష్కరించింది. అలాగే, ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ సిబ్బంది సంఖ్యను 30 మందికి తగ్గించాలని నిర్ణయించింది. లాహోర్, రావల్పిండి సమీపంలోని నార్త్-బేస్‌లకు సైనిక విమానాలను తరలించింది. అలాగే, లాక్‌హీడ్ C-130E హెర్క్యులస్ ట్రాన్స్‌పోర్ట్ విమానం PAF198, ఎంబ్రేయర్ ఫీనోమ్ 100 జెట్ PAF101 వంటి విమానాలను రెడీ చేసింది. అయితే, పాకిస్తాన్ తన చర్యలను భారత్ “అసమంజస” నిర్ణయాలకు ప్రతిస్పందన అని చెబుతున్నప్పటికీ… భారత్ ప్రతీకార చర్యలు ఎలా ఉంటాయో అనే సందేహం పాక్‌ను పట్టిపీడిస్తోంది.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×