IIM Ahmedabad: ఐఐఎం అహ్మదాబాద్ క్యాంపస్‌లో ఎంబీఏ విద్యార్థిని వేధింపులకు గురైంది. యువతిపై ఫుడ్ డెలివరీ బాయ్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు అందిన కొన్ని గంటల్లో నిందితుడిని అరెస్టు చేశారు. ఇంతకీ ఘటన ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..
ఐఐఎం అహ్మదాబాద్ క్యాంపస్ గురించి చెప్పనక్కర్లేదు. అక్కడ చదివిన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా టాప్ కంపెనీల్లో ఉన్నతస్థాయిలో రాణిస్తున్నారు. అలాంటి క్యాంపస్‌లో ఎంబీఏ విద్యార్థిని వేధింపులకు గురైంది. నమ్మడానికి కాస్త విచిత్రంగా ఉన్నా, ముమ్మాటికీ నిజం. వస్త్రాపూర్ ప్రాంతంలో ఉన్న ఐఐఎం క్యాంపస్‌లో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మహిళల భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.
హాస్టల్‌లో ఉన్న ఓ ఎంబీఏ విద్యార్థిని, ఆన్‌లైన్ ద్వారా ఫుడ్ డెలివరీ చేసింది. ఫుడ్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్, కస్టమర్, సదరు స్టూడెంట్‌పై అసభ్యకరంగా, నీచంగా ప్రవర్తించాడు. అంతేకాదు ఏకాంతానికి సంబంధించి కొన్ని వెకిలి చేష్టలు చేశాడు. ఆ ఘటన ఆగస్టు 15న జరిగింది. సదరు బాధిత విద్యార్థిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వస్త్రాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు.
సదరు విద్యార్థిని ఐదు నెలలుగా ఐఐఎం కొత్త క్యాంపస్‌లో ఉంటోంది. ఆగస్టు 15న సాయంత్రం సుమారు 7 గంటలకు ఆన్‌లైన్ ఫుడ్ యాప్ ద్వారా ఆర్డర్ చేసింది. ఆ యాప్‌లో డెలివరీ బాయ్ పేరు నిపమ్ అని ఉంది. సీన్ కట్ చేస్తే.. రాత్రి సుమారు 8 గంటలకు ఆ విద్యార్థినికి గుర్తు తెలియని నంబర్ నుండి ఓ కాల్ వచ్చింది. ఆమె ఆ కాల్‌కు సమాధానం ఇవ్వలేదు. కొద్దిసేపటి తర్వాత ఫుడ్ ఆర్డర్‌కు సంబంధించిన కాల్ అనుకుని మరొక కాల్ లిఫ్ట్ చేసింది. కాల్ చేసిన వ్యక్తి తనను తాను డెలివరీ బాయ్‌గా పరిచయం చేసుకున్నాడు. ఆహారం తీసుకొచ్చానని, రెండో అంతస్తులో ఉన్నట్లు తెలిపాడు. ఆ విద్యార్థినిని పైకి రావాలని కోరాడు.
తాను మొదటి అంతస్తులో ఉన్నానని, అక్కడికి రావాలి విద్యార్థిని చెప్పడంతో డెలివరీ బాయ్ అక్కడకు వెళ్లాడు. తనను చూడగానే బాయ్ తన రూపం గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఫిర్యాదులో ప్రస్తావించింది. అందమైన దేవదూతలా ఉన్నావని అన్నట్లు పేర్కొంది. ఆ వ్యాఖ్యలు పట్టించుకోకుండా ఆర్డర్‌ను తీసుకోవడానికి విద్యార్థిని వెళ్లింది. డెలివరీ సమయంలో బాయ్ అసభ్యంగా ప్రవర్తించాడని అందులో ప్రస్తావించింది. ఆ సమయంలో డెలివరీ బాయ్ ప్యాంటు జిప్ ఓపెన్ చేసి ఉండటాన్ని గమనించింది. ఆ సమయంలో అసభ్యకరమైన వెకిలి చేష్టలు చేశాడని రాసుకొచ్చింది.
ఆకస్మిక సంఘటనతో ఆ విద్యార్థిని కలవరపడి, నిరసన చేయడంతో బాయ్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆర్డర్ తీసుకుని తన గదికి వెళ్లిపోయింది ఆ విద్యార్థిని. ఆ విద్యార్థిని తన స్నేహితులకు ఫోన్ చేసి జరిగిన సంఘటన గురించి చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత స్నేహితులు యువతి గదికి చేరుకున్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని ఐఐఎం యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చారు. ఆ విద్యార్థిని-సంస్థ అంతర్గత ఫిర్యాదుల కమిటీ, ఫ్రెండ్స్‌తో కలిసి వస్త్రాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
ALSO READ: ఎస్‌బిఐ క్లర్క్ జాబ్స్.. మొత్తం 7,680 జూనియర్ అసోసియేట్ పోస్ట్ ఉద్యోగ ఖాళీలు
ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి ఆచూకీ కోసం మొబైల్ నంబర్లు, ఫుడ్ డెలివరీ వివరాలు సేకరించి నిఘా పెట్టారు. అహ్మదాబాద్‌లోని వడజ్ ప్రాంతానికి చెందిన డెలివరీ బాయ్ నిపమ్‌ను అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో నిందితుడు ఐఐఎం క్యాంపస్‌లో ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించినట్లు అంగీకరించాడు. విద్యార్థుల వాంగ్మూలాలను నమోదు చేయడంతోపాటు సీసీటీవీ ఫుటేజ్, ఇతర డాక్యుమెంటరీ సాక్ష్యాలను పరిశీలిస్తారు.