September 1 Changes: ఆగస్టు నెల నుంచి సెప్టెంబర్ లోకి అడుగుపెట్టనున్న వేళ.. కొన్ని కీలక మార్పులు సామాన్యులకు భారంగా మారబోతున్నాయి. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 5 ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. వంటగ్యాస్, విమాన ప్రయాణాలు, కార్ల కొనుగోళ్లు ఇలా అనేక అంశాలపై ఇవి ప్రభావం చూపనున్నాయి. అసలు సెప్టెంబర్‌లో రాబోతున్న ఆ మార్పులేంటో ఈ కథనంలో చూద్దాం.
ప్రతి నెల మొదటి రోజున ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను రివ్యూ చేస్తాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 1న గ్యాస్ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఆగస్టు 1న 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.202 తగ్గించినప్పటికీ 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే ఈసారి గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర మారితే మాత్రం సామాన్యుల నెలవారీ బడ్జెట్‌పై నేరుగా ప్రభావం పడనుంది.
ఎల్పీజీ సిలిండర్ల ఈ-కేవైసీ ప్రక్రియకు ఆగస్టు 31వ తేదీని తుది గడువుగా ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం నిర్ణయించాయి. కాబట్టి ఆగస్టు 31లోపు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకుంటే బెటర్. లేదంటే సెప్టెంబర్ నుండి గ్యాస్ రీఫిల్ బుకింగ్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
సెప్టెంబర్ ప్రారంభంలో ఎయిర్‌లైన్స్ ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలను కూడా ఆయిల్ కంపెనీలు సవరించనున్నాయి. ఏటీఎఫ్ ధరలు పెరిగితే విమాన టిక్కెట్ల చార్జీలు మరింత భారంగా మారే అవకాశం ఉంది. వీటితో పాటు వాహనదారులు వాడే సీఎన్‌జీ (CNG), గృహాల్లో ఉపయోగించే పీఎన్‌జి (PNG) ధరలలో కూడా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
Also Read: అమ్మో.. దేశంలో ఒక్క బిడ్డను పెంచడానికి రూ.6.75 కోట్లా? ఈ లెక్కలు చూస్తే మైండ్ బ్లాకే!
కొత్తగా కారు కొనాలనుకునే వారికి సెప్టెంబర్ నెలలో నిరాశే ఎదురుకానుంది. టాటా మోటార్స్ తన లైనప్‌లోని కార్లు, ఎస్‌యూవీల (SUV) ధరలను సెప్టెంబర్ 1 నుంచి గరిష్టంగా రూ. 25,000 వరకు పెంచుతున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఈ ధరల పెంపు సాధారణ పెట్రోల్/డీజిల్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ (EV) వాహనాలకూ వర్తించనుంది.
సెప్టెంబర్ నుంచి విమాన ప్రయాణికులకు ఓ ఉపశమనం లభించబోతోంది. భారత్ నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులు ఇకపై ఇమిగ్రేషన్ కౌంటర్ల వద్ద బోర్డింగ్ పాస్‌లపై ఫిజికల్ స్టాంపింగ్ వేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలోని ఎలక్ట్రానిక్ బోర్డింగ్ పాస్ లేదా దాని కాపీని చూపించి సులభంగా ఇమిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ నిర్ణయం ద్వారా ఎయిర్‌పోర్ట్‌లలో వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గుతుంది.
Also Read: 60 ఏళ్ల వివాదానికి చెక్.. పైగా భూములపై ప్రభుత్వం గుడ్ న్యూస్.. రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్!